Share News

Bill Payments: వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అయిననూ వారికే చెల్లింపులు

ABN , Publish Date - Dec 31 , 2025 | 03:47 AM

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నారేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టరు రాజారెడ్డి సంస్థ విఘ్నేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్టు పనులు చేసింది.

Bill Payments: వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అయిననూ వారికే చెల్లింపులు

  • వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగమేఘాలపై బిల్లుల చెల్లింపు

  • పులివెందుల కాంట్రాక్టర్‌కు రూ.3.5 కోట్ల చెల్లింపు

  • గతంలోనూ ఈయనవే 30 కోట్ల బిల్లులు క్లియర్‌

  • మరో వైసీపీ కాంట్రాక్టర్‌కు రూ.686 కోట్ల పనులు

  • 2014-19 పనుల బిల్లులకు నేటికీ మోక్షం లేదు

  • ఇంకా చెల్లింపులకు నోచుకోని 500 కోట్ల బకాయిలు

  • వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లుల పట్ల మాత్రం ఉదారత!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా ఇంకా వైసీపీ నాయకులు, వారికి మద్దతు ఇచ్చే కాంట్రాక్టర్ల హవానే నడుస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో, కొత్తగా కాంట్రాక్టులు తెచ్చుకోవడంలో వారిదే పైచేయిగా ఉంటోంది. జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన కాంట్రాక్టర్లకు అయితే మరింత పెద్ద పీట వేసి మరీ బిల్లుల చెల్లింపులు.. కాంట్రాక్టుల కేటాయింపులు చేస్తున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేసిన టీడీపీ మద్దతుదారులు మాత్రం బిల్లుల కోసం మూడు, నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నారేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టరు రాజారెడ్డి సంస్థ విఘ్నేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్టు పనులు చేసింది. వైసీపీ అధినేత జగన్‌కు రాజారెడ్డి సన్నిహితుడు. ఎన్నికల సమయంలో కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఆర్థిక వ్యవహారాలను ఈయన పర్యవేక్షిస్తుంటారు. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రూ.50 కోట్ల వరకు బిల్లులు విడతలవారీగా చెల్లించింది. తాజాగా వారంరోజుల క్రితం రూ.3.50 కోట్ల విలువైన బిల్లులు రాజారెడ్డి సంస్థకు చెల్లించారు. రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఈ పనులు సరిగా చేయలేదన్న ఆరోపణలు రావడంతో ప్రస్తుతం వాటిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. ఈ విషయంపై టీడీపీ నాయకులు ఆర్థికశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకుండా రాజారెడ్డికి బిల్లు చెల్లించేశారు. నాలుగు నెలల క్రితం కూడా ఈయనకు రూ.30 కోట్లు చెల్లించారు. అధికారులకు ఆరు శాతం వరకు కమీషన్లు ముట్టచెప్పి, దర్జాగా బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


జగన్‌ సన్నిహితుడికి 686 కోట్ల పనులు

పులివెందుల నియోజకవర్గానికి చెందిన కసనూరు గ్రామానికి చెందిన కాంట్రాక్టరు జి.శివారెడ్డికి మూడు నెలల వ్యవధిలో రూ.686 కోట్ల విలువైన పనులు కేటాయించారు. శివారెడ్డికి కూడా జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ విభాగం వారు ఏపీ అర్బన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సెప్టేజ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంప్రూమెంట్‌ ప్రాజెక్టు (ఏపీయూడబ్ల్యూఎ్‌సఎ్‌సఎంఐపీ) కింద సుమారు రూ.386 కోట్ల విలువైన పనులకు టెండరు పిలిచారు. ఈ పనులను శివారెడ్డికి కేటాయించారు. ఈ పనులతోపాటు కాకినాడలో అమృత్‌ నిధులతో చేపట్టిన మరో రూ.300 కోట్ల విలువైన పనులు కూడా శివారెడ్డి దక్కించుకున్నారు. ఈ పనులు శివారెడ్డికి దక్కేలా చేయడంలో మున్సిపల్‌ శాఖలో కీలక వ్యక్తులు సహకరించారని సమాచారం. శివారెడ్డి స్వగ్రామమైన కసనూరు టీడీపీ నేత బీటెక్‌ రవి స్వగ్రామం కూడా కావడం గమనార్హం. తమ ప్రత్యర్థులు రూ. వందల కోట్ల విలువైన పనులు దక్కించుకుంటూ, పెండింగ్‌ బిల్లులను కూడా సునాయాసంగా తెచ్చుకుంటుండటంపై పులివెందుల టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు.


2014-19 బిల్లులకే దిక్కులేదు..

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ టీడీపీ వారికి సంబంధించిన బిల్లుల చెల్లింపులు.. కాంట్రాక్టుల మంజూరుపై పూర్తి నిషేధం విధించారు. 2014-19 మధ్య టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేసిన ఉపాధి హామీ పనులు, చెట్టు -నీరు పనులకు సంబంధించిన బిల్లులు భారీగా బకాయిలు ఉండిపోగా, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టింది. కోర్టులకు వెళ్లిన వారికి సైతం డబ్బులు చెల్లించేందుకు రెండేళ్లు నాన్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24లో వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేసిన ఉపాధి పనుల బిల్లుల చెల్లింపులో ఉదారత చాటుకుంది. మరోవైపు, 2014-19లో టీడీపీ వారికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ సుమారు రూ.500 కోట్లు వరకు ఉన్నాయి. అందులో ఆర్థికశాఖ వద్ద టోకెన్‌ నంబరుతో విడుదలకు సిద్ధంగా ఉన్న మొత్తం రూ.211 కోట్లు.

రూ.7 కోట్లు చెల్లించేందుకు 6 నెలలుగా తిప్పుతున్నారు..

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి చెందినవారు సుమారు రూ.ఏడు కోట్ల పనులు పూర్తి చేశారు. ఈ బిల్లుల కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నా, వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. బీటెక్‌ రవి స్వయంగా అధికారుల వెంటపడుతున్నా ఏవో సాకులతో పెండింగ్‌ పెడుతున్నారు. మరోవైపు వైసీపీ వారికి మాత్రం ఆగమేఘాలపై బిల్లులు చెల్లించేస్తుండటం గమనార్హం.

Updated Date - Dec 31 , 2025 | 03:50 AM