ఇదెక్కడి పాపం బిడ్డో..
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:08 AM
శిశువు అందంగా ఉంటే ఓ రేటు.. పుష్టిగా ఉంటే మరో రేటు.. చామనఛాయతో బలహీనంగా ఉంటే కాస్త డిస్కౌంట్‌తో ఇంకో రేటు.. ఇలా సంతలో మాదిరిగా చంటిపిల్లలను బేరాలు పెట్టి మరీ విక్రయించారు. బిడ్డలను తల్లిదండ్రుల నుంచి దూరం చేసింది మొదలు.. కొనుగోలు చేసిన వారికి అందజేసే వరకు భారీగా కమీషన్లు దండుకున్నారు. అభంశుభం తెలియని పిల్లలను తల్లి పొత్తిళ్ల నుంచి దూరం చేసింది కాక.. లాభాలను వెనకేసుకుని పాపాలు మూటగట్టుకున్నారు.
- మార్కెట్‌లో వస్తువుల మాదిరిగా పసిపిల్లల విక్రయం
- పుష్టిగా ఉంటే ఒక రేటు.. బలహీనంగా ఉంటే ఇంకో రేటు
- మంచి రంగు ఉంటే ఒకలా.. చామనఛాయ అయితే మరోలా..
- తల్లి నుంచి దూరం చేసింది మొదలు కమీషన్ల వ్యాపారం
- కొన్నవారికి చేర్చే వరకు దశలవారీగా చెల్లింపులు
- బిడ్డను ఇచ్చిన వారికి 40 శాతం..
- అమ్మినందుకు సరోజినికి 60 శాతం కమీషన్లు
- శిశువుల విక్రయం కేసులో కన్నీరు పెట్టించే కోణాలు
శిశువు అందంగా ఉంటే ఓ రేటు.. పుష్టిగా ఉంటే మరో రేటు.. చామనఛాయతో బలహీనంగా ఉంటే కాస్త డిస్కౌంట్‌తో ఇంకో రేటు.. ఇలా సంతలో మాదిరిగా చంటిపిల్లలను బేరాలు పెట్టి మరీ విక్రయించారు. బిడ్డలను తల్లిదండ్రుల నుంచి దూరం చేసింది మొదలు.. కొనుగోలు చేసిన వారికి అందజేసే వరకు భారీగా కమీషన్లు దండుకున్నారు. అభంశుభం తెలియని పిల్లలను తల్లి పొత్తిళ్ల నుంచి దూరం చేసింది కాక.. లాభాలను వెనకేసుకుని పాపాలు మూటగట్టుకున్నారు.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : భవానీపురానికి చెందిన బలగం సరోజిని ముఠా పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఉత్తరాది నుంచి తీసుకొచ్చిన శిశువులను మార్కెట్‌లో వస్తువుల మాదిరిగా బేరాలు పెట్టి విక్రయించడమే కాకుండా, కమీషన్ల లెక్కన వ్యాపారాలు చేశారు. ఉత్తరాది నుంచి శిశువులను ఇచ్చిన వారికి 40 శాతం, సరోజిని 60 శాతం కమీషన్ తీసుకుని ఈ వ్యవహారాలు నడిపారు. ఒక్కో శిశువును గరిష్టంగా రూ.5 లక్షల వరకు విక్రయించినట్టు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. సరోజిని నాలుగైదేళ్లుగా ఈ వ్యాపారం సాగిస్తోంది. శిశువును తల్లిదండ్రుల నుంచి వేరు చేసింది మొదలు.. వారి లాలనపాలన చూసిన వారికి, అమ్మకాల్లో సాయం చేసిన వారికి దశలవారీగా చెల్లింపులు చేసింది. శిశువును ఎవరైతే కొన్నారో వారికి అప్పగించిన మహిళకు రూ.10 వేలు కమీషన్ ఇచ్చింది. ఆమెను తీసుకుని వెళ్లిన ఆటోడ్రైవర్‌కు రూ.5 వేలు, బేరం కుదిరే వరకు ఇంట్లో పెట్టుకుని ఆలనాపాలన చూసిన వారికి రూ.10 వేలు ఇవ్వడంతో పాటు ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బులో 60 శాతాన్ని ఆమె తీసుకుని, మిగిలిన 40 శాతం ఉత్తరాది ముఠా నాయకులకు పంపేది.
యూపీ జైల్లో ‘బలగం’ స్నేహితురాలు
శిశువుల విక్రయాల ముఠాకు నాయకురాలు బలగం సరోజిని అని అంతా భావించారు. కానీ, ఆమెతో పాటు మరో నాయకురాలు ఉంది. రాజరాజేశ్వరిపేటకు చెందిన శారద అనే మహిళ, సరోజిని కలిసి ఈ శిశువుల విక్రయాలు జరిపేవారు. మార్చిలో విజయవాడ పోలీసులు సరోజిని గ్యాంగ్ మొత్తాన్ని అరెస్టు చేసినప్పుడు శారద పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెకు సంకెళ్లు వేయడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. తెలివిగా తప్పించుకుంది. సరోజిని అరెస్టు కాగానే నగరం నుంచి పారిపోయి తలదాచుకుంది. గాలింపు వేడి తగ్గిందని తెలుసుకున్నాక ఇంటికి చేరుకుంది. విజయవాడ పోలీసులకు ఆమె గురించి సమాచారం వచ్చేలోపు ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ పోలీసులు ఇంటి వద్ద వాలిపోయారు. శిశువుల కొనుగోళ్లకు సంబంధించి ఆమెపై అక్కడ పలు కేసులు నమోదయ్యాయి. ఆమెపై మొరదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది పీటీ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. శారదను పీటీ వారెంట్‌పై ఒకసారి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మళ్లీ పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సరోజిని స్నేహితురాలు శారద మొరదాబాద్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. ఆమెపై గుజరాతలోనూ పలు కేసులు నమోదయ్యాయి.
విజయవాడకు వచ్చిన ముంబై ముఠా
బలగం సరోజిని ముఠా ఢిల్లీ, ముంబై నుంచి శిశువులను కొనుగోలు చేసినట్టు ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, భారతి శిశువులను ఈనెల 17న విజయవాడకు తీసుకొచ్చి సరోజినికి అప్పగించారు. వారు గవర్నరుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక తానియా లాడ్జిలో బస చేశారు. వారిద్దరినీ పోలీసులు బలార్షలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ అక్కడి నుంచి శిశువులను తీసుకుని విజయవాడ వచ్చారు. ఈ గ్యాంగ్ ఈ నెలలో మూడుసార్లు ఇక్కడికి వచ్చింది. ఈవిధంగా ముగ్గురు శిశువులను సరోజిని చేతుల్లో పెట్టింది. ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ముంబైలో మకాం వేశారు.