కొనేవారేరీ?
ABN , Publish Date - May 19 , 2025 | 11:55 PM
పొగాకు కంపెనీల మాయాజాలంలో రైతులు మరోసారి నష్టపోయారు. అధిక ధర సాకు చూపుతూ రైతులను మభ్యపెట్టి వారితో ఒప్పందం కుదుర్చుకోవడం, తీరా పంట చేతికొచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేయడంతో ఈ ఏడాది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పొగాకు రైతుల ఆశలకు పొగ
ఒప్పందం మేరకు ముందుకు రాని కంపెనీలు
పీకల్లోతు కష్టాలతో... ఆందోళనలో రైతులు
ఉమ్మడి జిల్లాల్లో భారీగా పెరిగిన సాగు
ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు
నంద్యాల ఎడ్యుకేషన, మే 19 (ఆంధ్రజ్యోతి): పొగాకు కంపెనీల మాయాజాలంలో రైతులు మరోసారి నష్టపోయారు. అధిక ధర సాకు చూపుతూ రైతులను మభ్యపెట్టి వారితో ఒప్పందం కుదుర్చుకోవడం, తీరా పంట చేతికొచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేయడంతో ఈ ఏడాది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పొగాకు కంపెనీలు రైతులతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను కూడా రైతుల చేతుల్లో కాకుండా వారి బలహీనతను ఆసరా చేసుకుని పలు కంపెనీలు వారి వద్దనే ఉంచుకుని దగాకు పాల్పడుతున్నాయి. పొగాకు రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టపోకూడదని, నాణ్యత ఆధారంగా బర్లీ పొగాకును కంపెనీలు తప్పకుండా సేకరించాలని, పొగాకు నిల్వలు అలాగే ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవసాయాధికారులు, అటు కంపెనీలను ఆదేశించినా పొగాకు కంపెనీల్లో కదలిక లేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ పెరిగిన పంట సాగు
గత ఏడాది పోలిస్తే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అత్యధికంగా పొగాకు పంట విస్తీర్ణత ఈ ఏడాది పెరిగింది. 2023-24 సంవత్సరంలో నంద్యాల జిల్లాలో 2,858 హెక్టార్‌లలో పొగాకు వేయగా ఈ 2024-25 సీజనలో 6,886 హెక్టార్లలో పంట సాగుచేశారు. అమాంతంగా 135 శాతం పెరిగింది. కర్నూలు జిల్లాలో గత ఏడాది 2,830 హెక్టార్లలో పంట వేయగా ఈ ఏడాది 5,984 హెక్టార్లలో పంటను సాగుచేశారు. ఈ ఏడాది 11,451 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. సాగు అమాంతంగా రెండు రెట్లు కావడంతో పొగాకు కొనుగోలుదారులు అయోమయంలో పడ్డారు. రైతుల నుంచి అరకొరగా కొనుగోలు చేయడం, తడిగా ఉందంటూ, నాణ్యత లేదంటూ సాకులు చెప్పి వెనక్కు పంపుతున్నారు. దీంతో రైతులకు పొగాకు భారంగా మారింది. నంద్యాల జిల్లాలో స్థానికంగా చుక్కబర్లీ, బ్యార్నీబర్లీ పొగాను అత్యధికంగా సాగుచేస్తున్నారు. నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, మిడ్తూరు, ఆత్మకూరు, పాణ్యం వంటి ప్రాంతాల్లో చుక్కబర్లీ, మహానంది, గడివేముల, బండిఆత్మకూరు, నంద్యాల మండలాల్లో బ్యార్నీబర్లీ పొగాకు రకాలను అత్యధికంగా పండిస్తున్నారు. కంపెనీలు గత 15 రోజుల క్రితం వరకు చుక్కబర్లీని స్థానికంగానే రూ.12వేల నుంచి 15వేల వరకు, బ్యార్నీబర్లీని రూ.15వేల నుంచి 17వేల వరకు కొనుగోలు చేశాయి. తీరా పంట అధికం కావడంతో చేతులెత్తేశాయి. అప్పుడు, ఇప్పుడు అంటూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు.
ఫ 500 క్వింటాళ్లు నిలిచిపోయింది
- మద్దిలేటి, కరివేన, ఆత్మకూరు మండలం
60 ఎకరాల్లో పొగాకు పంటను సాగు చేశా. సుమారు 500 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అలయెన్స కంపెనీ ఒప్పందం మేరకు తాను ఎకరాకు 25వేల కౌలుతో 55 ఎకరాలు తీసుకుని, దాంతోపాటు నాకున్న ఐదు ఎకరాల సొంత భూమిలో కూడా పొగాకు పంటను వేశాను. పెట్టుబడి సుమారు రూ.70 లక్షల మేర వచ్చింది. అప్పులు చేసి పంటను పండించాను. తీరా పంట చేతికొచ్చిన తర్వాత కంపెనీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కంపెనీ కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతాను. కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.
ఫ మా పరిస్థితి దయనీయంగా ఉంది.
- నాగేశ్వరరెడ్డి, పాములపాడు
ఆరు ఎకరాల్లో పొగాకు వేయగా సుమారు 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సుమారు రూ.8లక్షల మేర పెట్టుబడి పెట్టి పంటను పండించాము. కంపెనీలు కొనుగోలుకు ముందుకు రాకపోతే మా పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మాకు కలెక్టర్ న్యాయం చేయాలి.
ఫ 60 క్వింటాళ్లు దిబ్బలో వేయమన్నారు.
- మౌళాలి, చౌట్కూరు, మిడ్తూరు మండలం
ఏడు ఎకరాల్లో పొగాకు వేసి, కుటుంబమంతా కష్టపడి పండించాము. పంట చేతికి వచ్చిన తర్వాత జీపిఐ కంపెనీ కొనుగోలు చేయడం ఆలస్యం చేసింది. ఒకరోజు భారీవర్షంతో కొంతమేర తడిచింది. దాన్ని మళ్లీ ఎండబెట్టుకుని 60క్వింటాళ్లు కంపెనీకి తీసుకెలితే దిబ్బలో వేయమన్నారు. దీంతో చేసేదేమిలేక వెనక్కుతీసుకొచ్చాను. మా కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి.
ఫ మిర్చిలో నష్టమే...పొగాకులో నష్టమే...
- బ్రహ్మీశ్వరరెడ్డి, నెరవాడ, పాణ్యం మండలం
ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో మిర్చి పంట వేసి సరైన ధర లేక నష్టపోయాను. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు వేస్తే పంట చేతికొచ్చినాక కొనేవారు లేరు. రెండు పంటల్లో నష్టం వాటిల్లింది. రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
ఫ మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాలి
- రాజశేఖర్, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
పొగాకు రైతుల సమస్యను పరిష్కరించాలని మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం దారణం. పొగాకు రైతులను ఆదుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేఽశించినా మిన్నకుండడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము. కంపెనీలు దిగివచ్చి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి.
ఫ కంపెనీలతో చర్చిస్తున్నాం
- మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి, నంద్యాల
పొగాకు కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నాం. తప్పకుండా పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం. రైతులందరికీ న్యాయం జరిగేలా చేస్తాం. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దు.