Minister Nimmala Ramanaidu: తుప్పుపట్టిన ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:14 AM
పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు...
అందుకే 250 కోట్లు కేటాయించాం... శ్రీశైలానికీ 350 కోట్లు
గోదావరి ఏటిగట్ల పటిష్ఠతకు 43 కోట్లతో పనులు
ఇరిగేషన్‌లో రూ.18 వేల కోట్ల బిల్లులు పెండింగ్
సవాళ్లను అధిగమించి పని చేస్తాం: మంత్రి నిమ్మల
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో వాటి భద్రత, పటిష్ఠత ప్రశ్నార్థకంగా మారాయి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు తుప్పు పట్టిపోయాయి. గేట్లు కొట్టుకుపోతే మళ్లీ ఏడాదిపాటు తూర్పు, పశ్చిమలో ఒక్క పంట కూడా ఉండదు. అందుకే రూ.250 కోట్లు ఈ బ్యారేజీకి కేటాయించాం. వచ్చే వర్షాకాలం సీజన్ లోపు ఆ గేట్లన్నీ మార్చాలి. శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉంటే దానికి రూ.350 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గత ప్రభుత్వం నిర్వాకంతో బ్యారేజీలకు లాకులు, డోర్లు, షట్లర్లు, ఇతర మరమ్మతులు చేయలేదు. కనీసం గ్రీజ్ పెట్టలేదు. అందుకే గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ ఇలాగే జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటిగట్లు పటిష్ఠత విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా ఏటిగట్టుకు ఖర్చుపెట్టలేదు. 1986లో 36 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చింది. అం దుకు అనుగుణంగా ఏటిగట్లు పటిష్ఠతకు చర్యలు తీసుకుంటున్నాం. పశ్చిమగోదావరిలో రూ.18 కోట్లు, రాజోలులో రూ.25 కోట్లతో బండ్ కోత నివారణ పనులు చేస్తునా ్నం. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు మా నెత్తిమీద పెట్టింది. ఒక్క ఇరిగేషన్ శాఖలోనే రూ.18 వేల కోట్ల బిల్లులు బకాయిలున్నాయి. ఆ అప్పులు, వడ్డీలు కట్టాలి. బకాయిలు చెల్లించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. సవాళ్లను అధిగమించి పనిచేస్తాం’ అని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.