CID: మాధవరెడ్డి ఎక్కడ
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:10 AM
మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో నిందితుడు మాధవరెడ్డి ఎక్కడ? దీనిపై సీఐడీ ఆరా తీస్తోంది.
మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో సీఐడీ ఆరా
అధికారులు అతని ఇంటికెళ్లే సరికే అజ్ఞాతంలోకి..
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో నిందితుడు మాధవరెడ్డి ఎక్కడ? దీనిపై సీఐడీ ఆరా తీస్తోంది. అదుపులోకి తీసుకునేందుకు శనివారం ఇంటికెళ్లిన అధికారులు అప్పటికే అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ డాక్యుమెంట్ల దహనం కేసులో అప్పటి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజను ఇప్పటికే అరెస్టు చేయగా, ఆయన బెయిల్‌పై ఉన్నారు. రెండోసారి అరెస్టయిన మాజీ ఆర్డీవో మురళి ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. ఇదే కేసులో నిందితుడైన మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో.. అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ ఉత్తర్వులు వారం కిందట రద్దు కావడంతో, శనివారం సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ నేతృత్వంలో అధికారులు మదనపల్లెలోని అతని ఇంటికెళ్లారు. అప్పటికే మాధవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అధికారులు ఇంట్లో సోదాలు నిర్వహించి రాగానిపల్లి భూముల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సెల్‌ఫోను ఆధారంగా నిఘా ఉంచారు. ఆస్తుల వివరాలూ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పీఏగా పనిచేసిన తుకారాం భారత్‌కు వచ్చినట్లు సమాచారం అందడంతో అతడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.