Share News

Lok Sabha Speaker Om Birla inaugurated: మహిళా శక్తికి జై

ABN , Publish Date - Sep 15 , 2025 | 03:54 AM

దేశంలో మహిళా శక్తి నానాటికీ పురోగమిస్తోందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. అనేక రంగాల్లో వారు తమ ప్రతిభను చాటుతున్నారని, ఆడబిడ్డలు విద్యావంతులై, స్వావలంబన సాధించినపుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు..

Lok Sabha Speaker Om Birla inaugurated: మహిళా శక్తికి జై

  • వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు

  • ఆడబిడ్డల స్వావలంబనతోనే వృద్ధి

  • అన్ని రంగాల్లోనూ వారికి సముచిత స్థానం

  • మహిళా సాధికారత నిరంతర ప్రక్రియ

  • లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉద్ఘాటన

  • తిరుపతిలో జాతీయ మహిళా సాధికార కమిటీల తొలి సదస్సు ప్రారంభం

తిరుపతి/తిరుమల, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): దేశంలో మహిళా శక్తి నానాటికీ పురోగమిస్తోందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. అనేక రంగాల్లో వారు తమ ప్రతిభను చాటుతున్నారని, ఆడబిడ్డలు విద్యావంతులై, స్వావలంబన సాధించినపుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అప్పుడే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. తిరుపతిలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్లమెంటరీ, అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల తొలి జాతీయ సదస్సును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు పార్లమెంటు సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. మహిళల నేతృత్వంలో సాధించే అభివృద్ధి, చిన్నారుల సంక్షేమాలే ‘వికసిత్‌ భారత్‌’ విధానాలకు పునాదులవుతాయని తెలిపారు. ‘నారీ శక్తి వందన్‌’ చట్టమనేది కేవలం ప్రాతినిధ్యం కోసమే కాదని, ప్రజాస్వామ్యంలో మహిళలకు తగినస్థానం కల్పించే దిశగా ఆ చట్టం ఓ చరిత్రాత్మక ముందడుగని అభివర్ణించారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. మహిళా సాధికారత అనేది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియగా పేర్కొన్నారు. దీనికోసం కొత్త చట్టాలు, విధానపరమైన సంస్కరణలు జరుగుతూనే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీతోపాటు దేశంలోని 20కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల మహిళా కమిటీల సభ్యులు హాజరయ్యారన్నారు.


స్వశక్తీకరణపై చర్చ: హరివంశ్‌

సదస్సులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ మాట్లాడుతూ.. తిరుపతిలో జరుగుతున్న తొలి జాతీయ మహిళా సాధికార సదస్సు మహిళా స్వశక్తీకరణపై లోతైన చర్చలకు వేదికగా నిలిచిందన్నారు. భారత రాజ్యాంగం మహిళల హక్కులకు బలమైన పునాదులు వేసిందన్నారు. పార్లమెంటరీ కమిటీలు... చట్టాల్లో మార్పులు, విధానాల సరళీకరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో విశేష కృషి చేస్తున్నాయన్నారు. పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీ ఛైర్‌పర్సన్‌ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం, డిజిటల్‌ అక్షరాస్యత వంటి రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ ద్వారా మహిళలకు ఆరోగ్యం, పోషణ, భద్రత, సామాజిక రక్షణతో పాటు నైపుణ్యాధారిత విద్య వంటి పథకాలు అమలవుతున్నాయని వివరించారు.

సీఎం పర్యటన రద్దు

తిరుపతిలో ఆదివారం ప్రారంభమైన జాతీయ మహిళా సాధికార సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరే సమయానికి ప్రతికూల వాతావరణం ఉండడంతో ఏవియేషన్‌ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీఎం తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఎన్టీఆర్‌, బాబు మహిళా పక్షపాతులు!: వక్తలు

మహిళా ప్రజాప్రతినిధుల సాధికార కమిటీల జాతీయ సదస్సులో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌, ప్రస్తుత సీఎం చంద్రబాబు మహిళల అభివృద్ధి కోసం చేసిన కృషిని పలువురు వక్తలు కొనియాడారు. దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అన్నారు. విద్య, ఉద్యోగాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు 30 ఏళ్ల కిందటే మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. మంత్రి పయ్యావుల కేశవ్‌, డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు కూడా ఇవే అంశాలను ప్రస్తావించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ కూడా ఎన్టీఆర్‌, చంద్రబాబులు.. మహిళాభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని వివరించారు.

VBNC.jpg


వారికి ఒకే పింఛన్‌ ఇవ్వాలి... ఓంబిర్లాకు వినతి

పార్లమెంటేరియన్‌ జీతాలు, పెన్షన్ల చట్టాన్ని సవరించాలని ఉద్యమకారుడు డబ్ల్యూడీ గణేశ్‌ కోరారు. తిరుపతికి వచ్చిన లోకసభ స్పీకర్‌ ఓం బిర్లాను ఆదివారం కలసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రాల్లో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పెన్షన్‌ తీసుకునే ప్రజాప్రతినిధులకు మాజీ ఎంపీ కోటా కింద పింఛను ఇవ్వబోమన్న నిబంధనను చట్టం చేయాలని కోరారు.

శ్రీవారి సేవలో.. : మహిళా ప్రజాప్రతినిధుల సాధికార కమిటీల జాతీయ సదస్సుకు వచ్చిన పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, శాసనసభ స్పీకర్‌ అయన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యురాలు సుధా నారాయణమూర్తి, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, మహిళలపై శ్రీవారి అనుగ్రహం, ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించినట్టు ఎంపీ పురందేశ్వరి తెలిపారు.

చట్టసభల సభ్యులకూ ‘నో వర్క్‌.. నో పే’!

  • లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అయ్యన్న వినతి

చట్టసభల సభ్యులకూ ‘నో వర్క్‌- నో పే’ విధానం వర్తింపజేయాలని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపిచ్చారు. ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే నో వర్క్‌-నో పే అంటున్నామని, ఈ విధానం చట్టసభల సభ్యులకు ఎందుకు వర్తించదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు సభ్యులు అసెంబ్లీకి హాజరు కావడం లేదంటూ పరోక్షంగా వైసీపీ సభ్యులనుద్దేశించి అన్నారు. ‘ప్రజలు తమ సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి గెలిపిస్తే సభ్యులు సభకే రాకుండా దూరంగాఉండి మాట్లాడడం ఏమిటి? ఆ మాట్లాడేదేదో సభలోనే మాట్లాడవచ్చు కదా! ప్రజాప్రతినిధులు బాధ్యత లేకుండా వ్యవహరించడం సరికాదు. వీరికి నో వర్క్‌-నో పే విధానం అమలు చేసే దిశగా ఆలోచించాలి’ అని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను అయ్యన్న కోరారు. దేశవ్యాప్తంగా అన్ని శాసనసభలూ ఏడాదికి కనీసం 60 రోజులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏడాదికి 30 నుంచీ 45 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ఏడాదిలో 60 రోజులైనా చట్టసభలు పనిచేసేలా దేశంలోని అన్ని అసెంబ్లీలకూ సూచనలు జారీ చేయాలని అయ్యన్న అభ్యర్థించారు.

Updated Date - Sep 15 , 2025 | 03:54 AM