Share News

అవిశ్వాసం ఏమయ్యేనో?

ABN , Publish Date - May 07 , 2025 | 11:31 PM

నందికొట్కూరులో మున్సిపల్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. భిన్న రాజకీయాలతో ప్రస్తుతం పట్టణ రాజకీయం వేడెక్కింది.

   అవిశ్వాసం ఏమయ్యేనో?
మున్సిపల్‌ కమిషనర్‌తో మాట్లాడుతున్న ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి

నందికొట్కూరులో భిన్న పరిస్థితులు

రేసులో టీడీపీలోని రెండు వర్గాలు

సాంకేతికంగా వైసీపీ సభ్యులే కానీ..

ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల్లో కౌన్సిలర్లు

నేడు నందికొట్కూరు మున్సిపల్‌ చైర్మనపై అవిశ్వాసం

నందికొట్కూరు, మే 7 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరులో మున్సిపల్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. భిన్న రాజకీయాలతో ప్రస్తుతం పట్టణ రాజకీయం వేడెక్కింది. రాష్ట్రమంతా ఒకలా నందికొట్కూరులో మాత్రం మరోలా మున్సిపల్‌ అవిశ్వాసం సాగుతోంది. వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠతకు దారి తీసిన అవిశ్వాస తీర్మానానికి గురువారం తెరపడనుంది. మున్సిపల్‌ చైర్మన దాసి సుధాకర్‌ రెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని కౌన్సిల్‌లో ప్రవేశపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక సమావేశానికి స్పెషల్‌ ఆఫీసర్‌గా ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి భారీ భద్రత, బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనల మేరకే అవిశ్వాస తీర్మానం కొనసాగుతుందన్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ సమావేశం జరుగుతుందని తెలిపారు. మొత్తం మీద టీడీపీలోని రెండు వర్గాల కారణంగా అవిశ్వాస తీర్మానం సమావేశం జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు వర్గాల్లోని వారు ఎవరికి వారుగా ఉండటంతో సరైన కోరం ఉంటుందా? లేక కొందరు కౌన్సిలర్లు గైర్హాజరవుతారా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఎవరి లెక్కలు వారివే...

29 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో వైసీపీకి సాంకేతికంగా 28 మంది సభ్యులు, టీడీపీ నుంచి ఒక సభ్యుడు ఉన్నారు. వీరు కాకుండా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో 28 మంది వైసీపీ నుంచి కౌన్సిలర్లుగా గెలిచినప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాత 26 మంది తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. వీరిలో మున్సిపల్‌ చైర్మన దాసి సుధాకర్‌ రెడ్డితో పాటు మరో 10 మంది కౌన్సిలర్లు ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో ఉన్నారు. మరో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు కూడా ఆ వర్గానికే మద్దతు పలికారు. ఇక 16 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వర్గంలో ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో బలనిరూపణ జరగాలంటే 2/3 వంతు సభ్యులు ఉండాలి. ఈ ప్రకారం చూస్తే 19 మంది కౌన్సిలర్లు సభకు హాజరు కావాలి. సభకు హాజరైన వారిలో సగం కంటే ఒకరు ఎక్కువ ఉంటే వారిదేపై చేయి అవుతుందని అధికారులు చెబుతున్నారు. కోరం లేకపోతే పరిస్థితిని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి వారి సలహా మేరకు సభను నిర్వహించాలా? లేక రద్దు చేయాలా? అన్న అన్న విషయంపై స్పెషల్‌ ఆఫీసర్‌ నిర్ణయం తీసుకుంటారు. అవిశ్వాసం నెగ్గితే ప్రస్తుతం ఉన్న వైస్‌ చైర్మన్లలో ఒకరిని తాత్కాలిక చైర్మనగా ప్రకటించి, రెండు నెలల తర్వాత కొత్త చైర్మనను ఎన్నుకుంటారు. ఒకవేళ అవిశ్వాసం వీగిపోతే ప్రస్తుతం ఉన్న చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి పదవిలో అలాగే కొనసాగుతారు. అదీ కాకుండా ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో ఉన్న 13 మంది గైర్హాజరైతే సరైన కోరం లేక అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యూహంతో చైర్మన దాసి సుధాకర్‌ రెడ్డి వర్గం సభకు వస్తుందా? రాదా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

క్యాంపు రాజకీయాలు

మున్సిపల్‌ చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్న 16 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అవిశ్వాసం కోరుతూ ఏప్రిల్‌ 15వ తేదీన కలెక్టర్‌కు సమర్పించారు. దీంతో కలెక్టర్‌ ఆత్మకూరు ఆర్డీఓను ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా నియమించారు. దీంతో ఆమె మే 8వ తేదీన అవిశ్వాస సమావేశానికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వారం రోజులుగా కౌన్సిలర్లను ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు క్యాంపులకు తరలించారు. ఎంపీ వర్గం కౌన్సిలర్లు ఊటికి వెళ్లగా, ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు హైదరాబాదులో మకాం వేశారు. అయినప్పటికీ ఎవరికి వారుగా కౌన్సిలర్లను తమవైపు లాక్కునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా తమ పార్టీకి చెందిన వారితో పాటు ఎంపీ వర్గంలో ఉన్న కొందరు కౌన్సిలర్లను తమ వద్దకు రప్పించుకొని తప్పకుండా దాసి సుధాకర్‌రెడ్డికే మద్దతు తెలపాలని ఆదేశించినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వారం రోజులుగా క్యాంపు రాజకీయాల్లో ఉన్న కౌన్సిలర్లు గురువారం నేరుగా మున్సిపల్‌ కార్యాలయంలో జరిగే అవిశ్వాస తీర్మానానికి హాజరు కానున్నారు.

Updated Date - May 07 , 2025 | 11:31 PM