Minister Nadendla Manohar: వచ్చే నెల నుంచి రాష్ట్రానికి గోధుమలు, రాగులు
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:43 AM
వచ్చే నెల నుంచి రాష్ట్రానికి గోధుమలు, అదనపు రాగులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
క్యూఆర్ కోడ్ ఆధారిత బియ్యం సరఫరా: మంత్రి నాదెండ్ల
న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల నుంచి రాష్ట్రానికి గోధుమలు, అదనపు రాగులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, ప్రజాపంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషితో మనోహర్ భేటీ అయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేషన్ బియ్యం నిల్వ కోసం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ నుంచి అదనపు గోదాంలు ఏర్పాటుకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారని తెలిపారు. గతేడాది రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి.. 41 వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం బియ్యం సరఫరాను పర్యవేక్షించేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. తాము విజయవంతంగా అమలు చేస్తున్న విధానం గురించి కేంద్రానికి నివేదించగా.. వచ్చే నెల నుంచి పీడీఎస్ బియ్యం సరఫరాకు క్యూఆర్ ట్యాగ్ వినియోగించేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఏపీకి కేంద్రం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. దీని ద్వారా బియ్యం అక్రమ రవాణాను అరికట్టవచ్చని తెలిపారు.