Share News

వేలం ఎప్పుడో..?

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:44 PM

పందికోన రిజర్వాయర్‌లో చేపల పెంపకం కోసం వేలం ఎప్పుడో నిర్వహిస్తారో తెలియని పరిస్థితి.

   వేలం ఎప్పుడో..?
రిజర్వాయర్‌లో చేపటవేటకు సిద్దంగా ఉన్నబోట్లు

జూన 30కే ముగిసిన చేపల పెంపకం గడువు

నేటికీ కొనసాగుతున్న చేపల వేట

కోట్లలో ఆదాయం.. లక్షల్లో వేలం..

నిర్లక్ష్యంలో మృత్స్య శాఖాధికారులు

పత్తికొండ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పందికోన రిజర్వాయర్‌లో చేపల పెంపకం కోసం వేలం ఎప్పుడో నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. జూన 30వ తేదీకే గడువు ముగి సింది. మూడు నెలలు కావస్తున్నా మత్స్యశాఖ అధికారులు రిజర్వాయర్‌లో ఈఏడాది చేపల పెంపకం వేలంపాటలు నిర్వహించలేదు. గడవు ముగిసినా కొందరు మత్స్యకారులు చేపల వేటను కొనసాగిస్తున్నారు. వేరేప్రాంతాలకు యఽథేచ్ఛగా రవాణా చేస్తూ ప్రభుత్వ నిబంధనలను నీరుగారుస్తున్నారు. చర్యలు చేపట్టాల్సిన మత్స్యశాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడటంలేదన్న విమర్శలున్నాయి.

1,02 టీఎంసీల నీటి సామర్థ్యంతో..

సుమారు 1200ఎకరాల విస్తీర్ణంలో 1.02టీఎంసీల నీటి సామర్ద్యంతో పందికోన రిజర్వాయర్‌ను నిర్మించారు. పత్తికొండ, దేవనకొండ, కోడుమూరు మండలాల పరిధిలో సుమారు 32వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మాణం ప్రారంబించారు. ఆతర్వాత 68వేల ఎకరాలకు సాగునీరందించేలా కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని పెంచారు.

పెండింగ్‌లో బండ్‌, రివిట్‌మెంట్‌ పనులు

రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా బండ్‌, రివిట్‌మెంట్‌ పనులు పెండింగ్‌ లో ఉన్నాయి. దీంతో 1.02టీఎంసీల నీటిసామర్ధ్యం ఉన్న ఈరిజర్వాయర్‌లో 0.5 టీఎంసీ నీటిని నిలువ చేసేందుకే అవకాశం మిగిలింది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కర్నూలుకు చెందిన ఓవ్యక్తి ఈరిజర్వాయర్‌లో చేపల పెంపకం అనధికారికంగా నిర్వహిం చాడు. ఆతర్వాత రిజర్వాయర్‌లో చేపలపెంపకం బాధ్యతలను మత్స్యశాఖ తీసుకుంది. సమీపగ్రామాల పంచాయతీలతో కలసి రిజర్వాయర్‌లో చేపల పెంపకంకు వేలం పాటలు నిర్వహించి అనుమతులివ్వడం ప్రారంభించింది.

మత్స్యకారులకు కోట్లలో ..

చేపలపెంపకం ద్వారా మత్స్యకారులకు కోట్లలో ఆదాయం సమకూరుతోంది. మత్స్యశాఖ అధికారులు తూతూమంత్రంగా వేలంపాటలు నిర్వహిస్తూ తక్కువ ధరలకు చేపల పెంపకం అనుమతులిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 2023లో రూ.3,13,211, అలాగే 2024లో రూ.3,49,000కు పలికింది. లక్షల్లో ఆదాయం మాత్రమే ఉన్న జొన్నగిరి చెరువులో చేపలపెంపకం రూ.11లక్షలు దాటగా రూ కోట్లలో ఆదాయం ఉన్న పందికోన రిజర్వాయర్‌లో చేపలపెంపకం వేలంపాటల ఆదాయం ఎందుకు పెరగడంలేదో అర్థకాని ప్రశ్నగానే మిగిలింది. ఈఏడాదైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రభుత్వ ఆదాయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

హెచ్చరికలు జారీచేశాం

పందికోన రిజర్వాయర్‌లో చేపలపెంపకానికి వేలంపాటల కోసం ఇప్పటికే ఉన్నతాధికారుల అనుమతుల కోసం నివేదికలు పంపాం. వారి ఆదేశాలు అందిన వెంటనే వేలం పాటలు నిర్వహిస్తాం. గడవు ముగిశాక చేపలవేట చేయరాదని ఇప్పటికే అక్కడ నివసిస్తున్న జాలర్లకు హెచ్చరికలు జారీచేశాం

ఫనాగరాజు, ఇనచార్జి డీఈ, మత్స్యశాఖ

Updated Date - Sep 28 , 2025 | 11:44 PM