Mariam Dhawale: బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:51 AM
కేంద్రంలోని బీజేపీ పాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఆరోపించారు.
మనువాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం
ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
అనంతపురం టౌన్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ పాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఆరోపించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఐద్వా రాష్ట్ర 16వ మహాసభల్లో మంగళవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగాయని, బాధితులకంటే నిందితులకే కేంద్ర ప్రభుత్వ సహకారం ఎక్కువగా ఉంటోందని విమర్శించారు. హత్రాస్ కేసులో నిందితులందరూ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై ఉండటం దీనికి ఉదాహరణ అని తెలిపారు. మహిళలపై దాడుల కేసులలో కేవలం 27 శాతం నిందితులకు మాత్రమే శిక్షలు పడుతుండడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వ సహకారంతోనే ఈ కేసులు అత్యఽధికంగా నిర్వీర్యమవుతున్నాయని ఆరోపించారు. మరోవైపు అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అంబాని, అదానీకి కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం కారణంగా రిజర్వేషన్లు అమలు కావడం లేదని, తద్వారా ఎక్కువగా నష్టపోతున్నది మహిళలేనని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ మనువాదాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోందని, దీనివల్ల నష్టపోయేది మహిళలేనని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు సమాన హక్కులు కల్పించడానికి మనువాదం అంగీకరించదని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐద్వా పోరాటాన్ని రూపొందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 13 గంటల పనివిధానాన్ని అమలు చేసేందుకు సిద్ధపడడం తగదని అన్నారు. ఐద్వా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి టీచర్ మాట్లాడుతూ కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం మహిళల అభివృద్దికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ మూలంగా పలు ప్రాంతాల్లో బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి, రాష్ట్ర కోశాధికారి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.