Share News

Minister Lokesh: జగన్‌.. మీకు ఆ అర్హత లేదు

ABN , Publish Date - Oct 07 , 2025 | 05:38 AM

కల్తీ మద్యం గురించి, నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది జగన్‌ గారూ అంటూ మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు.

Minister Lokesh: జగన్‌.. మీకు ఆ అర్హత లేదు

  • కల్తీ మద్యం నిందితులకు వత్తాసు పలకడం గురించి మీరు మాట్లాడకండి: మంత్రి లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ‘కల్తీ మద్యం గురించి, నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది జగన్‌ గారూ!’ అంటూ మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందించారు. తన సందేశానికి జగన్‌ ఆదివారం చేసిన స్పందనను ట్యాగ్‌ చేశారు. ‘‘కల్తీ మద్యం పట్టుకున్నది మా ప్రభుత్వం. కల్తీ మద్యం నిందితుల్లో టీడీపీ నేతలున్నా అరెస్టు చేయించింది మా ప్రభుత్వం. నిందితుల్లో ఇద్దరు మా పార్టీ వారుంటే తక్షణం వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు మా అధ్యక్షుడు. మీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో మరిచిపోయి ఆరోపణలు చేయొద్దు. డబ్బు కక్కుర్తితో జే బ్రాండ్స్‌తో వేల మంది ప్రజల ప్రాణాలు తీసింది మీరు. మీ జమానాలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే, సహజ మరణాలని నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. ‘పోతే పోయారు.. ఇంకా ఏడుస్తారేంటి?’ అన్న మీ మంత్రి జోగి రమేశ్‌ అహంకారం ఇప్పటికీ ప్రజలు గుర్తించుకున్నారు’’ అంటూ లోకేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 06:57 AM