Sarita Chauhan: మహిళలు, అట్టడుగు వర్గాలకు ఈ-సేవలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:05 AM
సమాజంలో మహిళలు, యువత, అట్టడుగు వర్గాలకు ఈ-సేవలు అందేలా చర్యలు చేపట్టాల్సి ఉందని ప్రజా ఫిర్యాదుల విభాగం జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్ అన్నారు.
రవాణా, రక్షణ, పౌర సేవలకు సైబర్ సెక్యూరిటీ
ఈ-గవర్నెన్స్ సదస్సులో ‘విశాఖ డిక్లరేషన్
కేంద్ర జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్ ప్రకటన
విశాఖపట్నం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): సమాజంలో మహిళలు, యువత, అట్టడుగు వర్గాలకు ఈ-సేవలు అందేలా చర్యలు చేపట్టాల్సి ఉందని ప్రజా ఫిర్యాదుల విభాగం జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్ అన్నారు. రవాణా, రక్షణ, సేవా రంగాల్లో ఉపయోగించే డిజిటల్ ప్లాట్‌ఫాంలకు విశ్వాసం ముఖ్యమని, వాటికి సైబర్ సెక్యూరిటీ కల్పించాలని కోరారు. విశాఖప్నటంలో జరుగుతున్న ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో మంగళవారం ‘విశాఖ డిక్లరేషన్’ ప్రకటించారు. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను ఢిల్లీ నుంచి గల్లీ వరకు అమలు చేయాలని సరితా చౌహాన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్ట్‌పలు, ప్రజా సంఘాల మధ్య సహకారం పెంపొందించడానికి కృషి చేస్తామని చెప్పారు. ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యాలకు అనుగుణంగా ‘కనీస ప్రభుత్వం...గరిష్ఠ పరిపాలన’ సాధించాలనే లక్ష్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులను, మోడళ్లను అమలు చేస్తున్నాయని, వాటిని మిగిలినవారూ అందిపుచ్చుకోవాలన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు, జిల్లాలు, పంచాయతీల మధ్య స్ఫూర్తిదాయకమైన పోటీ ఉండాలన్నారు. విమానాశ్రయాల్లో ఉపయోగిస్తున్న డిజి యాత్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తున్న సంపద 2.0, బెంగళూరులో ఏకథా, మహారాష్ట్ర పంచాయతీలు వినియోగిస్తున్న రోహిణి, హైవేస్ సంస్థ వినియోగిస్తున్న డామ్స్ వంటివి ఇతరులూ అమలు చేయవచ్చన్నారు. ఐఐపీఏ డీజే త్రిపాఠి, కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్, ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ పాల్గొన్నారు.