Jubeida Begum: మస్కట్‌లో గుంతకల్లు మహిళకు నరకం
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:31 AM
ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లిన జుబేదా బేగం అనే మహిళ తినడానికి తిండిలేక నరకం చూస్తున్నారు. తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు...
ఇండియాకు రప్పించాలని వేడుకోలు
లోకేశ్‌ను కలిసిన బాధిత కుటుంబం
గుంతకల్లు టౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లిన జుబేదా బేగం అనే మహిళ తినడానికి తిండిలేక నరకం చూస్తున్నారు. తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కోరుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ అలీ బాషా భార్య జుబేదా బేగం బద్వేలుకు చెందిన ఏజెంట్ మహమ్మద్ రఫీ ద్వారా మస్కట్‌కు వెళ్లారు. 8నెలల క్రితం అక్కడ ఓ సేఠ్ ఇంట్లో పని మనిషిగా చేరారు. నాటినుంచీ తనకు సరిగా భోజనం పెట్టడం లేదని, జీతం ఇవ్వకుండా హింసిస్తున్నారని, ఆరోగ్యం కూడా దెబ్బతిందని రెండు రోజుల క్రితం సెల్ఫీ వీడియో పంపించారు. తనను కాపాడాలని ఏజెంట్‌కు ఫోన్ చేస్తే.. రూ.2లక్షలు అడుగుతున్నాడని వాపోయారు. ఇక్కడే ఉంటే చచ్చిపోతానని, దయచేసి ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ వద్దకు శనివారం బాధితురాలి కుటుంబ సభ్యులను తీసుకెళ్లి సమస్యను వివరించారు. జుబేదాను స్వదేశానికి వెంటనే రప్పిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారని బాధిత కుటుంబం తెలిపింది.