AP High Court: ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్, లోకాయుక్త పోస్టుల భర్తీకి ఇబ్బందేంటి?: హైకోర్టు
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:01 AM
ఏపీఈఆర్‌సీ, లోకాయుక్త, తదితర సంస్థల అధిపతుల(హెడ్స్) నియామకంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది.
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీఈఆర్‌సీ, లోకాయుక్త, తదితర సంస్థల అధిపతుల(హెడ్స్) నియామకంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. ఆ పోస్టుల భర్తీ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. ఓ దశలో చీఫ్ సెక్రటరీ హాజరవ్వాలని ఆదేశించేందుకు సిద్ధమైంది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచుతామన్న ఎస్‌జీపీ విజ్ఞప్తితో విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్ పోస్టును భర్తీ చేసేలా ఆదేశించాలని కోరుతూ డాక్టర్ దొంతిరెడ్డి నరసింహారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై పిటిషనర్ తరఫు న్యాయవాది బుధవారం వాదనలు వినిపించారు. ఏపీఈఆర్‌సీలో సభ్యుడి పోస్టు భర్తీకి ఈ ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. చైర్‌పర్సన్ పోస్టు భర్తీకి చర్యలు తీసుకోలేదు’ అని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఈఆర్ సీ సభ్యుడి నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినట్టు వివరించారు.