YCP Sand Mining: వైసీపీ ఇసుక దోపిడీ 781 కోట్లు
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:46 AM
వైసీపీ హయాంలో గోదావరి నదిలో రూ.781.25 కోట్ల అక్రమ ఇసుక దందా సాగిందని అధికారులు తేల్చారు. ఈ ప్రాంతంలో సుమారు 14 చోట్ల అక్రమ తవ్వకాలు జరిపి, 125 లక్షల టన్నుల ఇసుక అమ్మేసుకున్నారు.
గోదావరిలో 125 లక్షల టన్నులు బొక్కేశారు
టన్ను రూ.475 నుంచి 625 వరకూ అమ్ముకున్నారు
నివేదిక సిద్ధం చేసిన మైన్స్ అధికారులు
రేపోమాపో ప్రభుత్వానికి సమర్పణ
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
వైసీపీ హయాంలో గోదావరి నదిలో రూ.781.25 కోట్ల అక్రమ ఇసుక దందా సాగిందని అధికారులు తేల్చారు. ఈ ప్రాంతంలో సుమారు 14 చోట్ల అక్రమ తవ్వకాలు జరిపి, 125 లక్షల టన్నుల ఇసుక అమ్మేసుకున్నారు. అప్పట్లో డీసిల్టేషన్ పాయింట్లలో టన్ను రూ.625కు విక్రయించారు. ఈ లెక్కన సుమారు రూ.781.25 కోట్ల ఇసుక దందా సాగిందని అంచనా. ఓపెన్ రీచ్‌లలో టన్ను ఇసుక రూ.475కు విక్రయించారు. ఈ లెక్కన చూసినా.. రూ.593.75 కోట్ల విలువైన ఇసుక దోపిడీ జరిగినట్టు లెక్క. అయితే దీనికి బాధ్యులెవరో తేల్చాల్సి ఉంది. ఎందుకంటే.. వైసీపీ హయాంలో (2021 నుంచి 2024 వరకూ) తొలుత జేపీ సంస్థ పేరిట, ఎవరూ లేకుండా కొంతకాలం, ప్రతిమా ఇన్‌ఫ్రా పేరుతో మరికొంతకాలం ఇసుక దోపిడీ సాగింది. ఇసుక సరఫరా అంతా నగదు లావాదేవీల్లోనే సాగింది. బిల్లులు సక్రమంగా చూపకుండా దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై అప్పట్లోనే కొందరు కోర్టుకు వెళ్లగా నాటి కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో ఆనాటి ఎస్పీ జగదీశ్‌తో కోర్టుకు తప్పుడు నివేదిక ఇప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమాలపై కోర్టుల ఆదేశాల మేరకు విచారణకు ఆదేశించింది. ఏపీ స్టేట్ అప్లికేషన్ సెంటర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక తవ్విన ప్రాంతాలను గుర్తించి వాటి ఛాయా చిత్రాలు కూడా తీశారు. వీటి ఆధారంగా జిల్లాలో ఎక్కడడెక్కడ.. ఎంతమేరకు ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిది.
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఇసుక కమిటీ ఆదేశాల మేరకు మైన్స్, ఇతర అధికారులు ఆరా తీసి అక్రమాలను నిగ్గు తేల్చారు. జిల్లాలో రాజమండ్రి వైపు, కొవ్వూరు వైపు గోదావరిలోనూ అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినట్టు గుర్తించారు. 2023 మే నెలలో జేపీ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత వైసీపీ పెద్దల ప్రోత్సాహంతో రకరకాల వ్యక్తులు ఇసుక దందా చేశారు. తర్వాత ప్రతిమా అనే సంస్థను ముందు పెట్టి గోదావరిలో డ్రెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. కొవ్వూరు వైపు ఒకరికి, రాజమండ్రి వైపు మరొకరికి కాంట్రాక్టుకు ఇచ్చి, అడ్వాన్సుగా రూ.కోట్లు కట్టించుకుని ఇసుక అక్రమాలను ప్రోత్సహించారు. ఈ నేపఽథ్యంలో కొవ్వూరు వైపు కాంట్రాక్టు తీసుకున్న ప్రేమ్‌రాజు అనే వ్యక్తి కప్పం కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చాలాచోట్ల బోట్స్‌మన్ సొసైటీలను ముందు పెట్టి దోపిడీ చేశారు. దీంతో ఇసుక ఎవరు తవ్వారంటే.. బోట్స్ మన్ సొసైటీల మీదకు నేరం మోపవలసి వస్తుంది. అయితే దందా చేసింది మాత్రం.. వైసీపీ పెద్దల ప్రోత్సాహంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులే. ఇసుక అక్రమాలను గుర్తించిన అధికారులు.. ఇటీవల జేపీ సంస్థకు నోటీసివ్వగా.. తమకు సంబంధం లేదని సమాధానమిచ్చినట్టు తెలిసింది. మరి ఈ అక్రమాల గుట్టు ప్రభుత్వం ఎలా తేలుస్తుందో చూడాలి.