Share News

Rural Development Reforms: జీరామ్‌జీతో ఊరట కలిగేనా

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:50 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీ రామ్‌ జీ (గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌)తో రాష్ట్రాలకు వ్యయభారమైనా..

Rural Development Reforms: జీరామ్‌జీతో ఊరట కలిగేనా

  • ఉపాధి పథకం స్థానంలో వచ్చే కొత్త పథకంపైనే సిబ్బంది ఆశలు

  • నిర్వహణ వ్యయం 9 శాతానికి పెంచే యోచన

  • హామీ ఇచ్చిన కేంద్రమంత్రి చౌహాన్‌

  • ఏపీలో గ్రామీణాభివృద్ధిశాఖ సంస్కరణలకు మార్గం సుగమం

  • కొత్త చట్టం విధి విధానాలు, మార్గదర్శకాల కోసం నిరీక్షణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీ రామ్‌ జీ (గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌)తో రాష్ట్రాలకు వ్యయభారమైనా.. ఆ పథకంలో సిబ్బందికి కొంత ఊరట కలిగించే అంశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు అధికారులు!. ఇటీవల కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను గ్రామ ఉపాధి అసిస్టెంట్లు కలిసిన నేపఽథ్యంలో ఉపాధి పథకం నిర్వహణకు ఇప్పటి వరకు ఇస్తున్న నిర్వహణ వ్యయం 6 శాతం నుంచి 9 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించమే ఇందుకు పెద్ద నిదర్శనం. దీంతో జీతాలు మరింత మెరుగుపడుతాయని, ఉద్యోగుల మోముల్లో సంతోషం నింపగలమని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం కేవలం ప్రభుత్వ ఉద్యోగులే చేపడుతుండగా, ఏపీ, తెలంగాణ ల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది చేతుల మీదుగా నడుస్తోంది. దీంతో ఉపాధి పథకం స్థానంలో జీ రామ్‌ జీ వస్తుందని పార్లమెంట్‌లో చట్టం చేసినప్పుడు మన రాష్ట్రంలో పనిచేసే సిబ్బంది ఎక్కువగా ఆదుర్దా పడ్డారు. కొత్త పథకంలో తమ ఉద్యోగతకు భద్రత ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠకు గురయ్యారు. అయితే నిర్వహణ వ్యయంపై కేంద్ర మంత్రి ఇచ్చిన భరోసాతో ఊరట చెందుతున్నారు.


9 శాతానికి పెంచితే శుభపరిణామమే...

ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రాలు ఖర్చు చేసే వ్యయానికి 6 శాతం అదనంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహణ వ్యయం చెల్లిస్తోంది. తాజాగా మరో 3 శాతం అదనంగా చెల్లించాలని నిర్ణయించడం శుభపరిణామమే. గతంలో టీసీఎస్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసేందుకూ ఈ నిధులు ఖర్చు చేసేవారు. అయితే వైసీపీ హయాంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ వ్యయం పూర్తి స్థాయిలో అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత ప్రభుత్వం ఉపాధి సిబ్బందికి జీతాలు పెంచలేదు. పైగా వారి సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. జీతాల పెంపుదలతో పాటు ఉపాధి సిబ్బంది కేడర్‌లో వ్యత్యాసాలు సవరించి, ఆ ఉద్యోగులకు గౌరవప్రదమైన పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు కమిషనరేట్‌ అధికారులు ఆర్నెల్లపాటు కసరత్తు చేసి ఉపాధి సిబ్బందికి కొత్త సంవత్సరంలో తీపి కబురు చెప్పాలని భావించారు. అయితే, ఇంతలో ఉపాధి పథకం స్థానంలో జీ రామ్‌ జీ కొత్త పథకం ప్రకటన వారి ఆశలపై కొంత నీళ్లు చల్లింది. కొత్త చట్టం విధి విధానాలు, కార్యాచరణ మార్గదర్శకాలు వచ్చేదాకా గ్రామీణాభివృద్ధిశాఖ అడుగు ముందుకేయలేని పరిస్థితి ఏర్పడింది.


జీతాల పెంపుదల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ

గత టీడీపీ హయాంలో అప్పటి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌ .. అప్పట్లో అమలైన పీఆర్సీకి అనుగుణంగా ఉపాధి సిబ్బందికి భారీగా వేతనాలు పెంచారు. ఆ తర్వాత ఏడేళ్లుగా వేతనాలు పెరగలేదు. సెర్ప్‌ ఉద్యోగులకు సైతం వారి వేతనాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెరిగాయి. అయితే ఉపాధి సిబ్బంది తమకు కూడా వేతనాలు పెంచాలన్న డిమాండ్‌ అలాగే మిగిలిపోయింది. ఉపాధి సిబ్బంది స్కీం ఉద్యోగులైనందున వారికొచ్చిన నిర్వహణ వ్యయం నుంచే వ్యయం చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రమిచ్చిన అరకొర నిర్వహణ వ్యయంతో ఏడేళ్లపాటు ఉపాధి సిబ్బంది ఈసురోమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి, వాటర్‌షెడ్‌ పథకంలో ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయీ్‌సగా(ఎ్‌ఫటీఈ)గా ఉన్న వారు సుమారు 5054 మంది ఉన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా మరో 12 వేలు.. వెరసి 20 వేల లోపు సిబ్బంది ఈ పథకంలో పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 4670 మంది సిబ్బంది ఉపాధి పథకంలో కీలకంగా మండల స్థాయి, ఆ పై స్థాయిల్లో పనిచేస్తున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల స్థానంలో ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త వాళ్లు వస్తున్నారు. సుమారు 3500 మంది సిబ్బంది ఎప్పటి నుంచో పనిచేస్తున్నవారు ఉన్నారు. మొత్తంగా 20 వేల మంది సిబ్బంది, వారిని నమ్ముకున్న కుటుంబాలు కలిపి సుమారు లక్ష మంది ఉపాధి పథకంలో నిర్వహణ వ్యయంపై ఆధారపడి జీవిస్తున్నారు.


  • జీ రామ్‌ జీపై 5న ప్రత్యేక గ్రామ సభలు

  • కొత్త పథకంపై ప్రజల్లో అవగాహనకు కేంద్రం ఆదేశాలు

  • అదే రోజున పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌ కూడా..

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీ నరేగా) స్థానంలో కొత్త పథకం జీ రామ్‌ జీని తీసుకొచ్చిన నేపథ్యంలో దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రంచర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా పంచాయతీల్లో ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అన్ని రాష్ట్రాల సీఎ్‌సలకు లేఖలు రాసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఆ రోజు గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ ఆదేశాలిచ్చింది. కొత్త పథకం వికసిత్‌ భారత్‌- గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (గ్రామీణ్‌)పై గ్రామ సభల్లో ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆ ఆదేశాల్లో కోరారు. కాగా, 5వ తేదీన గ్రామ సభల్లో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌ కూడా నిర్వహించాలని, చెత్త రహిత గ్రామ పంచాయతీలుగా తీర్మానాలు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఆదేశించింది.

Updated Date - Dec 31 , 2025 | 04:52 AM