Machilipatnam: వైసీపీ కార్యాలయం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో పిటిషన్
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:58 AM
మచిలీపట్నం వైసీపీ కార్యాలయాని కి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసేలా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మచిలీపట్నం అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ వైస్ చైౖర్మన్‌ను ఆదేశించాలని కోరుతూ...
ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం వైసీపీ కార్యాలయాని కి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసేలా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మచిలీపట్నం అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ వైస్ చైౖర్మన్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ తీర్పును రిజర్వ్ చేశారు. పురపాలకశాఖ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది వై. నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించామని తెలిపారు. రాజకీయ కారణాలతో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు మున్సిపాలిటీ కాలువపై వేసిన ర్యాంప్‌ను తొలగించారని పేర్కొన్నారు. కార్పొరేషన్ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ ఏసీఎస్ బోస్ వాదనలు వినిపిస్తూ.. కార్యాలయం నిర్మాణానికి 2024, జూన్ 21న అప్లికేషన్ పెట్టారన్నారు. బిల్డింగ్ ప్లాన్‌లో లోపాలు ఉన్నాయని గుర్తించి, నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని సరిచేయకుండా నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 18 మీటర్ల రోడ్డు ఉండాల్సిన చోట 12 మీటర్లు మాత్రమే వదిలారని వివరించారు. ప్లాన్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదలలేదన్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ప్లాన్ ప్రకారమే నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ పిటిషనర్ ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని వెల్లడించారు. చట్టనిబంధనలు పాటించనప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.