Minister Atchannaidu: ఫిష్ ఆంధ్ర పేరుతో వైసీపీ భారీ దోపిడీ
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:23 AM
ఫిష్ ఆంధ్ర పేరుతో గత వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెగబడిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద...
రూ.155 కోట్లలో 51.44 కోట్లే ఖర్చు చేశారు: అచ్చెన్న
అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెగబడిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ కింద కేంద్రం ఇచ్చిన నిధులను దోచుకోవడానికి జగన్ వేసిన కొత్త ఎత్తుగడే ఈ పథకమని మండిపడ్డారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఫిష్ ఆంధ్ర కోసం రూ.155.69 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించిన గత ప్రభుత్వం కేవలం రూ.51.44 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. నంద్యాల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని విజయ డెయిరీల్లో అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’
కౌలు రైతులకు ఖరీఫ్ సీజన్‌లో కార్డులివ్వకపోవడంతో అన్నదాత సుఖీభవ పథకం మొదట విడత నిధులు అందించలేకపోయామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రెండో విడతలో వారికి కార్డులిచ్చి రూ.320 కోట్లు అందిస్తామని అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు. కాగా, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల అమలుతో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల వాగ్దానాలను సీఎం చంద్రబాబు తన అనుభవంతో చాకచక్యంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రశంసించారు.