Domestic Dispute: సోదరుడితో కలసి ప్రియుడి హత్య
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:49 AM
సహజీవనం చేస్తున్న తయ్యబా అనే మహిళ.. తన ప్రియుడు సమీర్ అలియాస్ పీకే ఇనాందార్(26)ను సోదరుడితో కలిసి హత్య చేసింది.....
రాత్రి చంపి.. ఉదయం వరకు మృతదేహం వద్దే..
బెంగళూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): సహజీవనం చేస్తున్న తయ్యబా అనే మహిళ.. తన ప్రియుడు సమీర్ అలియాస్ పీకే ఇనాందార్(26)ను సోదరుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఆదివారం రాత్రి విజయపుర జిల్లా కేంద్రంలోని అమన్ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సమీర్‌పై రౌడీ షీట్ ఉంది. గోల్‌గుంబజ్ పోలీ్‌సస్టేషన్‌లో హత్య, హత్యాయత్నం కేసులున్నాయి. తాను ఉంటున్న ప్రాంతానికి చెందిన తయ్యబాతో నాలుగేళ్ల నుంచి సమీర్ సహజీవనం చేస్తున్నాడు. ఏడాది క్రితం ఆమెకు దూరంగా ఉండాలని భావించాడు. ఆ తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. ఇటీవల తయ్యబాను సమీర్ వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని భావించి.. తయ్యబా తన సోదరుడు అస్లాంతో మంతనాలు సాగించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు సమీర్ ఆమె నివాసానికి వెళ్లాడు. రాత్రి 11 గంటల తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కా తమ్ముడు కలసి సమీర్‌ను గొంతు నులిమి హతమార్చారు. ఇద్దరూ.. సోమవారం ఉదయం వరకు మృతదేహం వద్దనే ఉన్నారు.