చక్రం తిప్పిందెవరు?
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:25 AM
జిల్లాలో శాంతి భద్రతలు, రాజకీయ పరిణామాలు, పోలీస్‌శాఖలో పనిచేసే అధికారుల పనితీరు ఇతరత్రా కీలక సమాచారం ఎప్పటికపుడు తెలుసుకుని జిల్లాస్థాయి అధికారికి తెలియజేసే ప్రత్యేక అధికారి పోస్టులో వివాదాస్పద అధికారిని నియమించడంపై రాజకీయ, పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ అధికారి గతంలో వైసీపీ నాయకులు చెప్పినట్లుగా వ్యవహరించి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి అధికారిని పోలీస్‌శాఖలో ప్రత్యేక విభాగంలో కీలక పోస్టులో నియమించడంలో తెరవెనుక ఎవరి హస్తం ఉందనే అంశంపై నియోజకవర్గాల స్థాయి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు చర్చ జరుగుతోంది.
- జిల్లాలో ప్రత్యేక అధికారి పోస్టులో వివాదాస్పద అధికారి
- యువగళం పాదయాత్రలో టీడీపీ శ్రేణులపై కేసులు
- వెంటాడి అరెస్టు చేయడంలో కీలక పాత్ర
- వైసీపీతో అంటకాగిన అధికారి నియామకంపై శాసన సభ్యులు, కూటమి నేతల్లో వ్యతిరేకత
- ఈ అధికారి వచ్చాక జిల్లాలో జోరందుకున్న పేకాట శిబిరాలు
జిల్లాలో శాంతి భద్రతలు, రాజకీయ పరిణామాలు, పోలీస్‌శాఖలో పనిచేసే అధికారుల పనితీరు ఇతరత్రా కీలక సమాచారం ఎప్పటికపుడు తెలుసుకుని జిల్లాస్థాయి అధికారికి తెలియజేసే ప్రత్యేక అధికారి పోస్టులో వివాదాస్పద అధికారిని నియమించడంపై రాజకీయ, పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ అధికారి గతంలో వైసీపీ నాయకులు చెప్పినట్లుగా వ్యవహరించి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి అధికారిని పోలీస్‌శాఖలో ప్రత్యేక విభాగంలో కీలక పోస్టులో నియమించడంలో తెరవెనుక ఎవరి హస్తం ఉందనే అంశంపై నియోజకవర్గాల స్థాయి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు చర్చ జరుగుతోంది.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం:
జిల్లా పక్కనే ఉన్న మరో జిల్లా కేంద్రంలో పనిచేసిన సమయంలో ఈ అధికారి పూర్తిస్థాయిలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ నాయకులపై కేసులు బనాయించి, వారిని వెంటాడి మరీ అరెస్ట్ చేశారని సమాచారం. ఈ అధికారి ధోరణికి బెదిరిపోయి కొందరు టీడీపీ నాయకులు బయటకు రాకుండా ముందస్తు బెయిల్ వచ్చేవరకు అజ్ఞాతంలో ఉండి పోయారని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇంతలా వైసీపీతో అంటకాగిన అధికారిని జిల్లా పోలీస్ విభాగంలో ప్రత్యేక అధికారిగా నియమించడం వెనుక ఎవరున్నారనే అంశంపై అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. జిల్లాలో రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది అంచనాలకు అందదు. ఇలాంటి జిల్లాలో పోలీస్ శాఖలో కీలక పోస్టును వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారికి అప్పగించడం వెనుక ఏదో మతలబు దాగి ఉందని అధికార పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ అధికారి నియామకంపై జిల్లాలో అధిక శాతం ఎమ్మెల్యేలు గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం వద్ద ఈ అధికారి నియామకంపై ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం.
జోరుగా పేకాట శిబిరాలు
ఇటీవల కాలంలోనే ఈ అధికారి జిల్లా పోలీస్‌శాఖలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరిన కొద్దిరోజులపాటు నిక్కచ్చిగానే వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రత్యేక అధికారితో మమేకమైన ఇతర సర్కిళ్లలో పనిచేసే పోలీస్ అధికారులు జిల్లాలో పేకాట శిబిరాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారనే విమర్మలు వినిపిస్తున్నాయి. పేకాట శిబిరాలపై నిఘా ఉన్నట్లుగా చూపేందుకు ఒకటీ రెండు ప్రాంతాల్లో దాడులు చేసి, పోలీసుల పనితీరు ఇలా ఉంటుందని చెప్పకనే చెప్పి, తెరవెనుక మాత్రం పేకాట శిబిరాలను పోలీస్ అధికారుల కనుసన్నల్లోనే నడుపుతున్నారని ఆ శాఖ అధికారులు, సిబ్బంది చెప్పుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారని సమాచారం. బలరామునిపేటకు చెందిన ఓ వ్యక్తి పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతని ఇంటిలోనే పేకాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ విషయాన్ని పోలీసులు బయటకు రానీయకుండా గోప్యత పాటించారు. పోలీసులకు పట్టుబడిన తర్వాత పేకాట శిబిరాల నిర్వాహకుడు చిట్టిపాలెం, బైపాస్ రోడ్డులోని శ్మశాన వాటిక, కుమ్మరిగూడెం తదితర ప్రాంతాల్లో రోజుకో ప్రాంతంలో పేకాట శిబిరాలు పోలీసుల సూచనల మేరకే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పామర్రులో ఇటీవల కాలంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారుజాము వరకు షిప్టులవారీగా పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇంద జరుగుతున్నా పోలీస్ అధికారులు చూసీ, చూడనట్లుగా వ్యవహరించడం వెనుక బలమైన కారణాలు ఏమై ఉంటాయనే అంశంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.