అసలేమైంది ఈ క్యాంపస్‌కు..
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:54 PM
ఆర్‌యూ క్యాంపస్‌లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. అధ్యాపకులు, విద్యార్థులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ఓవైపు సెల్‌ఫోన్లతో అధ్యాపకులు కాలక్షేపం
మరోవైపు చెట్ల కింద విద్యార్థులు
ఏడీ బిల్డింగ్‌లో కొందరు ప్రొఫెసర్లు
సమస్యల వలయంలో హాస్టల్ భవనాలు
పాలన అస్తవ్యస్తం
పట్టించుకోని ఉన్నతాధికారులు
ఆర్‌యూ క్యాంపస్‌లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. అధ్యాపకులు, విద్యార్థులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్లు పట్టించుకోవడం లేదు. లెక్చరర్లు సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తుండగా విద్యార్థులు చెట్లకింద టైంపాస్ చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఆధిపత్య పోరుతో కేవలం పరిపాలన భవనానికే పరిమితం అయ్యారు. ఆర్‌యూ పరిధిలోని వసతిగృహాల్లో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. మెస్‌లో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సెక్యూరిటీ తీరు అధ్వానంగా తయారైంది.
కర్నూలు అర్బన్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆర్‌యూ(రాయలసీమ యూనివర్సిటీ) క్యాంపస్ ఎవరికీ వారే యమునాతీరు అన్న చందంగా తయారైంది. అధ్యాపకులు చాంబర్లలో సెల్‌ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రొఫెసర్లు అదనపు బాధ్యతలతో పరిపాలనా భవనానికే అంకితమౌతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులకు తరగతి గదుల్లో బోధించే వారు లేక చెట్ల కింద కొందరు, క్యాంపస్‌లో ఆకతాయి మాటలతో టైం పాస్ చేసేందుకు మరి కొందరు విద్యార్థులు పరిమితమవుతున్నారని కొందరు ఉద్యోగులు అంటున్నారు.
అధికారులు ఆధిపత్య పోరుతో..
పర్యవేక్షించాల్సిన అధికారులు ఆధిపత్య పోరుతో కేవలం పరిపాలన భవనానికే పరిమితం అయ్యారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం వనరులు, నిధులు కేటా యిస్తున్నప్పటికి సద్వినియోగం కాకపోవడంతో ఉన్నత విద్యా చదువులు అందక పేద విద్యార్థులు ఎందరో లబోదిబోమంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలెన్నో..!
ఆర్‌యూ పరిధిలోని వసతిగృహాల్లో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. మినరల్ వాటర్ లేకపోవడంతో రోగాల బారిన పడుతున్నారు. వేమన మెస్ హాలు, కృష్ణ్ణ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకున్నాయి. తుంగభద్ర భవనంలో మరుగుదొడ్ల సమస్యలు నెలకొంది. న్యూబాయ్స్ హాస్టల్‌లో మొదటి, రెండవ అంతస్తుల్లోకి మోటర్ పంపింగ్ జరగక పోవడంతో నీరులేక ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు వారానికి ఒక సారి శుభ్రం చేసే ప్రక్రియను చేపట్టడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. కింది ఫ్లోర్‌లో పైపుల లీకేజీ నీటి వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్సు విభాగంతో పాటు ఇంజనీరింగ్ కళాశాలకు విద్యార్థులు 470 మంది దాకా ఉంటున్నారు. వీటిలో కొన్ని గదుల్లో ఒక్కో గదికి 6మంది విద్యార్థులను కేటాయించారు. మంచాలు తుప్పుపట్టాయి. మరుగు దొడ్లకు సరైన సౌకర్యాలు లేవు. మెస్‌లో కూడా శుభ్రం లేకపోవడంతో ఒక్కోసారి భోజనంలో పురుగులు, రాళ్లు వచ్చాయంటూ కొన్నిసార్లు విద్యార్థులు ఘర్షణలకు దిగుతున్నారు. విషయం బయటకు పొక్కకుండా ఓ ప్రొఫెసర్ కనుసన్నల్లో నిర్వహణ సాగుతోంది.
పుడ్డులో గుడ్డు లేకపాయె..!
మెనూ ప్రకారం మంగళవారం రాత్రి కోడి గుడ్డుకు అందించలేదు. దీంతో కొందరు విద్యార్థులు బుధవారం పరిపాలన భవనం ఎదుట ఆందోళనకు దిగారు. మెస్‌లో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రిజిష్ట్రార్ బోయ విజయకుమార్ నాయుడు గుడ్డుతో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని విద్యార్థులను కోరడంతో కొందరు విద్యార్థులు సమస్యలు రాకముందే చర్యలు చెపట్టాలని కోరారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పురనావృత కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హమీ ఇవ్వడంతో విద్యార్థులు వెనుదిరిగారు.
బయటి వ్యక్తులు..
ఫ క్రీడా మైదానంలోకి కార్ డ్రైవింగ్ స్కూల్స్‌కు చెందిన కొందరు బయటి వ్యక్తులు కారు డ్రైవింగ్ కోసం వస్తున్నరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురౌతూ ప్రైవేటు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడున్న జిమ్ చుట్టూ చెట్లు మొలిచి పరికరాలు తుప్పు పట్టి విద్యార్థులు ఉపయోగం లేకుండా పోయింది.
సెక్యూరిటీ అస్తవ్యస్తం
సెక్యూరిటీ తీరు అధ్వానంగా తయారైంది. తెలంగాణకి చెందిన ఓ ఏజెన్సీ నిర్వాహకుడికి ఇవ్వడంతో పర్యవేక్షణ లేక క్యాంపస్‌లో బయటి వ్యక్తుల సంచారానికి అడ్డు కట్టవేయలేక పోతున్నారు.
అధ్యాపకుల కొరత వాస్తమే
కొందరు ప్రొఫెసర్లకు అదనపు బాద్యతలు ఉండటంతో పరిపాలన భవనానికి పరి మితం అవుతున్నా మాట వాస్తవమే.. ఫలితంగా అధ్యాపకులు తరగతి గదుల్లో బోఽధిం చేందుకు ఉండటం లేదన్న మాటలో కూడా వాస్తవం లేక పోలేదు. అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతునట్లు నాదృష్టికి వచ్చింది.
ఫ సీవీ కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్, ఆర్‌యూ