Share News

Dr. Duvvuri Subbarao: యువతరం బహుముఖ ప్రతిభ కనబరచాలి

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:53 AM

విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న కోర్సుల్లో ప్రావీణ్యం సాధిస్తే సరిపోదని, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా బహుముఖ ప్రతిభ కనబరచాలని ప్రముఖ ఆర్థిక వేత్త...

Dr. Duvvuri Subbarao: యువతరం బహుముఖ ప్రతిభ కనబరచాలి

  • ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

విజయవాడ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న కోర్సుల్లో ప్రావీణ్యం సాధిస్తే సరిపోదని, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా బహుముఖ ప్రతిభ కనబరచాలని ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ దువ్వూరి సుబ్బారావు పిలుపునిచ్చారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా మంగళవారం సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. వివిధ శాస్ర్తాల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం నేటి పోటీ ప్రపంచంలో అవసరమని సూచించారు. యువతరం బలహీనతలను అధిగమించాలని, ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉండాలని, ఏ పనిచేసినా చివరి వరకు ఆసక్తి కనబరచడంతో పాటు ఆనందాన్ని ఇచ్చేలా ఉండడమే జీవితమన్నారు. ఆర్బీఐ గవర్నరుగా ఐదేళ్ల తన పదవీ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానన్నారు. ధరల నియంత్రణ ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం తదితర రిజర్వ్‌ బ్యాంకు విధులను సమర్థంగా నిర్వహించానని తెలిపారు. అపజయాలే విజయానికి సోపానాలని, మూలాలు మరిచిపోకుండా ఉంటూనే ఎదగవచ్చని హితవు పలికారు. సివిల్స్‌ ర్యాంకు సాధించగానే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు నివాసభూములు, పేదలందరికీ లబ్ధి చేకూర్చడమే బలమైన ఆర్థిక వ్యవస్థ మొదటి సూత్రమని దువ్వూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వూరి సుబ్బారావు, ఆయన సతీమణి ఊర్మిళా రాఘవన్‌ను సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు మలినేని రాజయ్య, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, డైరెక్టర్‌ వేమూరి బాబూరావు సత్కరించారు.

Updated Date - Nov 26 , 2025 | 04:54 AM