Minister Nadeandla Manohar criticized the YCP: ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:28 AM
ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,674 కోట్లు చెల్లించకుండా పారిపోయిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని...
జగన్‌కు రైతుల పక్షాన మాట్లాడే అర్హత లేదు: మంత్రి మనోహర్
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,674 కోట్లు చెల్లించకుండా పారిపోయిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్‌లో గురువారం పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.డిల్లీరావుతో కలసి మంత్రి మీడియాతో మాట్లాడారు. గిట్టుబాటు ధరలపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం 75 కిలోల ధాన్యం బస్తాకు కచ్చితంగా రూ.1,792 చెల్లించాం. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. మా ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో అధికారులు అహర్నిశలు కష్టపడుతూ అద్భుతంగా పని చేస్తున్నారు. ఇప్పటికే 8.22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రూ.1,713 కోట్ల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్రంలో సజావుగా సాగుతున్న ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై వైసీపీ నాయకులు కావాలనే రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా లబ్ధిపొందాలనే దురుద్దేశంతో అలజడి సృష్టిస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి 25 బస్తాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉంటూ వారి మోసాలను అర్థం చేసుకోవాలి. ఈ-క్రాప్ డేటా ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దుష్ప్రచారాన్ని నమ్మి రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు’ అని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు వస్తాయని రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి చెప్పారు. ‘ఈనెల 30 వరకు రాష్ట్రంలో వర్షాలు ఉండవు. వర్షాల భయంతో కొంతమంది రైతులు తమ వరి పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకుంటూ నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆయా జిల్లాల్లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం’ అని మంత్రి మనోహర్ వివరించారు.