Wheat Flour: రూ.20కే కిలోగోధుమపిండి
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:45 AM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి నెల రేషన్‌లో గోధుమ పిండిని రాయితీపై కార్డుదారులకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది...
జనవరి 1 నుంచే రేషన్‌షాపుల్లో పంపిణీ
తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్యపట్టణాల్లోనే అమలు
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి నెల రేషన్‌లో గోధుమ పిండిని రాయితీపై కార్డుదారులకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో వివిధ బ్రాండ్లతో విక్రయిస్తున్న గోధుమ పిండి ధర నాణ్యత, రకాలను బట్టి కిలో రూ.40 నుంచి రూ.80 వరకు ఉంది. కొన్ని స్థానిక రకాల గోధుమ పిండి కిలో రూ.30కు కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయనున్న నాణ్యమైన చక్కీ గోధుమ పిండి ప్యాకెట్ ధర రూ.20గా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత 26 జిల్లా కేంద్రాలతోపాటు ముఖ్యపట్టణాలు, నగరాల్లో పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్క రేషన్‌కార్డుపై కిలో చొప్పున పంపిణీకి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా కేంద్రం తాత్కాలిక ప్రాతిపదికన నెలకు 1,838 టన్నులు గోధుమలను రాష్ట్రానికి కేటాయిస్తోంది. దీనిని కార్డుదారులకు సక్రమంగా అందించడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. పిండి నాణ్యంగా లేదని, వాసన వస్తోందనే కారణంతో తీసుకోవడానికి కార్డుదారులు ముందుకు రాకపోవడంతో పైలెట్ దశలోనే దాన్ని నిలిపివేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండగకు పేదలు సైతం పిండి వంటలు చేసుకునేందుకు వీలుగా గోధుమ పిండిని రాయితీపై అందించాలని నిర్ణయించింది. కేంద్ర కేటాయించిన గోధుమలను భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ) ద్వారా తీసుకున్న రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ.. వాటిని మర పట్టించి నాణ్యమైన చెక్కి గోధుమ పిండిగా మార్చి ఒక్కో రేషన్‌కార్డుకు కేజీ చొప్పున ప్యాకెట్లలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి ప్యాకెట్లను రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్యపట్టణాలు, నగరాల్లోని రేషన్ షాపులకు తరలించి.. జనవరి 1 నుంచే కార్డుదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకోడానికి రేషన్‌కార్డుదారులు ఆసక్తి చూపితే.. డిమాండ్‌ను బట్టి రాష్ట్రంలోని కార్డుదారులందరికీ ప్రతినెలా సబ్సిడీపై గోధుమ పిండి సరఫరా చేసేందుకు పౌరసరఫరాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.