Share News

Minister Lokesh: మీ ప్రాజెక్టు.. మా బాధ్యత

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:40 AM

ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తరువాత అది మీ ప్రాజెక్టు కాదు. పూర్తి బాధ్యత మాది అని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు.

Minister Lokesh: మీ ప్రాజెక్టు.. మా బాధ్యత

  • పారిశ్రామికవేత్తలకు లోకేశ్‌ భరోసా

  • ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపు

  • ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడులకు సులభతర విధానం

  • పాఠశాల వ్యవస్థ బలోపేతానికి ఐదుగురు సభ్యుల సలహా మండలి

విశాఖపట్నం/మధురవాడ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తరువాత అది మీ ప్రాజెక్టు కాదు. పూర్తి బాధ్యత మాది’’ అని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. విడి భాగాల తయారీ నుంచి పోటీతత్వం వరకు భారతదేశ ఏరోస్పేస్‌ తయారీ, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఆపరేషన్స్‌) రంగాలను వేగవంతం చేయడం అనే అంశంపై విమానయాన శాఖ, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ర్టీ (సీఐఐ), సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ సంయుక్తంగా విశాఖలోని ఓ హోటల్‌లో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్‌షిప్‌ వల్లే మిట్టల్‌, గూగుల్‌ వంటి గ్లోబల్‌ కంపెనీలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని చంద్రబాబు ప్రారంభించినప్పుడు 5వేల ఎకరాలు ఎందుకని కొందరు విమర్శించారని, ఇప్పుడు దానివల్ల వచ్చే ఆదాయం తెలంగాణ రాష్ట్ర జీడీపీలో 11శాతం ఉందని వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు పని చేస్తోందని పేర్కొన్నారు. సుందరమైన విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టమ్‌ ఉందని చెప్పారు. విజన్‌-2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏటా 15శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని తెలిపారు. అక్టోబరులో మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ పనులు ప్రారంభం కాబోతున్నాయని, ఆసియాలోనే అతిపెద్దదైన గూగుల్‌ డేటా సెంటర్‌ విశాఖకు రానుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్‌ పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టు పనులను రాయలసీమలో రెన్యూ సంస్థ ప్రారంభించిందని చెప్పారు.


రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సంస్థలకు సులభతరమైన అనుమతుల కోసం విధానపరమైన మార్పులు తెచ్చినట్టు వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి, కొత్త ఆవిష్కరణలు చేయాలని లోకేశ్‌ కోరారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏరోస్పేస్‌ రంగ అభివృద్ధికి డిమాండ్‌తో పాటు అందుకు తగిన సామర్థ్యం కూడా ఉందన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యుత్తమ పాలసీలు ఏపీలో అమలు అవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, సీఐఐ ఏపీ చైర్మన్‌ మురళీకృష్ణ, ఏపీ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సీఈవో సాయికాంత్‌ వర్మ, ఏపీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ సలహాదారు సతీశ్‌రెడ్డి, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు సీఈవో కరణ్‌బీర్‌ సింగ్‌ కల్రా, సీఐఐ డిప్యూటీ డైరెక్టర్‌ సోనాల్‌ బెనర్జీ, సైయంట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ బీవీఆర్‌ రెడ్డి పాల్గొన్నారు.


ఒకటే రాజధాని... అభివృద్ధి వికేంద్రీకరణ

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని లోకేశ్‌ పేర్కొన్నారు. విశాఖ నగరం మధురవాడ ‘వి’ కన్వెన్షన్‌లో శుక్రవారం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అర్థసమృద్ధి-2025 రెండు రోజుల సదస్సును మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఒకవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు సంపద వృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సీఏల పాత్ర కీలకమని తెలిపారు. ఏఐ ఆధారిత ఆడిట్లతో పాటు సీఏలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో బ్రాండ్‌ అంబాసిడర్లుగా పనిచేయాలని కోరారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పరిపాలనలో ఏఐ వినియోగానికి బోనీబ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.

Updated Date - Aug 30 , 2025 | 03:41 AM