Share News

Judicial Magistrate Court: జైలుకు జోగి బ్రదర్స్‌

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:44 AM

నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు రిమాండ్‌ విధించింది.

Judicial Magistrate Court: జైలుకు జోగి బ్రదర్స్‌

  • రమేశ్‌, రాముకు 13 వరకు రిమాండ్‌

  • తెల్లవారుజామున 5 గంటలకు తీర్పు

  • నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు

విజయవాడ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తున్నట్టు న్యాయాధికారి జి.లెనిన్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. జోగి సోదరులను నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించారు. ముందుగా విజయవాడ జిల్లా జైలుకు తరలించి అక్కడి నుంచి నెల్లూరు కేంద్ర కారాగారానికి పంపాలని స్పష్టం చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎంకే విజయలక్ష్మి, జోగి సోదరుల తరఫున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మన్మథరావు వాదనలు వినిపించారు.

జోగి సోదరుల కనుసన్నల్లోనే...

ముందుగా ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎంకే విజయలక్ష్మి వాదనలు వినిపించారు. ‘‘జోగి సోదరులకు, ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జోగి సోదరులు వెనకుండి జనార్దనరావును నడిపించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులోను, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోను కల్తీ మద్యం తయారీ మొత్తం వారి కనుసన్నల్లోనే జరిగింది. దీనికి సంబంధించి జోగి సోదరులకు అద్దేపల్లి సోదరులు దఫదఫాలుగా లక్షలాది రూపాయల ముడుపులు ముట్టజెప్పారు. కొన్నిసార్లు ఈ డబ్బులను ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద తీసుకున్నట్టు ఇప్పటికే అరెస్టయిన నిందితులు వాంగ్మూలంలో వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీని ప్రారంభించడానికి ముందు జోగి సోదరులు పలుమార్లు అద్దేపల్లి జనార్దనరావును కలిశారు. జనార్దనరావు ఈ విషయంపై చర్చించడానికి జోగి రమేశ్‌ ఇంటికి వెళ్లారు. వారిద్దరి మధ్య ఫోన్లలో సంభాషణ మొత్తం వాట్సాప్‌ ద్వారా జరిగింది. రమేశ్‌, జనార్దనరావు కలిసి ఆఫ్రికా పర్యటనలకు వెళ్లారు’’ అని పీపీ వివరించారు. జోగి సోదరుల తరఫున పొన్నవోలు వాదనలు వినిపిస్తూ.. ప్రధాన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా జోగి సోదరులను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో ఏర్పాటైన సిట్‌ గానీ, ఎక్సైజ్‌ పోలీసులు గానీ ఎలాంటి ఆధారాలను సేకరించలేదని వివరించారు.


జైలు నుంచి జైలుకు

వాదప్రతివాదనలను విన్న తర్వాత న్యాయాధికారి జి.లెనిన్‌బాబు సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు తీర్పును వెలువరించారు. జోగి సోదరులకు ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించారు. తెల్లవారుజాము వరకు ఎస్కార్ట్‌ పోలీసులు మేల్కొని ఉండడంతో అప్పటికప్పుడు నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించడం కష్టమవుతుందని భావించి, ముందుగా నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఈ జైలు సిబ్బంది ద్వారా వారిని నెల్లూరు కేంద్ర కారాగారానికి పంపాలని స్పష్టం చేశారు. దీంతో వారిని విజయవాడ జిల్లా జైలుకు తీసుకెళ్లి, సోమవారం మధ్యాహ్నం నెల్లూరు జైలుకు తరలించారు.

అజ్ఞాతంలోకి జోగి అనుచరులు

విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌, అనుచరులు చేసిన వీరంగంపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి సోదరులను క్యాజువాలిటీలోకి తీసుకెళ్తుండగా రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శంకర్‌పై దౌర్జన్యం చేశారు. ఆయన అనుచరులు పోలీసులను తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనలో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ రెండు ఘటనలపై ఆసుపత్రి అవుట్‌ పోస్టు కానిస్టేబుల్‌ తాతనంబోయిన శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేశ్‌ భార్య శకుంతల, కుమారుడు రాజీవ్‌, జోగి రాము కుమారుడు రోహిత్‌పై కేసు నమోదు చేశారు. జోగి రాజీవ్‌, రోహిత్‌ వెనుక క్యాజువాలిటీలోకి దూసుకొచ్చిన అనుచరులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. వారిలో కొంతమంది అరెస్టుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్‌ అరెస్టులతో కలిపి 19 మందిని నిందితులుగా పేర్కొన్నారు. తాజాగా మరో నలుగురిని నిందితులుగా చేర్చారు. దీంతో నిందితుల సంఖ్య 23కి చేరింది.


జోగి బ్రదర్స్‌ను కస్టడీకి ఇవ్వండి

నకిలీ మద్యం తయారీ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రామును పది రోజులపాటు పోలీసుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం ఎక్సైజ్‌ అధికారులు విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో వారి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. పిటిషన్‌ను అనుమతించిన కోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. విజయవాడ తూర్పు ఎక్సైజ్‌ స్టేషన్‌లో జోగి సోదరులను సుదీర్ఘంగా విచారించినప్పటికీ కొన్ని విషయాలు మాత్రమే వెల్లడించారు. చాలా విషయాలను గోప్యంగా ఉంచినట్టు అధికారులు భావిస్తున్నారు.


  • అద్దేపల్లితో 20 ఏళ్ల బంధం

  • కల్తీ మద్యం సిండికేట్‌తో జోగి బ్రదర్స్‌కు సంబంధాలు

  • అద్దేపల్లి సోదరుల నుంచి భారీగా ముడుపులు

  • ప్రతిసారి 5 లక్షల నుంచి 8 లక్షల వరకు

  • రిమాండ్‌ రిపోర్టులో ఎక్సైజ్‌ పోలీసుల వెల్లడి

విజయవాడ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు జోగి రాముకు దాదాపు 20 ఏళ్ల నుంచి వ్యాపార, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ బంధం మరింత బలపడింది. నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్‌ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో ఈ సంచలన విషయాలు పేర్కొన్నారు. ములకలచెరువు, ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావు తయారు చేసిన నకిలీ మద్యం వ్యవహారంలో జోగి సోదరులు లక్షలాది రూపాయల ముడుపులు అందుకున్నారు. అద్దేపల్లి అన్నదమ్ములు ప్రతిసారి 5 లక్షల నుంచి 8 లక్షలు జోగి బ్రదర్స్‌కు ముట్టజెప్పేవారు. వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడేవారు. జోగి రమేశ్‌ పెడన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జనార్దన్‌రావు, జగన్మోహన్‌రావుతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అద్దేపల్లి సోదరులతో కలసి జోగి రమేశ్‌, జోగి రాము మద్యం బిజినెస్‌ చేశారు. కొవిడ్‌ సమయంలోనూ జనార్దనరావు, జగన్మోహనరావు... రమేశ్‌ సహకారంతో ఏఎన్నార్‌ బార్‌ను కొనసాగించారు. కొవిడ్‌ తర్వాత ఎన్డీపీఎల్‌ లిక్కర్‌ తెలంగాణ నుంచి తెచ్చి ఇబ్రహీంపట్నంలో జనార్దన్‌ బార్‌లో అమ్మారు. స్విమ్మింగ్‌ పూల్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనం, ఫినాయిల్‌ ముసుగులో తీసుకొచ్చేవారు. ఇందుకు జోగి సోదరులు సహకరించారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీలో విక్రయాలను బట్టి రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు జోగి బ్రదర్స్‌కు అద్దేపల్లి సోదరులు అందజేసేవారు. ఏఎన్‌ఆర్‌ బార్‌లో పనిచేసే పసుపులేటి మురళీకృష్ణ, దేవబత్తుల సాయిచైతన్యలు చేర్చేవారు. జనార్దనరావు రూ.8 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి రూ.4 లక్షలను జోగి రాముకు ఫెర్రీ ఘాట్‌లో అందజేశాడు. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు జోగి రమేశ్‌ ఆదేశాల మేరకు రాముకు ఇచ్చాడు.

Updated Date - Nov 04 , 2025 | 05:44 AM