Share News

Minister Lokesh: శ్రీవారి సొత్తునూ స్వాహా చేశారు

ABN , Publish Date - Sep 21 , 2025 | 04:37 AM

రాష్ట్రంలో గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్‌ గ్యాంగ్‌.. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ స్వాహా చేశారని మంత్రి లోకేశ్‌ ఆరోపించారు.

Minister Lokesh: శ్రీవారి సొత్తునూ స్వాహా చేశారు

  • దేవుడినీ వదలని వైసీపీ గ్యాంగ్‌

  • భూమన అండతో పరకామణిలో కోట్లు దోచేశారు: మంత్రి లోకేశ్‌ ధ్వజం

అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్‌ గ్యాంగ్‌.. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ స్వాహా చేశారని మంత్రి లోకేశ్‌ ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై శనివారం ఆయన ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘జగన్‌ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్‌ అడ్ర్‌సగా మార్చారు. తాడేపల్లి ప్యాలెస్‌ ఆశీస్సులు, నాటి టీటీడీ చైౖర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. రూ.కోట్ల విలువైన సొత్తు కొల్లగొట్టారు. ఈ డబ్బును రియల్‌ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్‌ వరకు వాటాలు అందాయని నిందితులే చెబుతున్నారు.’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు రూ.వందల కోట్లను టీటీడీ ఉద్యోగి రవికుమార్‌ దోచుకుని వెళ్లినప్పుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్‌ రెడ్డి.. అతని మనుషులు ఏకంగా ఈ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ‘భక్తులు మహాప్రసాదంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అన్నప్రసాదాన్ని భ్రష్ఠుపట్టించారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్లవద్దని, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దని చంద్రబాబు బతిమాలి చెప్పారు.. అయినా వినలేదు.’ అని లోకేశ్‌ తెలిపారు. ‘‘ఏడుకొండలవాడు చాలా పవర్‌ఫుల్‌ స్వామి. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా ఏం జరుగుతుందో తెలిసీ జగన్‌, భూమన ఏకంగా పరకామణినే దోచేశారని విమర్శించారు. ‘గుడిని, గుడిలో హుండీ ని దోచేసిన పాపాలతో గత పాలకుడు జగన్‌ గ్యాంగ్‌ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


రూ.10వేల రికవరీతో సరిపెట్టారు: బుచ్చి రాంప్రసాద్‌

సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా పేర్కొనే తిరుమల శ్రీవారి సన్నిధిలోనూ వైసీపీ నేతలు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చిరాంప్రసాద్‌ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతల అండతో పరకామణిలో రవికుమార్‌ అనే ఉద్యోగి రూ.113 కోట్లు దోచుకుంటే కేవలం రూ.10వేలు లోపు సొత్తును రివకరీ చేసి, కేసును మమ అనిపించారని విమర్శించారు.

Updated Date - Sep 21 , 2025 | 04:39 AM