Political Allegations: కుళ్లు.. మూసుకున్న కళ్లు
ABN , Publish Date - Oct 30 , 2025 | 07:00 AM
ఇది... వైఎస్ జగన్ పార్టీ వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు తుఫాను గురించి చంద్రబాబు పట్టించుకోనే లేదట జనం ఇబ్బందులు వారికి పట్టలేదట...
మొంథాపైనా వైసీపీ బురద పంథా
బాబు, పవన్ ఏసీ గదులకు పరిమితమయ్యారట
25వ తేదీ నుంచే 19 జిల్లాలకు ఇన్‌చార్జిలుగా ఐఏఎస్‌లు
ముందు జాగ్రత్త చర్యల కోసం ఆయా జిల్లాలకు నిధులు
జిల్లాలకు స్తంభాలు, క్రేన్లు, కట్టర్లు, అదనపు సిబ్బంది
ఆర్టీజీఎస్‌లో చంద్రబాబు, పవన్, లోకేశ్ వరుస సమీక్షలు
జగన్ పార్టీకి ప్రభుత్వ చర్యలు కనిపించ లేదా!?
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
‘‘రాష్ట్రం మొంథా తుఫానుతో విలవిల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఏసీ గదులకు పరిమితమయ్యారు. ప్రజల ఇబ్బందులు వాళ్లకు పట్టలేదు!’’
ఇది... వైఎస్ జగన్ పార్టీ వైసీపీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పెట్టిన పోస్టు! తుఫాను గురించి చంద్రబాబు పట్టించుకోనే లేదట! జనం ఇబ్బందులు వారికి పట్టలేదట! వైసీపీ బురద రాజకీయాలకు ఇదో ప్రత్యక్ష సాక్ష్యం! జనం కళ్లకు గంతలు కట్టడమే ఆ పార్టీ లక్ష్యం! ఎవరో కొందరైనా నమ్మకపోతారా అనే పిచ్చి నమ్మకం! అందులో భాగమే ఈ తప్పుడు విమర్శలు! ‘మొంథా’ అతితీవ్ర తుఫానుగా మారి ఏపీ తీరాన్ని తాకుతుందన్న అంచనాలు వెలువడిన క్షణం నుంచే ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకూడదు’ అని చంద్రబాబు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగానే సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు యంత్రాంగం మెరుపువేగంతో కదిలింది. 19 జిల్లాలకు సీనియర్ ఐఏఎ్‌సలను ఈనెల 25నే ఇన్‌చార్జిలుగా నియమించారు. ట్రెజరీ నిబంధనలను మినహాయించి అత్యవసర పనులకు ఎంతైనా ఖర్చు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు. ముందస్తు చర్యల కోసం 25వ తేదీనే రూ.14 కోట్లు విడుదల చేశారు. తీవ్రత దృష్ట్యా మరో రూ.19 కోట్లు నిధులు ఇచ్చారు. పడిపోయిన చెట్లను పక్కకు తప్పించేందుకు క్రేన్లు, కట్టర్లు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలను తరలించారు. హెలికాప్టర్లు, డోర్నియర్ విమానాలు సిద్ధంగా ఉంచారు. చంద్రబాబు సోమవారం, మంగళవారం పూర్తిస్థాయిలో ఆర్టీజీఎ్‌సలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం అర్ధరాత్రి దాకా అక్కడే ఉన్నారు. లోకేశ్, హోంమంత్రి అనిత ఆర్టీజీఎ్‌సలో ఉండి సమన్వయం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ సోమవారం తమ పార్టీ కార్యాలయం నుంచి, మంగళవారం ఆర్టీజీఎ్‌సలో సీఎంతో కలిసి సమీక్షించారు. ఇంతచేసినా... ‘ఏసీ గదులకే పరిమితమైన చంద్రబాబు, పవన్, లోకేశ్’ అని వైసీపీ కుళ్లు ప్రదర్శించింది. ఆర్టీజీఎ్‌సలో ఏసీలు ఆఫ్ చేసుకుని, సమీక్షలు నిర్వహించాలన్నది జగన్ పార్టీ ఉద్దేశమేమో!
ఇవేవీ కనిపించలేదా...
తుఫాను వల్ల ఒక్కరి ప్రాణాలూ పోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణులను ముందుగానే ఆసుపత్రుల్లో చేర్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి... వృద్ధులు, ఒంటరి మహిళలను సహాయ శిబిరాలకు ఆటోల్లో తరలించారు. సెల్‌ఫోన్లలో అలర్ట్ మెసేజ్‌లు, దండోరాలతో ఊరూరూ అప్రమత్తం చేశారు. మంగళవారం కాకినాడలో కొద్దిసేపు సూర్యుడు కనిపించడంతో తుఫాను ప్రభావం అంతంతేనని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. ప్రజలు సహాయ శిబిరాల్లోకి వెళ్లకుండా నిరోధించే కుట్రకు తెరలేపింది. అయితే.. ప్రభుత్వ యంత్రాంగం ‘ఈ ఒక్కరోజు రాత్రికి శిబిరాలకు రండి’ అని బుజ్జగించి తీసుకెళ్లారు. లేనిపక్షంలో తీవ్ర ప్రాణనష్టం సంభవించేందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇదేమి ‘స్టంట్’...
తుఫాను తీరం దాటిన కొన్ని గంటల్లోనే బుధవారం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. దీనిపైనా వైసీపీ బురదజల్లుడే! ‘చంద్రబాబుకు సాయం చేసే ఉద్దేశం లేదు. అనుభవం లేదు, అట్లకాడా లేదు... అంతా పబ్లిసిటీ స్టంటు’ అంటూ మరో కుళ్లుబోతు పోస్టు! ఇదే జగన్ సీఎంగా ఉన్నప్పుడు... ‘‘సీఎం హోదాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే అధికారుల దృష్టంతా.. సీఎం పర్యటన వైపే ఉంటుంది. సహాయ చర్యలపై ఉండదు’’ అంటూ సూక్తిముక్తావళి వినిపించారు. ఇప్పుడు మాత్రం ‘పబ్లిసిటీ స్టంటు’ అంటూ రెండో నాలుకను బయటపెట్టారు. ఇక... జగన్ సీఎం హోదాలో చేసిన ‘స్టంట్లు’ అన్నీ ఇన్నీ కావు. పొలాల్లోనే రెడ్ కార్పెట్ పరిచి... వేదికలాంటి సెట్టింగ్ ఏర్పాటు చేసి దానిపైన తుఫాను బాధితులను ‘పరామర్శించారు’. బాధిత రైతులు కుళ్లిపోయిన వరి కంకులను చేతికి అందించే ప్రయత్నం చేయగా... వాటిని జగన్ ముట్టుకోనూ లేదు. కాగా, తుఫాను సమయంలో ఎప్పట్లాగానే వీకెండ్ టూర్ కోసం బెంగళూరు ప్యాలె్‌సకు వెళ్లారు. తుఫాను సమయంలో అక్కడే ఉన్నారు. బుధవారం తిరిగి తాడేపల్లికి వచ్చారు.