Share News

బుసకాసురులు!

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:42 AM

బుసకాసురులు బరి తెగించారు. మచిలీపట్నం నార్త్‌ మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో యథేచ్ఛగా బుసక దందా సాగిస్తున్నారు. ముడా, ప్రభుత్వ భూములనే లక్ష్యంగా చేసుకుని కరగ్రహారం, గోపువానిపాలెం, మంగినపూడి, చినకరగ్రహారం గ్రామాల్లో ప్రధానంగా తవ్వకాలు జరిపి ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. వీరికి ముడా సర్వేయర్‌ ఒకరు, ఆయా గ్రామాల వీఆర్వోలు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే, రెవెన్యూ అధికారులు వచ్చేసరికి అక్కడి నుంచి పరారవుతున్నారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్లోని ప్రజల వద్దకు వెళ్లి బుసక తవ్వకాలను అడ్డుకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. మాకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ బుసక దందాను కొనసాగిస్తున్నారు.

 బుసకాసురులు!

- తీర గ్రామాల్లో యథేచ్ఛగా బుసక దందా!

- ముడా, ప్రభుత్వ భూముల్లోనే ప్రధానంగా తవ్వకాలు

- కరగ్రహారం, గోపువానిపాలెం, మంగినపూడి, చినకరగ్రహారం గ్రామాల్లో ప్రధానంగా..

- అక్రమార్కులకు ముడా సర్వేయర్‌, వీఆర్వోల సహకారం!

- తహసీల్దార్‌కు ఆయా గ్రామాల ప్రజల ఫిర్యాదు

- రెవెన్యూ అధికారులు వెళ్లే సమయానికి అంతా గప్‌చుప్‌

- బుసక తవ్వకాలను అడ్డుకుంటే అంతు చూస్తామని స్థానికులకు అక్రమార్కుల బెదిరింపులు

- అధికార, ప్రతిపక్ష నేతల కనుసన్నల్లోనే వ్యవహారం

బుసకాసురులు బరి తెగించారు. మచిలీపట్నం నార్త్‌ మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో యథేచ్ఛగా బుసక దందా సాగిస్తున్నారు. ముడా, ప్రభుత్వ భూములనే లక్ష్యంగా చేసుకుని కరగ్రహారం, గోపువానిపాలెం, మంగినపూడి, చినకరగ్రహారం గ్రామాల్లో ప్రధానంగా తవ్వకాలు జరిపి ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. వీరికి ముడా సర్వేయర్‌ ఒకరు, ఆయా గ్రామాల వీఆర్వోలు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే, రెవెన్యూ అధికారులు వచ్చేసరికి అక్కడి నుంచి పరారవుతున్నారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్లోని ప్రజల వద్దకు వెళ్లి బుసక తవ్వకాలను అడ్డుకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. మాకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ బుసక దందాను కొనసాగిస్తున్నారు.

ఆంధ్ర జ్యోతి-మచిలీపట్నం :

మచిలీపట్నం నార్త్‌ మండలం కరగ్రహారం గ్రామంలోని 15, 16 సర్వే నెంబర్లలో, చినకరగ్రహారంలోని 28, 32, 33, 38, 42 సర్వే నెంబర్లలో, మంగినపూడి, గోపువానిపాలెంలో 153, 157 సర్వే నెంబర్లలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అలాగే పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వానికి రైతులు విక్రయించిన భూములతోపాటు బే ఆఫ్‌ బెంగాల్‌ భూములు ఉన్నాయి. ఈ భూముల నుంచి ఇటీవల కాలంలో బుసక అక్రమ తవ్వకాలు, రవాణా అధికమైంది. ఈ ప్రాంతంలోని భూములు ఇసుక నేలలు కావడంతో వర్షం కురిసినా బుసక రవాణాకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ముడాలో పనిచేసే సర్వేయర్‌ ఒకరు ముడా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపై పగలు సమయంలో సరిహద్దులు బుసక అక్రమార్కులకు చూపుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు ఆయా గ్రామాల్లో పనిచేసే వీఆర్వోలను ప్రసన్నం చేసుకున్న బుసక అక్రమార్కులు కొన్ని రోజులుగా జోరుగా ప్రభుత్వ భూముల నుంచి బుసకను తవ్వేసి విక్రయించేస్తున్నారు. రాత్రయితే చాలు ఎక్స్‌ కవేటర్‌లు, ట్రాక్టర్‌లు పెట్టి బుసకను తవ్వి విక్రయిస్తున్నారు. చినకరగ్రహారం గ్రామంలో 188 ఎకరాల ముడా భూములతో పాటు వందలాది ఎకరాల బే అఫ్‌ బెంగాల్‌ భూముల నుంచి వేలాది ట్రక్కుల బుసకను తవ్వేశారని ఇటీవల గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అధికారులు తనిఖీ కోసం వెళ్తుంటే కొందరు వీఆర్వోలు ముందస్తుగా అక్రమార్కులకు సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకరిద్దరు కూటమి నాయకులు అధికారులకు ఫోన్‌ చేసి మా వాళ్లే వదిలేయండని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

గ్రామస్థులు ఫిర్యాదు చేస్తే బెదిరింపులు

ఇటీవల కాలంలో ప్రభుత్వ భూముల నుంచి బుసక రవాణా అధికంగా చేస్తుండటంతో చినకరగ్రహారానికి చెందిన గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల పాటు రెవెన్యూ అధికారులు రాత్రి వేళలో బుసక తవ్వే ప్రాంతానికి వెళ్లేలోగానే, అధికారులు వస్తున్నారనే సమాచారం ముందస్తుగానే తెలుసుకున్న అక్రమార్కులు వెంటనే ట్రాక్టర్‌లు, ఎక్స్‌కవేటర్‌లను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేశారు. ఈ పరిణామాల అనంతరం అక్రమార్కులు చినకరగ్రహారం పంచాయతీ పరిధిలోని క్యాంప్‌బెల్‌ పేటకు చెందిన కొందరి గృహాల వద్దకు వెళ్లి బుసక తవ్వకాలపై మీరే అధికారులకు సమాచారం ఇచ్చారని, మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకుల మద్దతు మాకుందని, ఏమైనా చేస్తామని తీవ్రస్థాయిలో భయపెట్టినట్టు సమాచారం. స్థానిక పెద్దలు చోక్యం చేసుకుని గొడవ పెరగకుండా ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

మంగినపూడి, గోపువానిపాలెంలో ప్రతిపక్ష నాయకుల కనుసన్నల్లో..

మంగినపూడి, గోపువానిపాలెం గ్రామాల్లో ఇటీవల కాలం వరకు అధికార పక్షానికి చెందిన ఓ ద్వితీయశ్రేణి నాయకుడి కనుసన్నల్లో బుసక రవాణా జరిగేది. ఇతని ఆగడాలు అధికం కావడం, పార్టీకి చెడ్డపేరు వస్తుండటంతో కళ్లు తెరిచిన అధికారపార్టీ పెద్దలు అడ్డుకట్ట వేశారు. దీంతో ప్రతిపక్షానికి చెందిన వారు ఇదే అదనుగా ఈ రెండు గ్రామాల నుంచి బుసక తవ్వకాలను, విక్రయాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరిని తమతో వాటాదారులుగా కలుపుకుని యథేచ్ఛగా బుసక తవ్వకాలను కొనసాగిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్‌, పోలీస్‌ విభాగాల అధికారులు స్పందించి తీర గ్రామాల్లో బుసక రవాణాకు అడ్డుకట్టవేయాలని తీరప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:46 AM