Lok Sabha Speaker Om Birla: ధనలక్ష్మిలతోనే దేశం బాగు!
ABN , Publish Date - Sep 16 , 2025 | 04:52 AM
మహిళలు ధనలక్ష్మిలు అయితేనే దేశం బాగుంటుందని, ‘వికసిత భారత్’ సాకారంలో మహిళల ఆర్థిక సాధికారతే కీలకమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు...
వికసిత భారత్ సాధనలో మహిళల ఆర్థిక సాధికారతే కీలకం
ఆ దిశగా ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలి.. డిజిటల్ అక్షరాస్యతను విస్తరించాలి
సంస్థాగతంగా జెండర్ సెన్సిటివ్ బడ్జెట్.. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల్లో
సమాన చాన్స్.. మహిళాభ్యున్నతి కోణంలో ‘తిరుపతి డిక్లరేషన్’
చట్టసభల మహిళా సాధికార కమిటీల సదస్సులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
తిరుపతిలో ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు
తిరుపతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మహిళలు ధనలక్ష్మిలు అయితేనే దేశం బాగుంటుందని, ‘వికసిత భారత్’ సాకారంలో మహిళల ఆర్థిక సాధికారతే కీలకమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆ దిశగా ‘తిరుపతి తీర్మానాన్ని’ ఆమోదించామని తెలిపారు. తిరుపతిలో సోమవారం జరిగిన చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు ముగింపు సభలో ఆయన మాట్లాడారు. మహిళల సాధికారత అనేది కేవలం సామాజిక అవసరం మాత్రమే కాదని ఆర్థిక అవసరం కూడానని నొక్కి చెప్పారు. మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, పెట్టుబడుల అపారమైన మానవ వనరులను అందిపుచ్చుకునే అవకాశముందన్నారు. తద్వారా దేశం బలమైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి నమూనాను నిర్మించగలదని తెలిపారు. వికసిత భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో మహిళల నాయకత్వం, వారి సహకారం కీలకమని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల అనుభవాలను, సమస్యలను, పరిష్కారాలను పంచుకునే వేదికలుగా మహిళా సాధికార కమిటీల సదస్సులు పనిచేస్తాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజకీయ వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్యం నాగరికతా విలువలను, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. గత కొన్ని శతాబ్దాలుగా సమానత్వం, సౌభ్రాతృత్వం, భాగస్వామ్యం, సహకారం వంటి సూత్రాలను పాటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలకు భారత్ మాతృకగా నిలిచిందని స్పీకర్ గుర్తు చేశారు. గ్రామీణ, వెనుకబడిన వర్గాల మహిళలకు అవకాశాలు కల్పించినప్పుడే విప్లవాత్మక ఫలితాలు వస్తాయన్నారు. బడ్జెట్‌లో మహిళలకు ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలను కల్పించే విధంగా వనరుల కేటాయింపు జరగాలని సూచించారు.
వెనుకబడొద్దు!
ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలు వెనుకబడరాదని, డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, సైబర్ భద్రత కల్పించ డం, డిజిటల్ అక్షరాసత్య ను విస్తరించడం కీలకమ ని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.మహిళలకు ప్రత్యేక డిజిటల్ సాక్షరతా మిషన్ చేపట్టాలని పిలుపునిచ్చా రు. ఇవన్నీ మహిళా సాధికారతకు స్పష్టమైన రోడ్ మ్యాప్ అవుతాయన్నారు. తిరుపతి సదస్సులో చేసిన తీర్మానాలకు సంబంధించి మహిళల విద్య, ఆరోగ్యం, భద్రత, గౌరవం, స్వావలంబన అనేవి జాతీయ ప్రగతికి మూల స్తంభాలుగా నిలుస్తాయని తెలిపారు.
పరిజ్ఞానం అవసరం: హరివంశ్
ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం కల్పించడం అవసరమని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ, లోక్‌సభలలో మహిళా సభ్యులకు ప్రాఽధాన్యమిచ్చే సంప్రదాయం ప్రారంభించడం మంచి ప్రయత్నమన్నారు.
నాంది పలికిన మధ్యప్రదేశ్: పురందేశ్వరి
దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ మహిళా సాధికారతపై కమిటీ ఏర్పాటు చేసిందని తద్వారా మహిళా సాధికారతకు ఆ రాష్ట్రం నాంది పలికిందని పార్లమెంటు మహిళా కమిటీ చైర్‌పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. 1987లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేశాక తర్వాత ఇతర రాష్ట్రాలలో కూడా కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు. జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్, కొత్తగా ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళలను సన్నద్ధం చేసే విషయంపై చర్చలు జరిగాయన్నారు.
ముగిసిన సదస్సు
తిరుపతి కేంద్రంగా ఆది, సోమవారాల్లో జరిగిన చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా ప్రతినిధులు హాజరు కాగా, వారికి జిల్లా యంత్రాంగం ఉన్నతస్థాయి సదుపాయాలను కల్పించింది.
ఇవీ తీర్మానాలు
జెండర్ సెన్సిటివ్ బడ్జెట్‌ను సంస్థాగతం చేయడం.
అన్ని ప్రభుత్వ శాఖలు లింగ దృష్టి కోణం అనుసరించడం.
మహిళల ఆరోగ్యం, విద్య, వ్యాపారం కోసం నిధుల పెంపు.
మహిళల సాంకేతిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం.
మహిళల్లో డిజిటల్ అంతరాన్ని తగ్గించడం.
స్టెమ్ రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం.
మహిళలకు సైబర్ భద్రతను కల్పించడం.
మహిళలకు డిజిటల్ అక్షరాసత్యను విస్తరించడం.
మహిళలను సాంకేతిక సృష్టికర్తలుగా తీర్చిదిద్దడం.
