కొడుకుతో కలిసి భర్తను హతమార్చిన భార్య
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:28 AM
మద్యానికి బానిసై నిత్యం హింసిస్తున్న భర్తను కొడుకుతో కలిసి భార్య హతమార్చిన ఘటన తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు దళితవాడలో సోమవారం రాత్రి జరిగింది.
- తాగొచ్చి హింసించడంతో విసిగిన కుటుంబం
- చెక్క, ఇనుపరాడ్‌తో దాడి.. చాగంటిపాడులో ఘటన
తోట్లవల్లూరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : మద్యానికి బానిసై నిత్యం హింసిస్తున్న భర్తను కొడుకుతో కలిసి భార్య హతమార్చిన ఘటన తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు దళితవాడలో సోమవారం రాత్రి జరిగింది. చాగంటిపాడు దళితవాడలో నిమ్మకూరి ఆనందరావు వ్యసాయ పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. భార్య సుపాద స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు వాసంత కానూరులోని ఓ ప్రైవేటు వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, రెండవ కుమారుడు భార్గవ్ విజయవాడలో డిగ్రీ చదువుతున్నాడు. కొడుకులిద్దరు దూరాన ఉండటంతో తండ్రి ఆనందరావు మద్యం తాగివచ్చి భార్య సుపాదను హింసిస్తుండేవాడు. అలాగే భార్యపై అనుమానం వ్యక్తం చేస్తు కొడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆనందరావు సోమవారం విపరీతంగా మద్యం తాగి అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి డ్యూటీలో ఉన్న భార్యను అసభ్యపదజాలంతో దూషించి రభస సృష్టించాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భార్యను హింసించాడు. దీంతో భర్త పెట్టే హింసను భరించలేక విజయవాడలో ఉన్న కొడుకులిద్దరికి విషయం చెప్పింది. కొడుకులిద్దరు వెంటనే సోమవారం రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి చాగంటిపాడు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తండ్రి ఆనందరావు మత్తులో నిద్రిస్తుండగా కొడుకులు లేపి తల్లిని ఎందుకు హింసిస్తున్నావని ప్రశ్నించారు. దీంతో ఆనందరావు కోపంతో ఓ ఇనుపరాడ్‌ను తీసుకుని పెద్ద కొడుకు చేతిపై కొట్టాడు. గాయం కావటంతో రెచ్చిపోయిన కొడుకు వాసంత ఇంటి పాత గుమ్మం చెక్క తీసుకుని తండ్రిపై దాడి చేయగా తలకు బలంగా దెబ్బ తగిలి పడిపోయాడు. దాంతో తండ్రి చేతిలోని ఇనుపరాడ్ కిందపడగా ఆ రాడ్ తీసుకుని తండ్రి తలపై విచక్షణారహితంగా కొట్టటంతో తీవ్ర రక్తస్రావంతో ఇంటి ఆవరణలోనే కుప్పకూలి చనిపోయాడు. భర్తను కొట్టేందుకు భార్య సుపాద కూడా సహకరించింది.
కొడుకును కాపాడే ప్రయత్నం విఫలం
హత్యానంతరం పెద్ద కొడుకు వాసంత ఒంటిపై రక్తపు మరకలైన చొక్కాను విప్పి బక్కెట్లో జాడించి వేరే చొక్కా వేసుకుని ఏమి తెలియనట్టు నటించాడు. తర్వాత గ్రామంలోని ఓ వ్యక్తి 112కి కాల్‌చేసి ఆనందరావు హత్య విషయాన్ని తెలియజేయగా మంగళవారం ఉదయం సీఐ వై చిట్టిబాబు, ఎస్సై సీహెచ్ అవినాష్ చాగంటిపాడు వచ్చి ఆనందరావు మృతదేహాన్ని పరిశీలించారు. విజయవాడ నుంచి క్లూస్‌టీంను కూడా రప్పించారు. తన భర్త మద్యం తాగి హింసిస్తుంటే చెక్కతో తలపై కొట్టి తానే చంపానని భార్య సుపాద సీఐకి చెప్పింది. తలపై లోతైన గాయాలను పరిశీలించిన సీఐ ఇంత పెద్దగాయాలు అయ్యే విధంగా కొట్టటం మహిళ వల్ల కాదని గ్రహించి ప్రశ్నించటంతో పెద్ద కొడుకు వాసంత కొట్టి చంపినట్టు బయటపెట్టింది. హతుని తల్లి వెంకటేశ్వరమ్మ నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. హతుని భార్య సుపాద, పెద్ద కొడుకు వాసంతపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్, సీఐ చిట్టిబాబుతో కలిసి చాగంటిపాడు ఆనందరావు హత్యకు గురైన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.