Young Man Dies During Army Recruitment: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో విషాదం
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:15 AM
దేశాన్ని కాపాడాలని ఎన్నో ఆశలతో కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వచ్చి పరుగు ..
అగ్నిపథ్‌లో పాల్గొన్న యువకుడి మృతి
కాకినాడ క్రైం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని కాపాడాలని ఎన్నో ఆశలతో కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వచ్చి పరుగు పందెంలో పాల్గొన్న యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. మృతుడి తండ్రి అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేటకు చెందిన గండ్రేటి సాయికిరణ్ (20) డిగ్రీ వరకు చదువుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. మొదటి నుంచీ దేశ రక్షణ కోసం సైనికుడు అవ్వాలనే లక్ష్యంతో ఉండేవాడు. ఈ క్రమంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతోందని తెలుసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. పోటీలో మంగళవారం పాల్గొనాల్సి ఉండడంతో సోమవారం అర్ధరాత్రి కాకినాడ చేరుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు 1600 మీటర్ల పరుగు పందేనికి హాజరయ్యాడు. కొంతదూరం వెళ్లేసరికి సాయికిరణ్ హృదయ స్పందన అధికమై ఒక్కసారిగా కుప్పకూలాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని ఆర్మీ సిబ్బంది హుటాహుటిన సుమారు ఐదు గంటల ప్రాంతంలో జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో ప్రథమ చికిత్స అనంతరం మెడికల్ వార్డు (ఎం3)కు తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సాయికిరణ్ మరణించినట్టు వైద్యులు అప్పలనాయుడుకు చెప్పారు. ఆ వార్త విన్న ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కుప్పకూలిపోయాడు. ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే పోస్ట్‌మార్టం నిర్వహించి శరీరాన్ని కోస్తారని భయపడి కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు. కాగా.. ఈ వ్యవహారంపై ఎటువంటి పోలీసు కేసు నమోదు కాలేదు.