Share News

Cheating Bank Manager: రియల్‌ వ్యాపారమని నమ్మించి.. కోటిపైనే కొట్టేసిన మహిళ

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:10 AM

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేద్దామని, ఎక్కువగా డబ్బులు గడిద్దామని చెప్పి ఓ బ్యాంక్‌ మేనేజర్‌ వద్ద నగదు కొట్టేసింది ఓ మహిళ. బాధితుడి...

Cheating Bank Manager: రియల్‌ వ్యాపారమని నమ్మించి..  కోటిపైనే కొట్టేసిన మహిళ

  • ఓ బ్యాంకు మేనేజర్‌కు టోకరా

  • అరెస్టు చేసిన నిడదవోలు పోలీసులు

  • నగలు, 4.9 లక్షల నగదు స్వాధీనం

నిడదవోలు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేద్దామని, ఎక్కువగా డబ్బులు గడిద్దామని చెప్పి ఓ బ్యాంక్‌ మేనేజర్‌ వద్ద నగదు కొట్టేసింది ఓ మహిళ. బాధితుడి ఫిర్యాదు మేరకు మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిడదవోలులో శనివారం సీఐ పీవీజీ తిలక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఎస్‌బీఐ బ్రాంచిలో గతంలో చప్పిడి శ్రీనివాస్‌ మేనేజర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో నిడదవోలు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన అంబటి ఉమ.. అలియాస్‌ శ్రావ్యారెడ్డి లోను కోసమని బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌తో పరిచయం పెంచుకుంది. తనకు నూజివీడులో పొలాలు ఉన్నాయని, అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని శ్రీనివా్‌సకు మాయమాటలు చెప్పి నమ్మించింది. ఆ మాటలు నమ్మిన ఆయన తన సొంత డబ్బులు రూ. కోటి పైనే ఆమెకు ఇచ్చారు. అనంతరం ఆమె తాత్సారం చేస్తుండటంతో అనుమానం వచ్చి తన డబ్బు వెనక్కి ఇచ్చేయాలని కోరారు. అయినా ఆమె స్పందించలేదు. డబ్బులు అడిగితే కేసులు పెడతానని బెదిరించింది. దీంతో మేనేజర్‌ శ్రీనివాస్‌ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి డీఎస్పీ జి.దేవ కుమార్‌ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేనేజర్‌ను మోసగించిన మహిళను శుక్రవారం అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి 312 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 4.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్‌ మేనేజర్‌ హైదరాబాద్‌ మెయిన్‌ బ్రాంచిలో పనిచేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - Sep 14 , 2025 | 03:10 AM