పీడీ యాక్ట్ ఉపసంహరించండి: రాఘవులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:31 AM
సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్టును ఉపసంహరించి...
అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్టును ఉపసంహరించి, వెంటనే ఆయనను విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘సామాన్య ప్రజలు, రైతుల జీవితాల మెరుగు కోసం నిరంతరం పని చేస్తున్న మా పార్టీ నాయకుడిని ఒక నేరస్థుడిగా చిత్రీకరించి అరెస్టు చేసి జైలుకు పంపడం విస్మయం కలిగిస్తోంది. ఎవరి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ చర్యకు పూనుకున్నదో ప్రజలు గమనిస్తున్నారు. రైతుల హక్కుల కోసం పని చేయడాన్ని ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుందా? అనేక అక్రమాలకు, దుర్మార్గాలకు పాల్పడుతున్న నేరస్థులందరూ కళ్ల ముందు దర్జాగా తిరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. అప్పలరాజును వేకువజామున తీసుకెళ్లడం ప్రజాస్వామ్యమేనా?’ అని లేఖలో ప్రశ్నించారు. సీఎం వెంటనే జోక్యం చేసుకుని అప్పలరాజుపై మోపిన అభియోగాలను ఉపసంహరించుకుని, ఆయనను విడుదల చేసేలా ఆదేశించాలని కోరారు.