Share News

High Court: మహిళ అదృశ్యం.. కేసు దర్యాప్తు 13 ఏళ్లా

ABN , Publish Date - Sep 30 , 2025 | 06:51 AM

ఓ మహిళ అదృశ్యానికి సంబంధించి 2012లో నమోదైన కేసులో ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయకపోవడం ఏమిటని పోలీసుల తీరును హైకోర్టు ప్రశ్నించింది.

High Court: మహిళ అదృశ్యం.. కేసు దర్యాప్తు 13 ఏళ్లా

  • పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం

  • సామాన్యుల కేసుల్లో అలసత్వమని వ్యాఖ్య

  • తాజా వివరాలతో అఫిడవిట్‌ వేయాలని ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఓ మహిళ అదృశ్యానికి సంబంధించి 2012లో నమోదైన కేసులో ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయకపోవడం ఏమిటని పోలీసుల తీరును హైకోర్టు ప్రశ్నించింది. సామాన్య ప్రజలకు సంబంధించిన ప్రతి కేసు దర్యాప్తులోనూ పోలీసులు ఇలాగే అలసత్వం ప్రదర్శిస్తున్నారని అభిప్రాయపడింది. కేసు దర్యాప్తు పురోగతిపై తాజా వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. అఫిడవిట్‌ను పరిశీలించాక దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయమై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన బండారు ప్రకాశరావు తన కుమార్తె మంగాదేవిని మోహన్‌బ్రహ్మాజి అనే వ్యక్తికి చ్చి వివాహం చేశారు. కొన్నాళ్ల తర్వాత 2012 అక్టోబరు 18న.. మంగాదేవి ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ ప్రకాశరావుకు తన అల్లుడి నుంచి ఫోన్‌ వచ్చింది. దీనిపై అదే రోజు ఆయన తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయ గా మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. తన కుమార్తె అదృశ్యంపై సీఐడీ, కలెక్టర్‌, ఎస్‌పీ, హెచ్‌ఆర్సీలకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో.. 2017లో ప్రకాశరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పలుమార్లు వాయిదా పడింది. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా పైలును పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీసులు కేసు దర్యాప్తు చేసిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తు పురోగతిపై తాజాగా నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఆతర్వాత కేసును సీబీఐకి అప్పగించడంపై నిర్ణయానికి వస్తామని చెప్పారు.

Updated Date - Sep 30 , 2025 | 06:53 AM