నిధుల వినియోగం సక్రమంగా లేకపోతే ఎలా?
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:18 AM
జిల్లాలో ఎంపీ నిధుల వినియోగంలో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై వల్లభనేని బాలశౌరి అసహనం వ్యక్తం చేశారు. నిధులను సక్రమంగా వినియోగించుకోకపోతే ఎలా ప్రశ్నించారు. యాదవ కల్యాణ మండపం నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కాంట్రాక్టర్‌లను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలు అందజేస్తే నిధులు తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని వివరించారు.
- అధికారులను ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- జిల్లాలో ఎంపీ నిధుల వినియోగంపై అసంతృప్తి
- యాదవ కల్యాణ మండపం నిర్మాణం తీరుపై ఆగ్రహం
- కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సూచన
- మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి రూ.18.50 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు
- కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక పోర్టల్ అవసరం
-- దిశా సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి
జిల్లాలో ఎంపీ నిధుల వినియోగంలో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై వల్లభనేని బాలశౌరి అసహనం వ్యక్తం చేశారు. నిధులను సక్రమంగా వినియోగించుకోకపోతే ఎలా ప్రశ్నించారు. యాదవ కల్యాణ మండపం నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కాంట్రాక్టర్‌లను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలు అందజేస్తే నిధులు తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని వివరించారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
ప్రజోపయోగమైన పనులకు ఎంపీ నిధులు, సీఎస్‌ఆర్ నిధులను మంజూరు చేస్తే, ఆ నిధులను సక్రమంగా వినియోగించకపోతే ఎలాగని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. జిల్లా పరిషత సమావేశపు హాలులో సోమవారం జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ(దిశా) సమావేశం ఎంపీ బాలశౌరి అధ్యక్షతన జరిగింది. వివిధ విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలు అమలుపై చర్చించారు. మచిలీపట్నం గొడుగుపేటలో యాదవ కల్యాణ మండపం నిర్మాణానికి రూ.50 లక్షల సీఎస్‌ఆర్ నిధులను మంజూరు చేస్తే, పునాదుల దశలో కేవలం ఆరు పిల్లర్లు వేసి నిధులు మొత్తం ఖర్చయిపోయాయని, మరో రూ.50లక్షల నిధులు ఇవ్వాలని కాంట్రాక్టర్ చెబుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమన్నారు. ఈ అంశంపై విచారణ చేసి, సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, ఇప్పటి వరకు వాస్తవంగా ఖర్చు చేసిన నగదు మినహా, మిగిలిన మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలని కలెక్టర్ బాలాజీకి ఎంపీ సూచించారు.
సర్వజన ఆస్పత్రిలో రెండు విభాగాల ఏర్పాటుకు రూ.18.50 కోట్లు
మచిలీపట్నం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో యాంజియోగ్రామ్ సేవలు అందుబాటులో లేవని, ఇక్కడ క్యాతల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు బెల్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధులు రూ.6.50 కోట్లు మంజూరు చేయిస్తానని ఎంపీ బాలశౌరి తెలిపారు. దీంతో పాటు కేన్సర్ చికిత్స కోసం రేడియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఓఎన్‌జీసీ నుంచి సీఎస్‌ఆర్ నిధులు రూ.12కోట్లను తీసుకువస్తానని భరోసా ఇచ్చారు. గుడివాడ ఏరియా ఆస్పత్రిలో సీటీ స్కానర్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.1.80 కోట్ల ఎంపీ నిధులను రెండేళ్ల క్రితమే మంజూరు చేసినా అక్కడ సీటీ స్కానర్‌ను ఏర్పాటు చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ సీటీ స్కానర్ ఏర్పాటుకు రూ.3.40 కోట్లు అవుతుందని, దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. తాను కేటాయించిన నగదును నూతనంగా నిర్మాణం చేసిన పెదపారుపూడి పీహెచ్‌సీలో అయినా వినియోగించాలని ఎంపీ కలెక్టర్‌కు సూచించారు. జిల్ల్లాలోని పీహెచ్‌సీలలో అవసరమైన పరికరాలకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను తనకు ఇస్తే నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు.
దాళ్వా పంటకు నీరిస్తారా.. కాల్వలు బాగుచేస్తారా!
ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని భారీగా సముద్రంలోకి వదిలేస్తున్నారని, జిల్లాలో సముద్రతీర ప్రాంత మండలాల్లో ఈ ఏడాది రబీ సీజన్‌లో దాళ్వా పంటకు సాగు నీరు ఇస్తారా, పంట కాల్వలను బాగుచేస్తారా అని ఎంపీ బాలశౌరి జలవనరులశాఖ అధికారులను ప్రశ్నించారు. జిల్ల్లాలో కాల్వల నిర్వహణ పనులకు ఎంతమేర నిధులు విడుదల చేశారు. పంట కాల్వలు, డ్రెయిన్‌లలో మురుగునీటి పారుదలకు ఆటంకం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాల్వల నిర్వహణ పనులకు రూ.15కోట్ల నిధులను విడుదల చేశారని, వీటితో పనులు జరుగుతున్నాయని కలెక్టర్, అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం వద్ద, మోపిదేవి మండలం బండికోళ్లలంక వద్ద రెండు బ్యారేజీలను నిర్మాణం చేయాల్సి ఉందని, ఈ బ్యారేజీ నిర్మాణం జరిగితే ఇక్కడ నీటిని నిల్వ ఉంచి జల్‌జీవన్ మిషన్ ద్వారా తాగునీటిని జిల్లాలోని గ్రామాలకు అందించేందుకు అవకాశం ఉంటుందని ఎంపీ అన్నారు. ఈ బ్యారేజీలకు సంబంధించిన తుది డీటెయిల్ట్ ప్రాజెక్టు రిపోర్టులను త్వరితగతిన తయారు చేయాలని ఎంపీ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో ఈ బ్యారేజీల నిర్మాణం విషయంపై తాను మాట్లాడుతానని వివరించారు.
రహదారుల అభివృద్ధికి మూడు సార్లు భూమి తీసుకుంటే ఎలా?
జాతీయ రహదారి-65 విస్తరణలో భాగంగా మచిలీపట్నం సమీపంలోని ఎస్‌ఎన్‌గొల్లపాలెం వద్ద రైతుల నుంచి ఇప్పటికే రెండు విడతలుగా భూమిని తీసుకున్నారని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ రహదారి విస్తరణ కోసం మూడో విడత రైతుల నుంచి భూమిని తీసుకుంటున్నారని, ఈ అంశంపై రైతులు గొడవ చేస్తున్నారని, జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి వేరే ప్రాంతంలో భూసేకరణపై జాతీయ రహదారుల అధికారులు దృష్టి సారించాలని సూచించారు. భూమి కోల్పోయే రైతులు మీ వద్దకు వస్తారని, వారు చెప్పిన అంశాలను జాతీయరహదారుల విభాగం అధికారులు పరిగణనలోకి తీసకుని వారికి తగు న్యాయం చేయాలన్నారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారి విస్తరణలో బాగంగా తాగు నీటి పైప్‌లైన్ దెబ్బతిందని, దీంతో ఆ గ్రామానికి తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎంపీ సూచించారు. పెడన వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలోనూ తీవ్ర ఆలస్యం జరుగుతోందని, త్వరితగతిన ఈ పనిని పూర్తి చేయాలన్నారు.
కౌలు రైతులకు పంట రుణాలు ఇప్పించండి
కౌలు రైతులకు పంట రుణాలు ఇప్పించడానికి ప్రత్యేక పోర్టల్‌ను తయారు చేయాలని, ఈ అంశంపై కలెక్టర్ చొరవ చూపాలని, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి విధివిధానాలు ఖరారు చేయాలని ఎంపీ బాలశౌరి కలెక్టర్ బాలాజీకి సూచించారు. ఈ అంశంలో జిల్లా ప్రయోగాత్మకంగా పనిచేసి విజయవంతం చేస్తే, కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడంతో కృష్ణాజిల్లాను ఆదర్శంగా తీసుకోవాలనే విషయంపై పార్లమెంటులో తాను ప్రస్తావిస్తానని ఎంపీ అన్నారు. అమృత-2.0 ద్వారా వచ్చిన నిధులతో జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు. తాడిగడప, పెడన పురపాలక సంఘాలు త్వరితగతిన పనులకు టెండర్‌లు పిలిచి, పనులు ప్రారంభించాలన్నారు. కాంట్రాక్టర్లు ధరలు పెంచాలని కోర్టును ఆశ్రయించారని, త్వరలో ఈ నిధులతో పనులు ప్రారంభిస్తామని మునిసిపల్ కమిషనర్‌లు తెలిపారు. నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద కృష్ణానదిపై వారధి నిర్మాణం అంశంపై ఎంపీ ఆరా తీశారు. గతంలో రూ.1.09 కోట్లతో అంచనాలు రూపొందించి నివేదికను పంపామని, ఈ అంచనాలలో మార్పులు చేసి 1.60 కోట్లకు వారధి నిర్మాణం వ్యయాన్ని పెంచామని, పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేస్తామని కేంద్రప్రభుత్వం తెలిపిందని అఽధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ఎం.నవీన్, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, దిశా కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.