Democratic Women Association: ప్రజల ఐక్యత కోసమే ఐద్వా పోరాటాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:05 AM
కులమతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రజలందరి ఐక్యతే లక్ష్యంగా పోరాటాలు సాగిస్తున్నట్టు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం...
ప్రైవేటీకరణ అంటే నిరుద్యోగాన్ని ప్రోత్సహించడమే
అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం ధవలే
మతోన్మాద ప్రచారాన్ని తిప్పికొట్టాలి: తీస్తా సెతల్వాడ్
అనంతపురం టౌన్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కులమతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రజలందరి ఐక్యతే లక్ష్యంగా పోరాటాలు సాగిస్తున్నట్టు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం ధవలే తెలిపారు. సంస్థ 16వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి లలితకళా పరిషత్ వరకు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి అధ్యక్షతన లలితకళా పరిషత్‌లో నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ విధానాల వల్ల నేడు రాష్ట్రంలో ధరలు పెరిగి, సాధారణ ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. అనేక మంది మహిళలు నిరుద్యోగ సమస్యతో బాధాకరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వక్తం చేశారు. దేశవ్యాప్తంగా మహిళల జీవితాల్లో పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంటోందని, ఇందులో ప్రధాన నిందితులు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ అని మరియం ధవలే ఆరోపించారు. కార్యక్రమంలో ఐద్వా అఖిల భారత అధ్యక్షురాలు శ్రీమతి టీచర్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, కోశాధికారి సావిత్రి తదితరులు పాల్గొన్నారు. కాగా, సాయం త్రం కామ్రేడ్ రబియాబీ ప్రాంగణంలో జరిగిన ఐద్వా ప్రతినిధుల సభలో సామాజికవేత్త తీస్తా సెతల్వాడ్ మాట్లాడారు. ‘వామపక్షాలు, దళిత సంఘాలు, అభ్యుదయవాదులు బాధ్యతగా మెలిగి ప్రొటో ఫాసిస్టు ప్రభుత్వం నుంచి సమాజాన్ని కాపాడుకోవాలి. అందుకోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరముంది. దేశంలో ప్రజా స్వేచ్ఛ, హక్కులపై దాడి జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వం దేశంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను తీసుకువచ్చి పౌరహక్కులను హరిస్తోంది. అస్సాం, బెంగాల్, మణిపూర్‌లో మహిళలపై జరిగిన దాడులు వర్ణనాతీతం. దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. మితవాదంవైపు ప్రయాణం చేస్తోంది. వాట్సాప్ ఫ్యాక్టరీ సమాజంలో పెనుప్రమాదం సృష్టిస్తోంది. మతతత్వ, మతోన్మాద ప్రచారాలు మన కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి..వాటిని తిప్పికొట్టాలి. ఫాసిస్టు సంఘాలు అన్ని రంగా ల్లో చొచ్చుకునివచ్చాయి. ఓట్ల తారుమారుతోనే నేడు బీజేపీ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలను మళ్లీ బ్రిటీష్ కాలంనాటి వలస జీవన విధానంలోకి నెట్టివేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం’ అని తీస్తా హెచ్చరించారు.