Share News

Chittoor YCP Sarpanch: మామూలోడు కాదు.. మాయలోడు

ABN , Publish Date - Oct 08 , 2025 | 06:26 AM

చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యవహారం చివరకు వైసీపీ నాయకుల మెడకే చుట్టుకుంది.

 Chittoor YCP Sarpanch: మామూలోడు కాదు.. మాయలోడు

  • అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు.. వైసీపీ సర్పంచ్‌ కుట్ర.. పక్కన ఉన్న పాకకు నిప్పు పెడితే విగ్రహానికి అంటుకుంటుందని ముందస్తు ప్రణాళిక

  • టీడీపీపై బురద చల్లేందుకు నారాయణస్వామితో కలిసి కుట్ర

  • ఆధారాలతో సహా గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు

  • టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచి వైసీపీలోకి జంప్‌

  • వైసీపీ హయాంలో మట్టి అక్రమ రవాణా దందా

  • పంచాయతీ నిధుల దుర్వినియోగంతో చెక్‌ పవర్‌ కట్‌

చిత్తూరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యవహారం చివరకు వైసీపీ నాయకుల మెడకే చుట్టుకుంది. ఇందులో వైసీపీ సర్పంచ్‌ గోవిందయ్య హస్తం ఉందనే విషయం పోలీసుల దర్యాప్తులో బహిర్గతమైంది. విగ్రహానికి ఆనుకుని ఉన్న పాకకు ముందస్తు ప్రణాళిక ప్రకారం మంట పెట్టి.. దాన్ని టీడీపీ నాయకులపైకి నెట్టి.. వారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఆయన పన్నిన కుట్ర బయటపడింది. ఈ వ్యవహారంలో గోవిందయ్యను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

టీడీపీ సర్పంచ్‌గా గెలిచి వైసీపీలోకి..

వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె గ్రామ పంచాయతీ సర్పంచి స్థానానికి టీడీపీ మద్దతుతో గోవిందయ్య బరిలో నిలిచారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అక్రమ ఏకగ్రీవాలు చేసుకోగా, అక్కడి టీడీపీ నాయకులు మాత్రం గట్టిగా పోరాడి ఎన్నికలు జరిపించారు. ప్రచారానికి కూడా డబ్బులు లేని గోవిందయ్యను అభ్యర్థిగా నిలబెట్టి చందాలు వేసుకుని.. 250 ఓట్ల మెజార్టీతో ఆయనను గెలిపించారు. గెలిచిన వెంటనే ఆయన నారాయణస్వామి సమక్షంలో వైసీపీలో చేరి, ఆయనకు ముఖ్య అనుచరుడిగా మారిపోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి అండతో అక్రమ మట్టి తరలింపు వ్యాపారం చేసి రెండు చేతులా ఆర్జించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మట్టి తరలింపును అడ్డుకున్న వీఆర్వో మీదకు ఎక్స్‌కవేటర్‌ ఎక్కించే ప్రయత్నం చేయడంతో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


నిధుల దుర్వినియోగం

బొమ్మయ్యపల్లె పంచాయతీలోని సుమారు రూ.30 లక్షల నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు, పంచాయతీ తీర్మానాలు లేకుండా ఇష్టానుసారంగా పనులు చేయడంతో వార్డు సభ్యులు.. సర్పంచ్‌ గోవిందయ్యపై గతేడాది డీపీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై షోకాజ్‌ ఇచ్చినా... వివరణ ఇవ్వకపోవడంతో ఆయన చెక్‌ పవర్‌ను కలెక్టర్‌ రద్దు చేశారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు సతీశ్‌నాయుడు, పయని తదితరులపై గోవిందయ్య కక్ష పెంచుకున్నారు. కొన్నాళ్లకు ఆయన చెక్‌ పవర్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో రూ.8.5 లక్షలు ఉండగా, రూ.12 లక్షల మేరకు పనులు చేసినట్లు దొంగ బిల్లులు పెట్టడంతో వార్డు మెంబర్లు మళ్లీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఖాతాలో నిధులున్నా, డ్రా చేసుకోలేకపోతున్నాననే కసి గోవిందయ్యలో ఉంది.


4నెలల క్రితం విగ్రహం కింద షెడ్డు ఏర్పాటు

దేవళంపేట బస్టాండు సమీపంలో అంబేడ్కర్‌ విగ్రహం ఉంది. దీనికి పక్కనే పంచాయతీకి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో సర్పంచ్‌ మనిషిగా ఉన్న ఓ మహిళ షాపు నడుపుతున్నారు. విగ్రహానికి ఆనుకుని 4నెలల కిందట ఆమె తాత్కాలికంగా పాక ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు సహకరించిన గోవిందయ్య... ఆ షెడ్డుకు నిప్పు పెడితే అంబేడ్కర్‌ విగ్రహం కూడా కాలుతుందని, దీన్ని రాజకీయంగా వాడుకోవచ్చని పథకం వేశారు. ముందస్తు ప్రణాళిక మేరకు గత గురువారం షెడ్డుకు నిప్పు పెట్టించడంతో విగ్రహానికి సెగ తగిలి, కాళ్ల భాగం నల్లగా మారింది. దీన్ని వాడుకుని గోవిందయ్యతో కలిసి జాతీయ స్థాయిలో టీడీపీని ఇబ్బంది పెట్టాలని నారాయణస్వామి ప్రయత్నించారు. అయితే పోలీసులు ఈ కుట్రను వెలికి తీసి సర్పంచ్‌ను కటకటాల్లోకి నెట్టడంతో వైసీపీకి భంగపాటు తప్పలేదు.


వైసీపీ దొంగలు దొరికారు: టీడీపీ

తిరుపతి(జీవకోన): దేవళంపేటలో అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పంటుకున్న ఘటన పూర్తిగా వైసీపీ కుట్రలో భాగమేనని టీడీపీ ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, వీఎం థామస్‌, మురళీమోహన్‌, నెలవల విజయశ్రీ, యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే థామస్‌ మాట్లాడుతూ ఈ ఘటనలో టీడీపీ నేతలను ఇరికించాలని సర్పంచ్‌ గోవిందయ్య డ్రామాలాడి చివరకు జైలుకు వెళ్లారని చెప్పారు. గోవిందయ్యే స్థానికంగా ఉన్న మహిళతో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు నిరూపితమైందని తెలిపారు. ఎస్సీల దేవుడు అంబేడ్కర్‌ అని, ఈ ఘటనకు పాల్పడిన గోవిందయ్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బేసిక్‌ నాలెడ్జ్‌ కూడా లేని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ విషయంపై మాట్లాడుతున్న మాటలు జోకర్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రూ.3,500 కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడైన నారాయణస్వామి మెంటలోడు అని, ఆయనకు ధైర్యం ఉంటే తమపై అటాక్‌ చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మురళీమోహన్‌ మాట్లాడుతూ దేవళంపేట ఘటనలో దొంగలు దొరికారని, రాజకీయ మంట పెట్టి చలి కాచుకోవాలని చూసిన వీరి పరిస్థితి ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ కమిషన్‌కు లేఖ రాసిన వైసీపీ ఎంపీకి నిజాయితీ ఉంటే ఈ ఘటన వెనకున్నవారిని కూడా శిక్షించాలని కోరాలని సూచించారు.

Updated Date - Oct 08 , 2025 | 06:28 AM