Youth Drowns at Reservoir: ప్రాణం తీసిన సెల్ఫీ వీడియో
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:21 AM
అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని భైరవాన్‌తిప్ప ప్రాజెక్టు వద్ద సెల్ఫీ వీడియో తీసుకుం టూ నీట మునిగి ఓ యువకుడు మృతి చెందాడు...
బీటీపీ రిజర్వాయర్ వద్ద నీట మునిగిన యువకుడు
గుమ్మఘట్ట, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని భైరవాన్‌తిప్ప ప్రాజెక్టు వద్ద సెల్ఫీ వీడియో తీసుకుం టూ నీట మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు త్రుటిలో తప్పించుకున్నాడు. రిజర్వాయర్ ఆరో గేటు నుంచి శనివారం నీటిని విడుదల చేస్తారని తెలుసుకుని చుట్టుపక్క ప్రాంతాల యువకులు చూసేందుకు వెళ్లారు. సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలో రాయదుర్గం పట్టణానికి చెందిన మహమ్మద్ ఫైజ్ (20) గేటు ఎత్తగానే డ్యాం దిగువ భాగాన పారుతున్న నీటిలోకి దిగి వెనక్కు నడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న గుంతను గమనించకుండా అడుగువేసి మునిగిపోయాడు. అతని వెంట వెళ్లిన నోమన్.. ప్రమాదాన్ని పసిగట్టి బయటకు వచ్చేశాడు. విషయం తెలియగానే జలవనరుల శాఖ అధికారులు డ్యాం గేటు దించి మత్స్యకారుల సాయంతో గాలించి యువకుడి మృతదేహాన్ని వెలికి తీసి రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుమ్మఘట్ట ఎస్‌ఐ ఈశ్వరయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.