Kurnool: నెరవేరిన యువగళం పాదయాత్ర హామీ
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:25 AM
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీ నెరవేరింది. 30 ఏళ్ల పేదల స్వప్నం నెరవేరింది. రూ.లక్షల విలువైన స్థలం సొంతం కావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
కర్నూలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
కర్నూలు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీ నెరవేరింది. 30 ఏళ్ల పేదల స్వప్నం నెరవేరింది. రూ.లక్షల విలువైన స్థలం సొంతం కావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. వివరాలివీ.. కర్నూలు రైల్వే స్టేషన్ వెనుక, అశోక్ నగర్ పంప్‌హౌస్ వద్ద 150 మంది కుటుంబాలకు చెందిన నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో పూరి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. 30 ఏళ్లుగా వారు అక్కడే ఉంటున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం వారిని ఖాళీ చేయించడానికి ప్రయత్నాలు చేసిందే తప్ప, ఉన్నచోటే పట్టాలివ్వాలన్న వారి గోడును ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా పేదలంతా అప్పటి టీడీపీ ఇన్‌చార్జి టీజీ భరత్ చొరవతో నారా లోకేశ్‌ను కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అధికారం వచ్చిన తక్షణమే పట్టాలిస్తానని లోకేశ్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. 2025 జనవరిలో తీసుకొచ్చిన జీవో నంబరు 30 మేరకు మంగళగిరిలో ఇలాంటి పేదలకు పట్టాలు ఇవ్వగా, అదే జీవో ఆధారంగా కర్నూలులో పేదలకు తాజాగా రూ.కోట్ల విలువైన స్థలాన్ని అప్పగిస్తూ పట్టాలిచ్చారు. తన జన్మదినం సందర్భంగా మంత్రి టీజీ భరత్ మంగళవారం వారికి పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేసీ బి.నవ్య తదితరులు పాల్గొన్నారు.