Share News

ఇదేం పద్ధతి?

ABN , Publish Date - Jun 12 , 2025 | 01:15 AM

- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారిలో పలుకుబడి ఉన్న వారు ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సు లేఖలు తీసుకునివెళ్తారు. ఆ లేఖలతో సంబంధిత కౌంటర్‌కి వెళ్లి గుర్తింపు కార్డు ఫొటోస్టాట్‌ కాపీలను అందజేసి దరఖాస్తు పూర్తి చేస్తారు. ఇలా ఒక దరఖాస్తుపై ఆరుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని టీటీడీ ఇస్తుంది. ఈ దర్శనం టికెట్లకు సంబంధించిన మొత్తాన్ని భక్తులు కౌంటర్లలో చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే భక్తుల చేతుల్లోకి టికెట్లు వెళ్తాయి. - ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కొంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులు సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. ఆ లేఖలపై దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి ఎలాంటి టికెట్లు కొనుగోలు చేయించవద్దని రాస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న ప్రొటోకాల్‌ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం పద్ధతి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

 ఇదేం పద్ధతి?

-‘ప్రొటోకాల్‌’ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు

-దుర్గమ్మ దర్శనానికి సిఫార్సు లేఖలు.. టికెట్లు తీయవద్దని నోట్‌లు

-ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారని పలువురి ఆగ్రహం

- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారిలో పలుకుబడి ఉన్న వారు ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సు లేఖలు తీసుకునివెళ్తారు. ఆ లేఖలతో సంబంధిత కౌంటర్‌కి వెళ్లి గుర్తింపు కార్డు ఫొటోస్టాట్‌ కాపీలను అందజేసి దరఖాస్తు పూర్తి చేస్తారు. ఇలా ఒక దరఖాస్తుపై ఆరుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని టీటీడీ ఇస్తుంది. ఈ దర్శనం టికెట్లకు సంబంధించిన మొత్తాన్ని భక్తులు కౌంటర్లలో చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే భక్తుల చేతుల్లోకి టికెట్లు వెళ్తాయి.

- ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కొంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులు సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. ఆ లేఖలపై దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి ఎలాంటి టికెట్లు కొనుగోలు చేయించవద్దని రాస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న ప్రొటోకాల్‌ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం పద్ధతి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత ప్రాచుర్యం కలిగినది విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయం. ఆలయాలు అన్నింటిలోనూ ఒకే విధానం అమలు చేయాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా ఆచరణలో అమలు కావడంలేదు. దుర్గమ్మ ఆలయానికి ఆదాయాన్ని పెంచాలని అధికారులు ఆరాటపడుతుంటే కొంత మంది ఫ్రొటోకాల్‌ జాబితాలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం గండికొడుతున్నారు. సిఫార్సు లేఖలు ఇవ్వడంలో తప్పు లేదని, భక్తుల నుంచి టికెట్లు కొనుగోలు చేయించవద్దని రాయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న దేవస్థానం వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ విధంగా టీటీడీకి ఇచ్చే లేఖలపై రాయగలరా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

రోజుకు వెయ్యి మందిపైనే..

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి రోజుకు 1000 మంది భక్తుల వరకు సిఫార్సులతో దర్శనానికి వస్తున్నారు. తెలుగు రాషా్ట్రల నుంచి జిల్లా పరిషత చైర్మన్లు మొదలు కేంద్ర మంత్రుల వరకు ఈ సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. కొంతమంది కార్యాలయానికి ఫోన చేసి చెబుతుంటారు. మరికొంతమంది సందేశాలు పంపుతుంటారు. ఇలా వచ్చిన వారికి ప్రొటోకాల్‌ విభాగంలో సిబ్బంది ఒక సహాయకుడిని ఇచ్చి దర్శనానికి పంపుతుంటారు. ఈ సిఫార్సు దర్శనాలు ఎక్కువ కావడంతో దుర్గగుడి అధికారులు కొన్నాళ్ల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎంతమంది దర్శనానికి వస్తే అందులో సగం మందితో టికెట్లు కొనిపించాలని నిర్ణయించారు. ఒక సిఫార్సు లేఖపై నలుగురు వస్తే వారిలో ఇద్దరితో టికెట్లు కొనుగోలు చేయించి మిగిలిన ఇద్దరిని ఉచితంగా దర్శనానికి పంపుతున్నారు. ఇలా చేయడంతో దర్శనానికి వచ్చిన వారు ప్రొటోకాల్‌ ఆఫీస్‌ దగ్గర నుంచే సిఫార్సు చేసిన వారికి ఫోన చేసి టికెట్లు తీసుకోమంటున్నారని చెబుతున్నారు. సిఫార్సు చేసిన వారు సహాయకులపై చిందులు తొక్కడంతో సిబ్బంది చేసేదిలేక ఉచితంగానే అంతరాలయం దర్శనాలకు పంపుతున్నారు. ఇప్పుడు ఏకంగా సిఫార్సు లేఖలు ఇస్తున్న వారే భక్తులతో టికెట్లు కొనుగోలు చేయించవద్దని ఒక నోట్‌ పెడుతున్నారు. దేవస్థాన వర్గాల్లో ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అంతరాలయం తప్ప మరో దర్శనం వద్దు

ప్రజాప్రతినిధులు, అధికారుల పేషీల సిఫార్సులతో వచ్చిన భక్తులు అంతరాలయం దర్శనానికి తప్ప మరో దర్శనం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఫ్రొటోకాల్‌ జాబితాలో ఉన్న వీఐపీల సిఫారసుతో వచ్చినందున తమకు ప్రొటోకాల్‌ వర్తిస్తుందన్న భావనలో భక్తులు ఉంటున్నారు. దుర్గగుడికి ఆదివారం, మంగళవారం, శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు వారాల్లో రోజుకు 30 వేల నుంచి 40వేల మంది అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఆలయంలో ఉచిత దర్శనం, రూ.100, రూ.300, రూ.500 దర్శనాలు ఉన్నాయి. ఇందులో రూ.500 టికెట్‌ తీసుకున్న భక్తులను అంతరాలయంలోకి అనుమతిస్తారు. రూ.300 టికెట్‌ ఉన్న భక్తులకు ముఖ మండప దర్శనం చేయిస్తారు. ఆలయంలో ఒక్కోసారి రూ.500 క్యూ రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో సిఫార్సులతో వచ్చిన వారిని రూ.300 క్యూలో పంపాలని ప్రొటోకాల్‌ సిబ్బంది భావిస్తుంటారు. అంతరాలయం క్యూ రద్దీగా ఉన్నందున ముఖ మండప దర్శనానికి వెళ్లాలని సిబ్బంది భక్తులకు సూచిస్తుంటారు. దీనికి వారు ససేమిరా అంటున్నారు. దీనితో వారిని ప్రముఖులను తీసుకువెళ్లే మార్గంలో దర్శనానికి పంపాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపై అప్పటి వరకు గంటల తరబడి క్యూ లైనలో నిలబడిన భక్తులు మండిపడుతున్నారు. ఈ భక్తులకు అంతరాలయం చేయించకపోతే సిఫార్సు చేసినవారి నుంచి చివాట్లు పడతాయి అన్న భయంతో తప్పక అంతరాలయంలోకి పంపుతున్నారు. దీనివల్ల ఇతర భక్తుల నిరసనను తాము ఎదుర్కోవాల్సి వస్తుందని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. టికెట్లు తీసుకోవడం వల్ల వచ్చే ఆదాయం అమ్మవారి హుండీకే చెందుతుంది తప్ప తమ జేబులోకి రాదని ఆలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - Jun 12 , 2025 | 01:15 AM