Share News

వైసీపీ నాయకులు రోడ్డెక్కితే బయటపడేది వారి అరాచకాలే

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:58 AM

వైసీపీ నాయకులు రోడ్డెక్కితే బయటపడేది వారి అరాచకాలేనని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడటం హాస్యాస్పదమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

వైసీపీ నాయకులు రోడ్డెక్కితే బయటపడేది వారి అరాచకాలే

-స్టేటస్‌కో ఇచ్చిన వైసీపీ కార్యాలయంలో ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తారు

-విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్న మంత్రి లోకేశ్‌

-జగన్‌రెడ్డి ఫీజుల బకాయిలు రూ.760 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించింది

-పేర్ని నాని ఇష్టారాజ్యంగా మాట్లాడటం హాస్యాస్పదం

-మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు రోడ్డెక్కితే బయటపడేది వారి అరాచకాలేనని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడటం హాస్యాస్పదమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేసిన పేర్ని నాని ఒక్కసారి జీవో 340 చదువుకోవాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినందున కోర్టులో కేసులు నడుస్తున్నాయని, స్టేటస్‌కో ఉన్న సమయంలో వైసీపీ కార్యాలయంలో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం పేరుతో రూ.50 కోట్ల విలువైన భూమిని కొట్టేయడం దుర్మార్గమన్నారు. 340 జీవో ప్రకారం ఏడాది కాలంలో నిర్మాణం చేపట్టాలని, అయితే వైసీపీ కార్యాలయం ఏడాదిలో నిర్మాణం చేపట్టలేదన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు దొంగ జీవోలు, దొంగ ఆదేశాలతో రాషా్ట్రన్ని లూటీ చేశారన్నారు. రూ.40 కోట్లతో బందరుకు వన్నె తెచ్చిన పట్టాభి సీతారామయ్య మెమోరియల్‌ భవనం నిర్మించేందుకు పేర్ని నాని అడ్డుపడ్డారని, మునిసిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేయనివ్వలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రూ.750 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. మెరుగైన విద్యను అందించేలా విశ్వవిద్యాలయాల్లో గణనీయమైన మార్పులు చేపడుతున్నారన్నారు. ఫీజులు నేరుగా కళాశాలలకు ఇవ్వడం వల్ల సర్టిఫికెట్లను కళాశాలలు ఆపలేవన్నారు. రోడ్డెక్కి మాట్లాడితే వైసీపీ నాయకుల పరువేపోతుందన్నారు. ఏ కాలేజీకి కూడా బకాయిలు లేకుండా చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు అన్యాయం చేయబోమన్నారు.

అసెంబ్లీకి వస్తే జగన్‌రెడ్డి బండారం బయటపడుతుందనే..

అసెంబ్లీకి వచ్చి జగన్‌రెడ్డి మాట్లాడితే బండారం మొత్తం బయట పడుతుందనే భయంతో అసెంబ్లీకి రాకుండా వీధుల్లో డ్రామాలాడుతున్నారన్నారు. అధికారులను పేర్ని నాని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. డ్రెయిన్లు, ఫుట్‌పాతలపై ఉన్న ఆక్రమణలు తొలగించడం వల్ల నగర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. బడ్డీలను నిలువరించే విద్యావంతులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వైసీపీ నాయకులు బడ్డీలు పెట్టి అద్దెలకు ఇచ్చుకున్నారన్నారు. మచిలీపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మూడు నెలలు అడ్రస్‌ లేకుండా బియ్యం దొంగ పేర్ని నాని పారిపోయారని, బెయిల్‌ రావడంతో మళ్లీ రోడ్డు మీద కనబడుతున్నారన్నారు. పేర్ని నానిపై సిట్‌ను నియమించామన్నారు. బెయిల్‌ వచ్చినంత మాత్రాన పేర్ని నాని చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:58 AM