Young Innovator: డ్రోన్ ట్రాఫిక్‌పై 21 ఏళ్ల యువతి ఎంవోయూ
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:19 AM
విజయవాడకు చెందిన 21 ఏళ్ల తెలుగు అమ్మాయి ధవళ సాయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కర్నూలులో ప్రభుత్వం ఏర్పాటుచేసే డ్రోన్ సిటీలో తమ ప్రాజెక్టు ఏర్పాటు కోసం విశాఖ సదస్సులో...
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన 21 ఏళ్ల తెలుగు అమ్మాయి ధవళ సాయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కర్నూలులో ప్రభుత్వం ఏర్పాటుచేసే డ్రోన్ సిటీలో తమ ప్రాజెక్టు ఏర్పాటు కోసం విశాఖ సదస్సులో ప్రభుత్వంతో ఆమె ఒప్పందం చేసుకుంది. ఆమె బిజినెస్ ఫైనాన్స్‌లో డిగ్రీ చేసి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. అక్కడి ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుని డ్రోన్ల తయారీ, వినియోగంపై దృష్టిసారించింది. డ్రోన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి తాను ప్రొఫెసర్లతో కలిసి పనిచేస్తున్న అల్గోబొటిక్స్ తరఫున సీఎం సమక్షంలో శుక్రవారం ఎంఓయూ పత్రాలు మార్చుకుంది. ‘ఆంధ్రజ్యోతి’తో తన ఆలోచనలు పంచుకుంది. ‘‘ఏపీలో డ్రోన్లను ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్నారు. హెల్త్ ఎమర్జన్సీ, సరుకుల డెలివరీ తదితర వాటికి కూడా డ్రోన్లను ఉపయోగించే రోజులు త్వరలో వస్తాయి. ఒక్కో డ్రోన్‌ను ఒక్కో పైలట్ కంట్రోల్ చేయడం అంటే చాలా ఎక్కువ పని. ఒక్క డివైజ్‌తో వందకు పైగా డ్రోన్లను కంట్రోల్‌చేసే టెక్నాలజీ వస్తోంది. అందులోనే మా కంపెనీ పనిచేస్తోంది. ప్రముఖ సైంటిస్ట్ ఘోష్, కో-ఫౌండర్ ఓంకార్ చోప్రాతో కలిసి ప్రాజెక్ట్ చేపట్టాం’ అని వివరించింది.