Elephant Stampede: ఏనుగుల తొక్కిసలాటలో గున్న ఏనుగు మృతి
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:04 AM
పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ గున్న ఏనుగు మృతి చెందింది. ఈ ప్రాంతంలో....
చెరువులోకి దిగిన సందర్భంలో ఘటన
పార్వతీపురం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ గున్న ఏనుగు మృతి చెందింది. ఈ ప్రాంతంలో కొద్దిరోజులుగా సంచరిస్తున్న తొమ్మిది గజరాజులు ఆ గ్రామ సమీపంలో ఉన్న ముదరై చెరువులో ఒకేసారి దిగాయి. దీంతో వాటి మధ్య జరిగిన తొక్కిసలాటలో ఓ గున్న ఏనుగు మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాకర్లు వెంటనే అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. రేంజర్ మణికంఠ , ఇతర సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని చనిపోయిన గున్న ఏనుగును బయటకు తీయించారు.
భయాందోళనలో ప్రజలు
గున్న పిల్ల మృతి చెందడంతో మిగిలిన 8 ఏనుగులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఘీంకరించాయి. దీంతో లక్ష్మీనారాయణపురం ప్రజలు బెంబేలెత్తిపోయారు. గజరాజులు ప్రస్తుతం అక్కడే సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారంతా భయాందోళన చెందుతున్నారు. గ్రామస్థులెవరూ ఒంటరిగా బయట తిరగరాదని అటవీశాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.