Free Sewing Machines: శిక్షణ సరే.. కుట్టుమిషన్లు ఏవీ
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:04 AM
రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమశాఖ ద్వారా 65వేల మందికి కూటమి ప్రభుత్వం కుట్టుశిక్షణ ఇప్పించింది. అయితే, శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా వారికి ఇస్తామన్న కుట్టుమిషన్లు పంపిణీ...
ముందుకు సాగని మిషన్ల కొనుగోలు ప్రక్రియ
65వేల మందికి పైగా శిక్షణ
మిషన్ల కోసం మహిళల ఎదురుచూపులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమశాఖ ద్వారా 65వేల మందికి కూటమి ప్రభుత్వం కుట్టుశిక్షణ ఇప్పించింది. అయితే, శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా వారికి ఇస్తామన్న కుట్టుమిషన్లు పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి తొలుత లక్ష మంది బీసీ, ఈబీసీ మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు పంపిణీ చేయాలని సంకల్పించగా 3,43,413మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 680 కేంద్రాలను ఏర్పాటుచేసి 1326బ్యాచ్‌ల ద్వారా 65,987 మందికి మొదట శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. ప్రతి జిల్లాలో ఆయా మండల/మున్సిపాలిటీల్లో అవసరమైన వసతులతో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కుట్టు మిషన్లు, ఇతర సామగ్రి సమకూర్చడంతోపాటు ఆయా సంస్థల ద్వారా అనుభవజ్ఞులైన ట్రైనర్లను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రాలను సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి సవితతో పాటు పలువురు మంత్రులు సందర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించారు. శిక్షణా కేంద్రాల్లో వసతులను ఎంపీడీవోలు పర్యవేక్షించారు. శిక్షణ పొందిన ప్రతి మహిళకూ కుట్టుమిషన్ ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో భారీసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. చివరికి శిక్షణకు హాజరయ్యే వారికి మాత్రమే మిషన్లు ఇస్తామని నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో వాస్తవంగా శిక్షణ పొంది కుట్టుమిషన్ల ద్వారా జీవనభృతి పొందాలనుకున్న మహిళలు మాత్రమే హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న మహిళందరికీ శిక్షణ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో వడపోతతో ఎంపిక చేశారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సిఫారసులు చేస్తుండటంతో డిమాండ్ పెరిగిపోయింది. మహిళల నుంచి ఇంకా స్పందన వస్తుండడంతో పీ4 కింద శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తమకు ఇస్తామన్న ఉచిత కుట్టుమిషన్లు అందిస్తే.. తమకాళ్లపై తాము నిలబడతామని ఎదురు చూస్తున్నా, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. అడగకపోయినా తమకోసం ఏటా రూ.2వేల కోట్లు వెచ్చించి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఇస్తామన్న కుట్టుమిషన్లు ఇవ్వకుండా జాప్యం చేయడం ఏంటని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్వయం ఉపాధి ఊసేదీ?
మహిళల స్వయం ఉపాధికి సంబంధించి బీసీ, ఈబీసీ కార్పొరేషన్లు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తిచేసి గత మార్చికి ముందే బ్యాంకులకు అందించింది. బీసీలకు సంబంధించి 18వేల మందికి, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా 4831 మందికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు మంజూరుపత్రాలు జారీచేశాయి. జనరిక్ ఫార్మసీ షాపులు కూడా అందులో ఉన్నాయి. సబ్సిడీ నిధులు ప్రభుత్వం అందిస్తే బ్యాంకులు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండ్ చేస్తాయి. కానీ, బీసీ సంక్షేమశాఖ, ఈడబ్ల్యూఎస్ విభాగంలోని ఆయా కార్పొరేషన్లు గత ఏడాదికి సంబంధించి ప్రక్రియనే పూర్తి చేయకపోవడంతో, ఈ ఏడాదికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. సాంఘిక సంక్షేమశాఖ, మైనారిటీ సంక్షేమశాఖలు కూడా రుణాల ప్రక్రియ (2025-26)ప్రారంభించి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించేందుకు అడుగు ముందుకేసింది. అయితే, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో అవికూడా దరఖాస్తుల ప్రక్రియను నిలిపేశాయి. గిరిజన సంక్షేమశాఖ అయితే వారి వద్ద కేంద్ర నిఽధులు ఉన్నప్పటికీ ట్రైకార్ ద్వారా రుణాలిచ్చేందుకు ఒక్క అడుగూ వేయలేకపోతోంది. స్వయం ఉపాధి పథకాలను పునరుద్ధరించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు రుణాలను పునరుద్ధరిస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సైతం పేర్కొంది. అయినా అమల్లో వెనుకడుగు వేయడం పట్ల బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లో నిరాశ పెల్లుబుకుతోంది. ప్రభుత్వం ఇకనైనా చొరవ తీసుకుని శిక్షణకు అవసరమైన నిధుల విడుదలతోపాటు, ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ చేయాలని, అలాగే స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని మహిళలు కోరుతున్నారు.
ఆర్థిక ప్రోత్సాహమేదీ?
కుట్టుమిషన్ పథకం ప్రారంభించి నాలుగు నెలలు పైబడినా ఈ శిక్షణకు అవసరమైన నిధులు మాత్రం విడుదల కావడం లేదు. బీసీ సంక్షేమశాఖ, ఈడబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఆర్థికశాఖకు ఫైల్ పంపినా ఏవేవో కొర్రీలు వేసి ఒక్క పైసా విడుదల చేయడం లేదు. శిక్షణకు అవసరమైన నిధులే విడుదల చేయని అధికారులు కుట్టుమిషన్ల కొనుగోలుకు ఎప్పుడు నిధులు విడుదల చేస్తారో అని వేచి చూస్తున్నారు.