Guntur: కాలం కాటేసింది..!
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:38 AM
విధి వంచన అంటే ఇదేనేమో..!? కిడ్నీ సమస్యకు చికిత్స కోసం ఆస్పత్రికి కెళ్తే.. గుండెపోటు వచ్చింది.
బ్రెయిన్ స్తంభించడంతో 8 నెలలుగా కోమాలోనే
దీనికి ఆపరేషన్ లేకపోవడంతో వర్తించని ఆరోగ్యశ్రీ
పుస్తెలు సహా అన్నీ అమ్మి వైద్యం చేయించిన భార్య
అయినా కోమాలోనే.. ఎనిమిది నెలలుగా నరకయాతన
రిహాబిలిటేషన్‌కు పంపాలంటే నెలకు లక్ష ఖర్చు
ప్రభుత్వ, దాతల సాయం కోసం ఎదురుచూపు
(గుంటూరు సిటీ - ఆంధ్రజ్యోతి)
విధి వంచన అంటే ఇదేనేమో..!? కిడ్నీ సమస్యకు చికిత్స కోసం ఆస్పత్రికి కెళ్తే.. గుండెపోటు వచ్చింది. సీపీఆర్ చేస్తుండగానే బ్రెయిన్ స్తంభించడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో అప్పటి దాకా బాగానే ఉన్న మనిషి ఒక్కసారిగా జీవచ్ఛవంలా మారిపోయాడు. ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి. ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న భర్తను బతికించుకోవడానికి ఆయన భార్య పడరాని పాట్లు పడుతోంది. రేపో.. మాపో.. మళ్లీ మామూలు మనిషి అవుతాడన్న ఆశతో అయినకాడికి అప్పులు చేసింది. చివరకు మెడలోని పుస్తెలు కూడా అమ్మేసింది. ఇక తన వద్ద అమ్మడానికి ఏమీ లేదని.. తన భర్త వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం, దాతలే సాయం చేయాలని దీనంగా వేడుకుంటోంది. గుంటూరు నగర పరిధిలోని ఏటుకూరుకు చెందిన అన్నాబత్తుల గౌరీశంకర్ (53) లారీ ట్రాన్స్‌పోర్ట్‌లో కమీషన్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 12న కిడ్నీ సమస్య ఉందని ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ వైద్యం జరుగుతుండగానే గుండె నొప్పి వచ్చింది. గమనించిన వైద్య సిబ్బంది సీపీఆర్ చేస్తుండగానే బ్రెయిన్ స్తంభించింది. దీంతో గౌరీశంకర్ కోమాలోకి వెళ్లాడు. దేహంలో ప్రాణమైతే ఉంది కానీ చలనం లేదు..! ఇద్దరు ముగ్గురు పెద్ద వైద్యులు పరీక్షించారు. బ్రెయిన్ స్ర్టోక్ అయితే ఆపరేషన్ చేయొచ్చు.. కానీ దీనికి ఆపరేషన్ ఉండదని తేల్చారు. నెల రోజులు పాటు ఆస్పత్రిలో ఉన్నా స్పందనలు కనిపించలేదు. అప్పటికే సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇకపై ఖర్చు పెట్టే స్థోమత లేక గౌరీశంకర్‌ను ఇంటికి తరలించారు.
ప్రతి నెలా మందులకు రూ.20 వేలు
కోమాలోకి వెళ్లిన రోజు... గౌరీశంకర్ పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతం (ఎనిమిది నెలలు తర్వాత) కూడా అలాగే ఉంది. ప్రతి రోజూ ఫిజియోథెరపీ చేయించడంతో పాటు, మందులు వాడాల్సిందేనని డాక్టర్లు చెప్పారని గౌరీశంకర్ భార్య స్వప్న తెలిపారు. రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచితే బ్రెయిన్ కదలికలు మెరుగుపడే అవకాశం ఉన్నట్లు వైద్యులు సూచించారన్నారు.. అక్కడ ఉంచాలంటే నెలకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఇంట్లోనే ఉంచి చికిత్స చేయిస్తున్నామన్నారు. ప్రతినెలా మందుల కోసం రూ.20 వేలు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. గౌరీశంకర్‌కు వాస్తవానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. బ్రెయిన్ ఆపరేషన్‌లకు అది వర్తిస్తుంది. కానీ ఆయనకు బ్రెయిన్ స్ట్రక్ కావడం వల్ల ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని డాక్టర్లు తేల్చడంతో ఆరోగ్యశ్రీ వర్తించలేదు. దాంతో ఆస్పత్రి బిల్లులు చెల్లించేందుకు ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసినట్లు స్వప్న తెలిపారు. చివరికి మెడలోని పుస్తెలు కూడా అమ్మేశానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ప్రభుత్వం, దాతలే తమను ఆదుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ స్పందిస్తే తన మాంగళ్యం నిలుస్తుందని అన్నారు. సహాయం చేయాలనుకునే దాతలు 9949546636 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు.