AP Liquor Scam: వైట్ మనీగా 78 కోట్లు
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:12 AM
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో తీగ లాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మద్యం ముఠా పెద్దల కోసం మార్చిన చాముండ బులియన్
100 కోట్ల లిక్కర్ స్కాం సొమ్ము.. 4 కోట్ల కమీషన్ ఇస్తామని డీల్
హవాలా, గోల్డ్ స్మగ్లింగ్‌లో చేతన్, రోణక్ సోదరులు సిద్ధహస్తులు
చోఖ్రాతో షెల్ కంపెనీలు.. అసలు కథ నడిపింది అన్నదమ్ములే
రోణక్ రిమాండ్ రిపోర్టులో సిట్..
చేతన్ కోసం ముంబైకి టీమ్
5 వరకు రోణక్‌కు ఏసీబీ కోర్టు రిమాండ్
రోణక్ కుమార్‌కు రిమాండ్
మద్యం కుంభకోణంలో ముంబై బులియన్ వ్యాపారి రోణక్ కుమార్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈనెల 5వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రోణక్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు.
అమరావతి/విజయవాడ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో తీగ లాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హవాలా వ్యాపారులు, బంగారం స్మగ్లర్లతో మద్యం ముఠా నడిపిన వ్యవహారం బయటపడుతోంది. ‘వంద కోట్ల రూపాయలు మీకు పంపుతాం.. నాలుగు శాతం కమీషన్ ఇస్తాం.. నల్ల డబ్బును వైట్ మనీగా మార్చి ఇవ్వండి’ అంటూ ముంబైలో పేరు మోసిన హవాలా, బులియన్ వ్యాపారి పూనం భాయ్ కుమారులు చేతన్ కుమార్ (ఏ-50), రోణక్ కుమార్(ఏ-51)తో జరిపిన రహస్య లావాదేవీల గుట్టు రట్టయింది. మద్యం ముడుపుల సొమ్ము వైట్ మనీగా మార్చేందుకు అనిల్ చోఖ్రా (ఏ49) సృష్టించిన షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి ఆదాన్, లీలా, ఎస్‌పీవై డిస్టిల్లరీస్ నుంచి ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ అయిన రూ. 78 కోట్ల లావాదేవీల్లో రహస్యాన్ని ఛేదించారు. ఆ వివరాలను రోణక్ రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు వెల్లడించారు. షెల్ కంపెనీల సృష్టికర్త అనిల్ చోఖ్రాను ముంబైలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చి కోర్టు అనుమతితో ఇటీవల ప్రశ్నించారు. ‘‘ముంబైలో చాముండ బులియన్ వ్యాపారి చేతన్ కుమార్ ఏపీ పెద్దలకు చెందిన వంద కోట్ల రూపాయలు వైట్ మనీగా మార్చేందుకు షెల్ కంపెనీలు సృష్టించి బ్యాంకు ఖాతాలు ఇవ్వమని కోరడంతో అవి సృష్టించి ఇచ్చాను. అందులో నాలుగు కంపెనీల బ్యాంకు ఖాతాలోకిఆదాన్, లీలా, ఎస్‌పీవై నుంచి డబ్బులు ఆర్టీజీఎస్ ద్వారా వచ్చాయి. వాటి ద్వారా వస్త్రాలు, పాలిస్టర్ ఫిల్మ్ కొనుగోళ్లకు నకిలీ ఇన్వాయి్‌సలు సృష్టించి వైట్‌గా మార్చేశా. వాటిని చేతన్, రోణక్‌కు ఎప్పటికప్పుడు ఇచ్చే వాడిని. ఆ బిల్లులు ఆదాన్, లీలా, ఎస్‌పీవైకి పలు మార్గాల్లో చేర్చేవారు. నేను బంగారం, నగదు చెల్లించాక వంద రూపాయలకు పావలా కమీషన్ (రూ. 19.5 లక్షలు) ఇచ్చారు. చాముండ బులియన్ సోదరులు 4 శాతం (రూ. 3.12 కోట్లు) డిస్టిల్లరీస్ నుంచి తీసుకున్నారు’’ అని చోఖ్రా వివరించాడు. అయితే చోఖ్రా చెప్పింది నిర్దారించుకోవడానికి చేతన్ కుమార్‌కు సిట్ నోటీసు ఇచ్చింది. కానీ, విచారణకు రాకుండా చేతన్ కుమారుడు తన సోదరుడు రోణక్ కుమార్‌ను పంపించాడు. నవంబరు 29న సిట్ ముందు హాజరై తన అన్నకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తాను విచారణకు వచ్చానని చెప్పాడు. అనిల్ చోఖ్రా కంపెనీలతో బ్యాంకు లావాదేవీల వివరాలు తెప్పించాలని సిట్ సూచించడంతో సరేనంటూ వెళ్లిపోయాడు. డిసెంబరు 2న తిరిగొచ్చి తన అన్నకు ఆరోగ్యం బాగాలేదు.. ఆడిటర్ అందుబాటులో లేడని చెప్పాడు. అయితే అనిల్ చోఖ్రాతో కలిపి విచారించేదుకు సిట్ అధికారులు సిద్ధమవగా అందుకు రోణక్ ససేమిరా అన్నాడు. చోఖ్రాతో వ్యవహారాలన్నీ చేతన్‌కే తెలుసునని, తనకు ఏవీ తెలీవని చెప్పాడు. సరే మీ అన్న చేతన్‌ను పిలపించు అని సిట్ అనడంతో అరెస్టు తప్పదన్న అనుమానం వచ్చి ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీనిలో అతన్ని అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో బుధవారం కోర్టుకు వివరించారు. ఇందులో కీలక వ్యక్తి అయిన చేతన్ సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకోవడంతో సిట్ అధికారులు అతని కోసం ముంబైకి వెళ్లారు.
ఆంధ్రా పెద్దలు.. అన్నకే తెలుసు..
మద్యం ముడుపుల్ని హవాలా ద్వారా వైట్ మనీగా మార్చేందుకు చాముండ బులియన్ సోదరులైన చేతన్ కుమార్, రోణక్ కుమార్‌తో మాట్లాడిన ఏపీకి చెందిన పెద్దలు ఎవరనేది తేలాలంటే చేతన్ పట్టుబడాల్సిందేనని సిట్ భావిస్తోంది. ఇద్దరు అన్నదమ్ములతో వ్యవహారం నడిపిన వ్యక్తులు ఏపీ పెద్దలని, వారెవరో తనకు తెలీదని అనిల్ చోఖ్రా చెప్పాడు. అయితే చేతన్, రోణక్‌తో సంప్రదింపులు జరిపిన ఆ పెద్దలు ఎవరని సిట్ అధికారులు రోణక్‌ను అడగ్గా ‘ఆంధ్రాలో పెద్దవాళ్లని మాత్రమే అన్న చెప్పాడు. వాళ్లెవరో అన్నకే తెలుసు’ అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఆ డీల్ నడిపింది రాజ్ కసిరెడ్డి గ్యాంగేనని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. చోఖ్రా వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎవరెవరు చేతన్ సోదరులతో టచ్‌లో ఉన్నారనే విషయాలు సిట్ సేకరిస్తోంది.
చాముండ ఖాతాల్లో వందల కోట్లు..
ఏపీ లిక్కర్ స్కామ్ సొమ్ము హవాలా చేసిన చాముండ బులియన్ పరిధిలోని వ్యాపార ఖాతాల్లోకి వందల కోట్ల రూపాయలు వచ్చి పడినట్లు సిట్ గుర్తించింది. కీరజ్ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ. 375 కోట్లు, న్యూమౌంట్ గోల్డ్‌లో రూ. 143 కోట్లు, మలిస్కా గోల్డ్‌లో రూ. 135 కోట్లు, ట్రిప్పర్‌లో రూ. 124 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు కనుగొంది. అయితే ఈ సొమ్ము అంతా ఏపీ లిక్కర్ ముఠా నుంచి వచ్చిందేనా? లేక ఇతరత్రా లావాదేవీలా అనేది చేతన్ పట్టుబడితే తెలిసే అవకాశం ఉంది.
ముగిసిన అనిల్ చోఖ్రా కస్టడీ
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులు పంపిన డబ్బు కోసం ముంబైలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన అనిల్ చోఖ్రా పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. దీంతో చోఖ్రాకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కస్టడీలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయాధికారి పి.భాస్కరరావు ప్రశ్నించగా, ఏమీ ఇబ్బంది పెట్టలేదని చోఖ్రా సమాధానమిచ్చాడు. అయితే, విచారణలో తాను చెప్పిన పేరును నమోదు చేసుకోలేదని కోర్టుకు తెలిపాడు. తాను ముంబైలో మయూర్ దీపక్‌చౌడ వద్ద పనిచేశానని, ఆయన చెప్పిన పనులే చేశానని చెప్పాడు. ఇదే విషయాన్ని విచారణలో సిట్ అధికారులకు చెప్పినా.. వారు ఆ పేరును నమోదు చేయలేదన్నాడు. దీంతో చోఖ్రా చెప్పిన పేరును రికార్డు చేయాలని న్యాయాధికారి ఆదేశాలిచ్చారు. అనంతరం చోఖ్రాను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.