Share News

పనిభారం!

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:34 AM

జిల్లాలోని పంచాయతీల్లో రోజురోజుకు పనిభారం పెరిగిపోతోంది. మూడు, నాలుగు పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శి ఉండటంతో మూడు నెలల క్రితం ప్రారంభమైన ఇంటి పన్నుల వసూలు మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వివిధ రకాల సర్వేలు, పంచాయతీ కార్యాలయాల్లో రోజువారీ విధులు, పారిశుధ్య నిర్వహణ వంటి పనులు పర్యవేక్షణ చేసేవారు లేక చతికిల పడుతున్నాయి. జిల్లా అధికారులు రోజూ గంటల తరబడి నిర్వహించే జూమ్‌ మీటింగ్‌లు, మండల స్థాయి అధికారులు రెండు రోజులకోసారి నిర్వహించే సమావేశాలతో పంచాయతీ కార్యదర్శులు రోజువారీ పనులు పూర్తి చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. కొన్ని మండలాల్లో అయితే ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులను సమావేశాలకు పిలిచి సర్వేలు సక్రమంగా చేయడం లేదని చులకనగా మాట్లాడుతుండటంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇటీవల కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

పనిభారం!

- వేధిస్తున్న పంచాయతీ కార్యదర్శుల కొరత

- ఒక వైపు ఇంటి పన్నులు.. మరో వైపు సర్వేలతో సతమతం

- జిల్లాలోని 474 పంచాయతీలకు 163 మందే..

- జూమ్‌ మీటింగ్‌లు, సమావేశాలతో గడిచిపోతున్న సమయం

- లక్ష్యాలు పూర్తవ్వకపోవడంతో ఎంపీడీవోల నుంచి తిట్లు

- కలెక్టర్‌ బాలాజీని కలిసి తమగోడు వెళ్లబోసుకున్న కార్యదర్శులు

జిల్లాలోని పంచాయతీల్లో రోజురోజుకు పనిభారం పెరిగిపోతోంది. మూడు, నాలుగు పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శి ఉండటంతో మూడు నెలల క్రితం ప్రారంభమైన ఇంటి పన్నుల వసూలు మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వివిధ రకాల సర్వేలు, పంచాయతీ కార్యాలయాల్లో రోజువారీ విధులు, పారిశుధ్య నిర్వహణ వంటి పనులు పర్యవేక్షణ చేసేవారు లేక చతికిల పడుతున్నాయి. జిల్లా అధికారులు రోజూ గంటల తరబడి నిర్వహించే జూమ్‌ మీటింగ్‌లు, మండల స్థాయి అధికారులు రెండు రోజులకోసారి నిర్వహించే సమావేశాలతో పంచాయతీ కార్యదర్శులు రోజువారీ పనులు పూర్తి చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. కొన్ని మండలాల్లో అయితే ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులను సమావేశాలకు పిలిచి సర్వేలు సక్రమంగా చేయడం లేదని చులకనగా మాట్లాడుతుండటంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇటీవల కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఆంద్రజ్యోతి-మచిలీపట్నం/గుడివాడ:

జిల్లాలో 474 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి ఒకరు చొప్పున 473 మంది ఉండాలి. కానీ 163 మంది కార్యర్శులతో అధికారులు నెట్టుకొస్తున్నారు. మూడు, నాలుగు పంచాయతీలను ఒకే కార్యదర్శి లేదా ఈవో పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఇంటి పన్నుల వసూలును పంచాయతీల్లో పనిచేసే బిల్‌ కలెక్టర్‌లు చేసేవారు. ప్రస్తుతం 474 పంచాయతీలకు 42 మందే బిల్‌ కలెక్టర్లు పనిచేస్తున్నారు. వీరు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ పనిని పంచాయతీ కార్యదర్శులే చేయాల్సి వస్తోంది. దీంతో పాటు ఉదయం ఐదు గంటలకు పంచాయతీలకు వెళ్లి పారిశుధ్య కార్మికులకు పనులు పురమాయించి, వారు సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించాలి. పంచాయతీల్లో తిరుగుతూ ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి వాటి పరిష్కారం కోసం సిబ్బందిని అక్కడికి రప్పించి, పనులు చేయించాల్సినస్థితి. మార్చి నెలాఖరులోగా ఇంటి పన్నులను వసూలు చేయాలనే టార్గెట్‌ పెట్టారు. ఇంటి పన్నులు వసూలు చేయకుంటే ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఏ రోజుకారోజు ఎంతమేర ఇంటి పన్నులు వసూలు చేశారో లెక్కలు పంపాలని, వసూలు చేయకపోవడానికి గల కారణాలను తెలియజేయాలని పంచాయతీ కార్యదర్శులుపై ఒత్తిడి పెడుతున్నారు. ఈ పనులతోపాటు ఇటీవల కాలంలో పి4, వర్క్‌ ఫ్రమ్‌ హోం, ఈకేవైసీ, మిస్సింగ్‌ సిటిజన్స్‌, హౌస్‌హోల్డ్‌ జియో కోఆర్డినేట్స్‌, స్వామిత్ర, స్వర్ణ పంచాయితీలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.

సమావేశాలతో సరి..

ఉదయం 10 గంటలు కాగానే డీపీవో లేదా డీఎల్‌పీవోలు జూమ్‌ మీటింగ్‌లంటూ రెండు గంటల పాటు సమయం తీసుకుంటున్నారు. ఆ తర్వాత మండల స్థాయిలో ఈవోపీఆర్డీలు ప్రత్యేక సమావేశాలంటూ పంచాయతీ కార్యదర్శులను పిలిపించి రెండు, మూడు గంటలపాటు సమయం తీసుకుంటున్నారు. ఈలోగా మండల పరిషత కార్యాలయంలో ఎంపీడీవోలతో సమావేశం ఉందంటూ పిలుస్త్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలకు సంబంధించి ఎంతమేర పూర్తిచేశారో వివరాలను తెలియజేయాలని ఎంపీడీవోలు కోరుతున్నారు. సర్వేలు సకాలంలో చేయని పంచాయతీ కార్యదర్శులను అందరిముందు చులకనగా మాట్లాడుతూ చీవాట్లు పెడుతున్నారు. చల్లపల్లి మండలంలో పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవోతో సమావేశం అంటేనే వణికిపోతున్నారు. ఈ మండలం ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులపై తనదైన శైలిలో విరుచుకుపడుతుండటంతో పంచాయతీ కార్యదర్శులు బెంబేలెత్తిపోతున్నారు. అఽధికశాతం మండలాల్లో పంచాయతీ కార్యదర్శులపై ఎంపీడీవోల తీరు ఇలానే ఉందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.

కలెక్టర్‌ను కలసి వినతి

పంచాయతీల్లో సిబ్బంది కొరతతో పాటు, మూడు, నాలుగు పంచాయతీలను ఒక్కో పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షిస్తుండటంతో తమపై పనిభారం పెరిగిందని, పంచాయతీ కార్యదర్శులంతా ఇటీవల పంచాయితీరాజ్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శశిభూషణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి తమపై పనిభారం తగ్గించాలని, జూమ్‌ మీటింగ్‌లు, ఇతరత్రా సమావేశాలు కొంతమేర తగ్గిస్తే పంచాయతీలకు సంబంధించిన పనులు పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సచివాలయాల్లో గ్రేడ్‌-5 సెక్రటరీలను పంచాయతీల్లో పనిచేసేందుకు తమకు సహాయకులుగా ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు. అధికారులు నిర్వహించే సమావేశాలతోనే రోజులో సగం సమయం సరిపోతోందని తెలిపారు. బిల్‌ కలెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్‌లు కూడా పంచాయతీల్లో లేకపోవడంతో పరిపాలనా పరమైన అంశాల్లో ఇబ్బందులు పడుతున్నామని వారు కలెక్టర్‌కు వివరించారు.

కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలి

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు వివిధ కారణాలతో పనిఒత్తిడి పెరిగింది. జూమ్‌ మీటింగ్‌ల పేరుతో రోజులో రెండు, మూడు గంటలపాటు సమయం వృథా అవుతోంది. అదనపు పనిభారంతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులపై సర్వే పనులు పూర్తి చేయడం లేదంటూ ఎంపీడీవోలు విరుచుకుపడుతున్నారు. ఈ పద్ధతిని ఎంపీడీవోలు విడనాడాలి.

-భట్రాజు కోటయ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి

Updated Date - Mar 21 , 2025 | 12:34 AM