Share News

Domestic Violence: గుంజలకు తాళ్లతో చేతులు కట్టేసి.. బెల్టుతో హింసించి..

ABN , Publish Date - Sep 17 , 2025 | 03:37 AM

భార్య రెండు చేతులు తాళ్లతో పాక గుంజలకు కట్టేసి, బెల్టుతో బాదుతూ, జుట్టుపట్టుకుని వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ హింసించాడో భర్త...

Domestic Violence: గుంజలకు తాళ్లతో చేతులు కట్టేసి.. బెల్టుతో హింసించి..

  • భార్యకు నరకం చూపించిన భర్త

  • ప్రకాశం జిల్లాలో వెలుగులోకి

తర్లుపాడు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): భార్య రెండు చేతులు తాళ్లతో పాక గుంజలకు కట్టేసి, బెల్టుతో బాదుతూ, జుట్టుపట్టుకుని వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ హింసించాడో భర్త. ఒకరోజు రాత్రంతా ఈ నరకాన్ని అనుభవించిన ఆమె, మళ్లీ దాడికి ప్రయత్నించడంతో ఎలాగో తప్పించుకుని బయటపడింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాలెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన గురునాథం బాలాజీకి దగ్గర బంధువైన భాగ్యలక్ష్మితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు, మగ పిల్లాడు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తీవ్రంగా హింసించేవాడు. ఈక్రమంలోనే భార్యపిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి స్థానిక బేకరీలో పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది. శనివారం గ్రామానికి వచ్చిన బాలాజీ భార్యను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. అతని అక్క రమణమ్మ, మేనల్లుడు విష్ణు సహకరించారు. రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ హింసించారు. మరలా సోమవారం రాత్రి ఆమెపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని సమీపంలోని చర్చి వద్దకు వెళ్లడంతో అక్కడ ఉన్న స్థానికులు బాలాజీ నుంచి కాపాడారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మంగళవారం రాత్రి పొదిలి సీఐ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకొని బాధితురాలిని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. కాగా, గ్రామంలో దీనిపై విచారణ చేశామని, ఇంట్లో నిందితుడు లేడని, ప్రస్తుతానికి భాగ్యలక్ష్మి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 03:37 AM