Share News

సారథ్యం ఎవరికి?

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:29 AM

తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు ఎవరు అన్నదానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో పార్టీని నడిపిస్తున్న నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణకు నామినేటెడ్‌ పదవులు రావడంతో కొత్త వారికి అవకాశం ఉంటుందని పలువురు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణ, గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌ (అన్న), బూరగడ్డ వేదవ్యాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే వారికే అధిష్ఠానం అవకాశం ఇస్తుందనే చర్చ నడుస్తోంది.

సారథ్యం ఎవరికి?

- ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో టీడీపీ అధ్యక్షుల ఎన్నికల సందడి

- త్వరలో జిల్లా సారఽథులను ఎంపిక చేయనున్న అధిష్ఠానం

- పాతవారిని కొనసాగిస్తారా ? కొత్తవారికి అవకాశం ఇస్తారా ?

- పార్టీ బాధ్యతలు నిర్వహించటానికి సిద్ధంగా నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణ

- ఆశావహుల్లో గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌ (అన్న), బూరగడ్డ వేదవ్యాస్‌

తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు ఎవరు అన్నదానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో పార్టీని నడిపిస్తున్న నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణకు నామినేటెడ్‌ పదవులు రావడంతో కొత్త వారికి అవకాశం ఉంటుందని పలువురు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణ, గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌ (అన్న), బూరగడ్డ వేదవ్యాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే వారికే అధిష్ఠానం అవకాశం ఇస్తుందనే చర్చ నడుస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీల ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలకు సారథులు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. గత రెండేళ్లుగా అందరిని సమన్వయం చేసుకుంటూ పనిచేసిన అధ్యక్షులనే మళ్లీ కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్నది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీల ఎన్నిక పూర్తయింది. జిల్లా కమిటీల ఎన్నికే మిగిలి ఉంది. జిల్లా అనుబంధ కమిటీలు, జిల్లా కమిటీల ఎన్నిక నిర్వహించాలని అధిష్ఠానం కూడా ఆదేశించటంతో.. ప్రస్తుతం ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలలో దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షులు ఎవరన్నది అధిష్ఠానం ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించి ప్రజా ప్రతినిధుల అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉంది. జిల్లా పార్టీని నడిపించే రథసారథులు కావడంతో ప్రజా ప్రతినిధుల అభిప్రాయం ఎలా ఉన్నా.. అధిష్ఠానం మాత్రం పార్టీ బలోపేతం ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో రెండు జిల్లాల్లో పార్టీ అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ తమ దృష్టిలో ఉన్న వారి పేర్లను పేర్కొంటూ అభిప్రాయ సేకరణ జరిపే అవకాశం ఉంది. గతంలో చాలా సందర్భాలలో ఈ విధానాన్ని అధిష్ఠానం పాటించింది.

సౌమ్యంగా పార్టీని నడిపించిన నెట్టెం, కొనకళ్ల

ప్రస్తుతం ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడిగా నెట్టెం రఘురాం, కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా కొణకళ్ల నారాయణరావు ఉన్నారు. వీరిద్దరికి సౌమ్యులుగా ముద్ర ఉంది. ఎవరినీ నొప్పించకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. వీరితో ఎవరికీ ఇబ్బందులు లేవు. రెండేళ్లుగా నాయకత్వంపై అసంతృప్తులు కానీ, వర్గ విభేదాలు కానీ రాకుండా చూడటంలో కీలక పాత్ర పోషించారు. అధిష్ఠానానికి విధేయులుగా ఉంటూ పార్టీని సమన్వయంతో ముందుకు నడిపించారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా పెత్తనం చలాయించలేదన్న అభిప్రాయం పార్టీ నాయకులలో ఉంది. జిల్లా పార్టీ నాయకులుగా ఉండేవారు కొన్ని సందర్భాలలో ప్రజా ప్రతినిధులను కూడా లీడ్‌ చేసే విధంగా ఉండాలి. వారు చెప్పినట్టు తలాడించేలా ఉండకూడదన్నది కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. రెండు జిల్లాల పార్టీల అధ్యక్షులు ప్రజా ప్రతినిధులకు తలవంచిన సందర్భాలు ఎక్కడా లేనప్పటికీ ప్రజా ప్రతినిధుల విషయంలో గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు అధ్యక్షులుగా పనిచేసిన వారి తరహాలో వ్యవహరించలేదన్న కార్యకర్తల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకోదగిన విషయమే.

వరించిన నామినేటెడ్‌ పదవులు

పార్టీ అధ్యక్షులిద్దరికీ ఇటీవలే వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని కీలక నామినేటెడ్‌ పదవులను అధిష్ఠానం అప్పగించింది. నెట్టెం రఘురాంకు కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ పదవి, కొణకళ్ల నారాయణరావుకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి కట్టబెట్టింది. మళ్లీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా సేవలు అందించటానికి ఇద్దరూ సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జిల్లా స్థాయి నాయకులు మళ్లీ అధ్యక్షులుగా మీరే కొనసాగాలంటూ ఇద్దరు నేతలను కోరినట్టు సమాచారం. పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా లేఖల రూపంలో తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఈ క్రమంలో జోడు పదవులను నిర్వహించటానికి వారు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. మరి అధిష్ఠానం ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యమైన అంశం. ప్రజా ప్రతినిధులుగా ఉండే వారు పార్టీ నిర్మాణానికి పెద్దగా కృషి చేయలేని పరిస్థితి ఉంటుంది. పార్టీని సంస్థాగతంగా నిర్మించాలంటే.. పూర్తి స్థాయిలో పనిచేయగలిగేవారినే తీసుకోవాలన్నది అధిష్ఠానం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. విపక్షాల వ్యూహాలకు తగినట్టుగా రాజకీయ తంత్రాలతో పార్టీని ముందుకు తీసుకువెళ్లగలిగే వారు అవసరమన్నది అధిష్ఠానం ఆలోచనగా తెలుస్తోంది.

రేసులో గన్నే, బూరగడ్డ

రెండు జిల్లాల్లో సీనియర్‌ నాయకులు రథసారథుల పదవులను ఆశిస్తున్నారు. వీరిలో ప్రధానంగా ఎన్టీఆర్‌ జిల్లాలో గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌ (అన్న), కృష్ణాజిల్లాలో బూరగడ్డ వేదవ్యాస్‌ ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉన్నపుడు విజయవాడ అర్బన్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానానికి గన్నే తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. అప్పట్లో బుద్దా వెంకన్న, గన్నే మధ్యన తీవ్ర స్థాయిలో పోటీ నడిచింది. దీంతో అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించింది. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కూడా ఇద్దరికీ సమానంగా అభిప్రాయం రావటంతో అధిష్ఠానానికి ఎంపిక సంక్షిష్టంగా మారింది. అప్పట్లో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో గన్నేకు అవకాశం ఇవ్వలేదు. బుద్దా వెంకన్నను అర్బన్‌ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించటడం జరిగింది. గన్నేకు రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇచ్చి అసంతృప్తిని చల్లార్చారు. గన్నే గత ఎన్నికలలో మైలవరం సీటును ఆశించి అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహించారు. వసంత కృష్ణప్రసాద్‌కు సీటు ఇవ్వటంతో ఆయన గెలుపునకు కృషి చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో పూర్వ ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, అర్బన్‌ మాజీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నలు పార్టీ నాయకత్వ బాధ్యతల విషయంలో ఆసక్తిగా లేరని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్‌ జిల్లా నుంచి గన్నే మాత్రమే జిల్లా పార్టీ అధ్యక్షుని రేసులో ఉన్నారు. కృష్ణాజిల్లా నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్‌, పెడన (పాత మల్లేశ్వరం) మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వే దవ్యాస్‌ కూడా జిల్లా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 01:30 AM